AP- Telangana: ఆ ఇద్దరూ వ్యక్తిగతంగా మంచి మిత్రులు. సొంత పనుల్లో సహకరించుకుంటారు. కానీ ఆ రెండు రాష్ట్రాలు మాత్రం ఆరని అగ్నిగుండంలా మండాలనుకుంటారు. సొంత పనులుంటే కూర్చుని మాట్లాడుతారు. కానీ రాష్ట్రాల విషయానికొస్తే లేఖల యుద్ధం చేస్తారు. వారిద్దరూ ఎవరో కాదు. ఆంధ్ర, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్ లు.

ఏపీలో బీఆర్ఎస్ ను విస్తరించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు కేసీఆర్. గతంలో తిట్టింది ఏపీ పాలకుల్నే తప్పా.. ప్రజల్ని కాదని సర్దిచెబుతున్నారు. ఇంతలోనే ఏపీ రూ. 495 కోట్లు ఇవ్వడం లేదని కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. ఏపీకి బదలాయించిన సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీం నిధులు రూ. 495 కోట్లు తిరిగి ఇప్పించాలని తెలంగాణ మంత్రి హరీష్ రావ్.. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ కు లేఖ రాశారు. 2014-15లో తెలంగాణకు రావాల్సిన సీఎస్ఎస్ నిధులు పొరపాటుగా ఏపీకి బదలాయించారని లేఖలో వివరించారు. దీంతో తెలంగాణ నష్టపోయిందని స్పష్టం చేశారు. ఏపీ, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు సమస్య పరిష్కారం కాలేదని హరీష్ రావు తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ నిధులు ఇప్పించాలని కోరారు.
విద్యుత్ బకాయిల వివాదం కూడ ఇలాంటిదే. తెలంగాణ నుంచి ఏపీకి ఆరున్నర వేల కోట్లు రావాలని ఏపీ వాదిస్తోంది. కేంద్రం ఏపీకి ఇవ్వాలని ఆదేశించింది. దీని పై తెలంగాణ కోర్టుకెళ్లింది. ఆ విషయం అలాగే ఉండిపోయింది. ఈ సందర్బంగా ఆ అంశం కూడ తెర మీదకు వస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ విస్తరించాలని గట్టిగా ప్రయత్నిస్తున్న వేళ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలు బీఆర్ఎస్ విస్తరణకు మోకాలొడ్డే పరిస్థితి కనిపిస్తోంది.

రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు తెరమీదకి వస్తే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ కష్టం అవుతుంది. కేసీఆర్ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారవుతుంది. గతంలో లాగ ఎన్నికల సమయంలో ఏపీని తిట్టలేరు. ఏపీ పాలకుల్ని విమర్శించలేరు. ఏపీ, తెలంగాణ సమస్యలను అడ్డంపెట్టుకుని రాజకీయం చేయలేరు. తెలంగాణ నుంచి ఏపీకి ఇవ్వాల్సిన బకాయిలన్నా చెల్లించాలి. లేదా ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులన్నా వదులుకోవాలి. ఇంతకు మించిన ప్రత్యామ్నాయ మార్గం కేసీఆర్ కు లేదు. ఏపీ సీఎంతో కేసీఆర్ కు సత్సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చు. సమస్యలు పరిష్కరించుకోవచ్చు. సొంత అవసరాలకు పరస్పరం సహకరించుకునే నేతలు రాష్ట్రాల కోసం కూర్చుని మాట్లాడితే నష్టమేం లేదు కదా.