Anand Mahindra : కుర్చీ పట్టేంత స్పేస్ లో ఏఐ జిమ్.. ఆనంద్ మహీంద్రా ను ఆకర్షించింది.. మిలియన్ వ్యూస్ కొల్లగొట్టింది..మీరూ చూసేయండి..

మీరు రోజు జిమ్ కు వెళ్తారా? అది ఎంత స్పేస్ లో ఉంటుంది? అందులో ఉన్న పరికరాలు ఎలా ఉంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా? తక్కువలో తక్కువ 100 sft నుంచి 1000 sft వరకు జిమ్ ఉంటుంది.. కానీ ఒక కుర్చీ పట్టేంత స్పేస్ లో జిమ్ ఉండడం మీరు ఎప్పుడైనా చూశారా? అయితే చదివేయండి ఈ కథనం..

Written By: Anabothula Bhaskar, Updated On : October 25, 2024 9:59 pm

Anand Mahindra Tweet

Follow us on

Anand Mahindra : మనదేశంలో పేరుపొందిన పారిశ్రామికవేత్తలలో ఆనంద్ మహీంద్రా ఒకరు. అయితే ఈయన మిగతా పారిశ్రామికవేత్తల లాగా ఉండరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్లో ఈయనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన తన ట్విట్టర్ ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేస్తుంటారు. తను ఆగర్భ శ్రీమంతుడైనప్పటికీ.. అలాంటి విషయాలను చెప్పడంలో ఏమాత్రం మొహమాట పడరు. పైగా అందులోనూ తన నవ్యతను ప్రదర్శిస్తారు. అందువల్లే ఆనంద్ మహీంద్రా చేసే ట్వీట్ కు ఒక స్థాయి ఉంటుంది. మనదేశంలో యువత చేసిన ఆవిష్కరణలను బయటి ప్రపంచానికి తెలియజేయడంలో ఆనంద్ మహీంద్రా ముందుంటారు. తాజాగా ఆయన ఢిల్లీ ఐఐటి విద్యార్థులు ఆవిష్కరించిన ఏఐ ఆధారిత జిమ్ కు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ” నలుగురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు సృష్టించిన హోం జిమ్ ఇది. ఇక్కడ రాకెట్ సెన్స్ లేదు. కానీ మెకానిక్స్, ఫిజికల్ థెరపీ సూత్రాల తెలివైన కలయిక ఉంది. ప్రపంచ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఉత్పత్తిని రూపొందించేందుకు ఇది తోడ్పడుతుంది. అపార్ట్మెంట్లలో, వ్యాపార సముదాయాలలో, హోటల్స్, ఇతర గదుల్లో కూడా దీని ఏర్పాటు చేసుకోవచ్చని” ఆనంద్ వ్యాఖ్యానించారు.. దీంతో ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సంపాదించుకుంది..

ఐఐటి కుర్రాళ్ల అద్భుతం

ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన వీడియోలో ఢిల్లీ ఐఐటీ కి చెందిన నలుగురు విద్యార్థులు కనిపించారు. వాళ్ల పేర్లు అమన్ రాయ్, అనురాగ్ దాని, రోహిత్ పటేల్, అమల్ జార్జ్. వీరు ఇక తమ చదువును పూర్తి చేయలేదు. అయినప్పటికీ ఏఐ ఆధారిత జిమ్ ను ఏర్పాటు చేశారు.. దానికి “అరో లీప్ ఎక్స్” అని పేరు పెట్టారు. సాధారణంగా మన దేశంలో ఇంట్లో లేదా బయట జిమ్ ఏర్పాటు చేసుకోవాలంటే చాలా స్పేస్ అవసరం పడుతుంది. మహా నగరాల్లో ఉండేవారికి అద్దెకు ఇల్లు దొరకడమే కష్టం. అలాంటిది జిమ్ ఏర్పాటు చేయాలంటే అంత సులభం కాదు. అలాంటి వారికోసం ఈ ఢిల్లీ ఐఐటి కుర్రాళ్ళు అరో లీప్ ఎక్స్ పేరుతో ఏర్పాటు చేసిన జిమ్ ఎంతగానో ఉపకరిస్తుంది. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పైగా ఇది ఏఐ ఆధారంగా పనిచేస్తుంది. రకరకాల వర్కౌట్లను నేర్పిస్తుంది. శరీర సామర్థ్యాన్ని మెరుగుపరిచే విధంగా.. ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా సలహాలు ఇస్తుంది. ఇప్పటివరకు ఎన్నో రకాల జిమ్ ఉపకరణాలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. తొలిసారిగా ఏఐ ఆధారిత జిమ్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ విద్యార్థులు రూపొందించిన ఈ జిమ్ ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్ జెరోదా ఫౌండర్ నితిన్ కామత్ ను విపరీతంగా ఆకర్షించింది. దీంతో ఆ విద్యార్థుల ఆవిష్కరణకు నితిన్ కామత్ పెట్టుబడి పెట్టారు. ఫలితంగా ఆ విద్యార్థులు “ఆరో లిప్ ఎక్స్” జిమ్ ను తయారు చేయడం మొదలుపెట్టారు.

20 నగరాలలో 300 యూనిట్లు

ఇప్పటివరకు మనదేశంలో 20 నగరాలలో 300 యూనిట్ల వరకు విక్రయించారు. సుమారు 3.5 కోట్ల టర్నోవర్ సాధించారు. ఆ విద్యార్థులు ఈ స్థాయిలో అభివృద్ధి చెందినప్పటికీ.. తమ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. పైగా తమ ఆవిష్కరణలను మరింత వినూత్నంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏఐ తో నడిచే వినూత్నమైన జిమ్ లను రూపొందించాలని భావిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది..” ఇప్పటివరకు గదులలో ఏర్పాటుచేసిన జిమ్ లను చూశాం. అపార్ట్మెంట్లలో ఏర్పాటుచేసిన జిమ్ లనూ కూడా చూసాం. కానీ తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే జిమ్ ను చూస్తున్నాం. పైగా దీనిని ఒక మూలన మడత పెట్టొచ్చు. ఐడియా అదిరింది” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.