Anakapalli: ఇటీవల ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవానికి..సభలు, సమావేశాలకు విద్యార్థులను తరలిస్తుండడం పరిపాటిగా మారింది. దీనిపై హైకోర్టు సీరియస్ అయినా ప్రభుత్వం, యంత్రాంగం వెనక్కి తగ్గడం లేదు. దీంతో విద్యార్థులకు అసౌకర్యం తప్పడం లేదు. తాజాగా ఇటువంటి ఘటనే అనకాపల్లి జిల్లాలో వెలుగు చూసింది.
అరబిందో ఫార్మా కంపెనీ 9,10 తరగతులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు సైకిళ్ల ను సమకూర్చింది. రూ.1.75 కోట్లతో 2500 సైకిళ్ల ను అందించేందుకు ముందుకు వచ్చింది. శనివారం ఉదయం 9 గంటలకు అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడా మైదానంలో విద్యార్థినులకు అందించేందుకు నిర్ణయించింది. ఉదయం ఎనిమిది గంటలకి విద్యార్థులను మైదానానికి తరలించారు. కానీ మంత్రి అమర్నాథ్ 10. 45 గంటలకు చేరుకున్నారు.
అప్పటివరకు విద్యార్థినులు తల్లిదండ్రులు ఎండలోనే నిరీక్షిస్తూ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొందరు విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. సపర్యలు చేయడంతో తేరుకున్నారు. దీంతో మంత్రి అమర్నాథ్ తీరుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ప్రైవేట్ కంపెనీ సమకూర్చిన సైకిళ్ల పంపిణీ కూడా ఆలస్యంగా రావడం ఏమిటని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఇప్పటికే అమ్మ ఒడి కార్యక్రమానికి విద్యార్థులను తరలించడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లిలో విద్యార్థినులు అసౌకర్యానికి గురి కావడం విశేషం.
కాగా ఈ 2500 సైకిళ్లను సమకూర్చింది అరబిందో ఫార్మా కంపెనీ. ఈ సైకిళ్లపై సైతం వైసిపి రంగులు వేయడం విశేషం. ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరిందని విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.