
Pawan Kalyan CM: వంగవీటి మోహన్ రంగా తరువాత కాపు ఉద్యమాలు ఎన్నో వచ్చినా అవి నిలబడలేదు. గత ఎన్నికల ముందు ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. కానీ దాని ఫలితాలను అప్పటి విపక్ష నేత జగన్ రాజకీయంగా ఉపయోగించుకున్నారు. చంద్రబాబు సర్కారు ఐదు శాతం ఈబీసీ రిజర్వేషన్లు కాపులకు ప్రకటించినా.. ముద్రగడ ఉద్యమం వెనుక వైసీపీ ఉందన్నది ఒక ప్రధాన ఆరోపణ. కార్యం విజయవంతమైందో.. లేక ఏ ఇతర కారణాలు తెలియదు..,కానీ కాపు సంఘాల నాయకులు తనను అనుమానపు చూపులతో చూస్తున్నారని భావించి ముద్రగడ ఉద్యమాన్ని బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎనిమిది పదుల వయసులో మాజీ మంత్రి, ఎంపీ చేగొండి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ ఉద్యమ నిర్వహణ బాధ్యతను తనపై వేసుకున్నారు.
తన రాజకీయ జీవితంలో హరిరామజోగయ్య చేయని పదవి లేదు. సమితి ప్రెసిడెంట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, మంత్రిగా, ఎంపీగా పదవులు నిర్వహించారు. ప్రస్తుతం వయోభారంతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన కాపు రిజర్వేషన్ ఉద్యమం ఎత్తుకోవడం ఏమిటనేది ప్రశ్న. కానీ ఆయన పక్కా వ్యూహంతోనే ఉద్యమానికి దిగినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. నాడు ముద్రగడ వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పట్టారు. ఇప్పుడు జగన్ ను ఇరుకున పెట్టి పవన్ కు లబ్ధి చేకూర్చేందుకు హరిరామజోగయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే నాడు ముద్రగడ డైరెక్ట్ గా చెప్పకున్నా.. ఇప్పుడు హరిరామజోగయ్య మాత్రం తాను పవన్ కోసమే ఇదంతా చేస్తున్నట్టు ప్రకటించారు.

ముద్రగడ, హరిరామజోగయ్యలు రాజకీయ పార్టీల్లో పనిచేశారు. ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. నాటి ప్రభుత్వాలు కాపు రిజర్వేషన్ అమలుచేయకున్నా ప్రశ్నించలేదు. కానీ ఎప్పుడైతే కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తలకెక్కించుకున్నారో అప్పుడే రాజకీయంగా వారికి మైనస్ గా మారింది. ముద్రగడ కాపు పల్లవి అందుకున్న తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఓడిపోయారు. ఇతర సామాజికవర్గాల వారు ఆయనకు దూరంగా జరిగిపోయారు. హరిరామజోగయ్యది అదే సీన్. అయితే వయోభారంతో బాధపడుతున్న హరిరామజోగయ్య మాత్రం ఇప్పుడు పవన్ కోసం హార్ట్ కోర్ గా పనిచేయడం ప్రారంభించారు. పవన్ ను సీఎం చేయడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు. జనసేనలో చేరకుండానే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం ఇస్తున్నారు. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే టీడీపీతో జనసేన కూటమి కడుతుందని కూడా స్పష్టం చేశారు. అయితే పొత్తుల్లో సీట్ల పంపకాలు బట్టి చూస్తే అధికార పంపకాలు సాధ్యమయ్యేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత ఎన్నికల్లో 57 నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రభావం చూపినందున.. ఆ సీట్లను పవన్ కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం 20 నుంచి 30 మధ్య సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారన్న ప్రచారం ఉంది. అన్ని తక్కువ సీట్లతో అధికార పీఠంపై కూర్చోవడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కానీ హరిరామజోగయ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీఎంగా పవన్ ను చేసి చరిత్రగమనంలో కాపు కులంలో తనకంటూ ఒక పేరు నిలిచిపోవాలని ఆశిస్తున్నట్టుందని విశ్లేషకులు భావిస్తున్నారు.