Pravilika case : ఉద్యోగ నియామకాలు ఆలస్యం కావడంతో శుక్రవారం హైదరాబాదులోని గాంధీనగర్లో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆమె ఆత్మహత్యకు సంబంధించి శుక్రవారం రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా ఆమె స్వగ్రామంలో కూడా పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె మృతికి సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ, వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. శుక్రవారం రాత్రి ఆర్టిసి క్రాస్ రోడ్ లో విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించడంతో పోలీసులు ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్లో డిమాండ్ చేశారు.
అయితే ప్రవళిక ఆత్మహత్యకు సంబంధించి ప్రేమ వ్యవహారమే కారణమని సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రవళికను ప్రియుడు మోసం చేసి వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆయన వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బిక్కాజి పల్లికి చెందిన ప్రవళిక గ్రూప్స్ కోచింగ్ కోసం అశోక్ నగర్ లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్లో 15 రోజుల క్రితం జాయిన్ అయింది. ఆమెకు హాస్టల్లో శృతి, సంధ్య అనే స్నేహితురాళ్ళు ఉన్నారు. శుక్రవారం రాత్రి రూమ్ లో ఒక్కతే ఉంది. ఈ క్రమంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాసింది. అయితే ఆమె ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు విచారణ నిర్వహించగా.. ఆమె ఫోన్లో ఒక చాటింగ్ గమనించారు. కోస్గి మండలానికి చెందిన శివరాం రాథోడ్ అనే యువకుడితో ఆమె ప్రవేట్ చాటింగ్ చేసింది. అంతేకాకుండా గురువారం ఉదయం అతడితో బాలాజీ దర్శనన్ అనే హోటల్లో టిఫిన్ కూడా చేసింది. అయితే శివరాం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని పోలీసులు ప్రవళిక చాట్ లో గుర్తించారు. శివరాం ఆమెను మోసం చేశాడని.. అందుకే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రవళిక ప్రేమ వ్యవహారం వారి తల్లిదండ్రులకు కూడా తెలుసని పోలీసులు చెబుతున్నారు. గతంలో ఇదే విషయంపై ఆమెను వారు మందలించారు. ప్రవళిక సూసైడ్ లెటర్, చాటింగ్ హిస్టరీని మొత్తం పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఆ ల్యాబ్ నివేదిక అనంతరం శివరాంపై కేసు నమోదు చేస్తామని పోలీసులు ప్రకటించారు.
మరోవైపు ప్రవళిక ఆత్మహత్యకు సంబంధించి ఆమె తల్లిదండ్రులు చెబుతున్న వాదన మరో విధంగా ఉంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వాయిదా పడటంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రేమ వ్యవహారం లాంటిది ఏదీ లేదని, పోలీసులు, అధికార పార్టీ నాయకులు తన కూతురిపై లేనిపోని ఆబాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవళిక ఆత్మహత్య అనంతరం ఆమె మృతదేహాన్ని పోలీసులు అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య స్వస్థలానికి తరలించారు. శని వారం ఆమె స్వగ్రామంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ప్రవళిక ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు చెబుతున్నది ఒక తీరుగా ఉంటే, ఆమె తల్లిదండ్రులు చెబుతున్న వాదన మరో విధంగా ఉంది. అయితే ఈ రెండు వాదనల్లో ఏది నిజం అనేది తేలాల్సి ఉంది.