Chandrababu: స్కిల్ స్కాంనకు సంబంధించి సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. విచారణ పూర్తయి రెండు వారాలు దాటుతోంది. నవంబర్ 8న తీర్పు వెల్లడిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అక్టోబర్ 20న ఈ కేసు విచారణ పూర్తయ్యింది. ప్రధానంగా 17 ఏ సెక్షన్ చుట్టూ వాదనలు కొనసాగాయి. దీంతో సుదీర్ఘ వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అటు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై సైతం తొమ్మిదో తేదీ లోపు తీర్పు ఇస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఆ మేరకు లిస్ట్ అయ్యింది కూడా. అయితే నిన్న క్వాష్ పిటిషన్ పై ఎటువంటి తీర్పు వెల్లడించలేదు. ఇప్పుడు ఫైబర్ నెట్ ముందస్తు బెయిల్ పై విచారణ విషయంలో సందిగ్ధత నెలకొంది.
సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు మాత్రం ఇంకా లిస్ట్ కాలేదు. అప్పట్లో ఫైబర్ నెట్ కేసులో బెయిల్ విషయంలో క్వాష్ పిటిషన్ అంశం ప్రభావితం చేసింది. తీర్పు పెండింగ్లో ఉండడంతో.. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ విచారణ సైతం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈరోజు మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుండడంతో.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు గురించి ప్రస్తావించే అవకాశం ఉంది.
చంద్రబాబు అరెస్టు విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని.. ఆయన ఈ రాష్ట్రానికి సుదీర్ఘంగా పాలించిన సీఎం అని.. అవినీతి కేసుల విషయంలో రాజకీయ కక్షపూరితంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదని.. అవినీతి కేసులను విచారించే క్రమంలో నిందితులుగా ఉండే రాజకీయ ప్రముఖులను అరెస్టు చేసే సమయంలో తప్పకుండా గవర్నర్ అనుమతి తీసుకోవాలని.. 2018లో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించింది. అయితే అంతకంటే ముందే ఈ కేసు నమోదై ఉందని.. అందుకే గవర్నర్ అనుమతి అవసరం లేదని సిఐడి వాదిస్తోంది. అయితే చంద్రబాబుపై కేసు నమోదు తో పాటు ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చడం ఇటీవలే జరిగిందని.. తప్పకుండా 17 ఏ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. అవినీతి నిరోధక చట్టం విషయంలో ఒక ప్రభుత్వం.. గత ప్రభుత్వ అధినేత పై కేసులు నమోదు చేయడం.. దానిపై సుదీర్ఘ వాదనలు జరగడంతో తీర్పుపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల నేతలు ఎదురుచూస్తున్నారు.
చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ తో చాలా కేసులు లింక్ అయి ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఫైబర్ నెట్ మధ్యంతర బెయిల్ విచారణ సమయంలో చంద్రబాబుపై దాఖలైన మద్యం, ఇసుక కేసుల గురించి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకే క్వాష్ పిటిషన్ పై తీర్పు వెంటనే ప్రకటిస్తారా? లేకపోతే మరేదైనా తేదీని ప్రకటిస్తారా? అన్నది అప్పుడే ధర్మాసనం వెల్లడించే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాతే మిగతా కేసులు విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.