
సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి చోటుచేసుకుంది. అప్పటికే పెళ్లి అయ్యి భర్త, ఇద్దరు పిల్లలున్న ఓ మహిళా టెకీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ అందమైన తన ఫొటోను షేర్ చేసుకుంది.కానీ కొందరు దుర్మార్గులు ఆమె ఫొటోను తీసుకొని సోషల్ మీడియాలో దారుణంగా పోస్ట్ చేశారు. ఆ పరువుగల మహిళా టెకీని హైప్రొఫైల్ సెక్స్ వర్కర్ గా చూపిస్తూ వైరల్ చేశారు. ఈ దారుణ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది.
40 ఏళ్ల వయసున్న బాధితురాలు కొంతకాలంగా గ్రేటర్ నోయిడాలోని ఓ టాప్ మల్టీ నేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీలో సీనియర్ ర్యాంక్ లో పనిచేస్తున్నారు. ఆకర్షనీయమైన వేతనాన్ని పొందుతున్నారు. ఆమెకు పెళ్లైంది. భర్త, ఇద్దరు పిల్లలతో నోయిడాలో జీవిస్తోంది. కొద్దిరోజుల కిందటే ఆమె తన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫొటోను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేసి ఈమె హై ప్రొఫైల్ సెక్స్ వర్కర్ అంటూ పోస్ట్ ను వైరల్ చేయడం దుమారం రేపింది.. మహిళా టెకీ ఫొటో.. ఫోన్ నంబర్ తో సహా సోషల్ మీడియాలో షేర్ కావడం నోయిడాలో కలకలం రేపుతోంది.
ఈ పరిణామంతో గ్రేటర్ నోయిడా మహిళా టెక్కీల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఫొటో వైరల్ కావడం.. ఆమెకు అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపుల్లో ఈమె ఫొటోను పోస్ట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఫొటో పెయిడ్ సెక్స్ వర్కర్ గ్రూపులో కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును సైబర్ సెక్యూరిటీ విభాగానికి బదలాయించారు.
మహిళా టెకీ ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు తమ దందా కోసం వినియోగించుకున్నారని పోలీసులు కనిపెట్టారు. మరీ ఘోరం ఏంటంటే.. ఆ మహిళా టెకీ ఫొటో కింద.. గంటకు 5వేలు, ఫుల్ నైట్ రూ.15వేలు రేటు అంటూ నిర్ధారించినట్టు పోలీసులు గుర్తించారు. పేమంట్ కోసం ఈ గుర్తు తెలియని దుండగులు తమ బ్యాంక్ ఖాతా అయిన కోటక్ మహేంద్ర బ్యాంక్ అకౌంట్ నంబర్ ను ఇచ్చారు. దీంతో ఈ అకౌంట్ ఆధారంగానే పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. నోయిడాలో మహిళా టెకీలకు భద్రత కల్పిస్తామని నోయిడా పోలీస్ కమిషనర్ తెలిపారు. షేర్ చేసిన వారిని పట్టుకుంటామని ప్రకటించారు.