Amravati: అడుగడుగునా ఆంక్షలు.. అక్రమ అరెస్టులు.. అమానుష దాడులు..అవమానాలు, అవహేళనలు.. అయినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. గెలుపోటములను లెక్క చేయలేదు. నిర్బంధాలకు వెరవలేదు. ఒకటి కాదు రెండు కాదు 900 రోజుల పాటు ఉద్యమాన్ని సాగించారు అమరావతి రైతులు. ఉద్యమాన్ని సజీవంగా నిలిపారు. ప్రభుత్వ మూడు ముక్కలాటలో సమిధలుగా మారిన రాజధాని రైతులు, కూలీలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలంతా ఒక్కటై నడిచిన ఈ పోరాటం సుదీర్ఘ ప్రజా ఉద్యమంగా నిలిచిపోనుంది.అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేయడంతో 2019, డిసెంబరు 19న అమరావతి ఉద్యమం మొదలైంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి, కరోనా కాలాన్ని అధిగమించి శనివారం నాటికి 900వ రోజుకు చేరింది. రాజధాని గ్రామాల్లోని వేలాది మంది రైతులు, మహిళలతో మొదలైన ఈ పోరాటం అలుపెరుగక ఇంకా కొనసాగుతూనే ఉంది. అడుగడుగునా ఎదురైన ఆంక్షల ముళ్ల కంచెలను దాటుకుంటూ ముందుకు సాగుతోంది. అడుగుతీసి అడుగు వేసేందుకు వీల్లేకుండా చేసినా, రాజధాని గ్రామాల్లో వందలాది మంది పోలీసులు కవాతులు చేసినా, అక్రమంగా కేసులు బనాయించినా రాజధాని ప్రజలు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు.

ఉక్కుపాదం మోపినా..
ఉద్యమాన్ని అణిచి వేసేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. విభజించు పాలించు అన్న చందంగా ప్రభుత్వం దమన నీతిని బయటపెట్టింది. ఎంతటి బలప్రయోగం చేసినా ఉద్యమం ఒక్క అడుగు కూడా వెనక్కి పడలేదు. 2020, జనవరి 5న తుళ్లూరు నుంచి మందడం వరకూ సాగిన 29 గ్రామాల రైతుల పాదయాత్రతో ఊపందుకుంది. దుర్గమ్మకు ముడుపులు చెల్లించేందుకు బయల్దేరిన మహిళలను ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసులు అడ్డుకుని లాఠీచార్జి చేశారు. దీంతో జనవరి 7న రైతులు, మహిళలంతా కలిసి హైవే దిగ్బంధించారు.
Also Read: BJP vs KCR: కేసీఆర్ కు బ్యాడ్ టైం.. బీజేపీకి వెల్లువలా అవకాశాలు?
మూడు రాజధానుల నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ జనవరి 20న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని నీరుగార్చాలనే లక్ష్యంతో అప్పటి జిల్లా ఎస్పీ విజయారావు నేతృత్వంలో మహిళలపై పాశవిక దాడులు చేయించారు. దీనిని హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ తరువాత అనంతవరం కొండ వద్దకు పాదయాత్ర, 29 గ్రామాల్లో బైక్ ర్యాలీ, కోటప్పకొండకు ర్యాలీ నిర్వహించి ఉద్యమాన్ని మరో అడుగు ముందుకు వేయించారు. సరిగ్గా ఇదే సమయంలో కరోనా కష్టకాలం మొదలైంది. అయినప్పటికీ రైతులు, మహిళలు వెనక్కి తగ్గలేదు. ఎవరి ఇళ్లలో వారు నిరసన దీక్షలు చేపట్టారు. ఉద్యమం మొదలైన 200వ రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 250 పట్టణాల్లో సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించారు. 250వ రోజున ‘నారీ సమరభేరి’, 300వ రోజున ‘రైతు భేరి’, కౌలు బకాయిల కోసం సీఆర్డీయే కార్యాలయం ముట్టడి, 2020, అక్టోబరు 31న ‘జైల్ భరో’ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో అరెస్టులయ్యారు. అదే ఏడాది డిసెంబరు 12న చావో.. రేవో.. కార్యక్రమం, డిసెంబరు 15న విజయవాడలో రైతు పాదయాత్ర నిర్వహిం చారు. ఇప్పటివరకు ప్రభుత్వం 1,100 మంది ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిం చింది. 3 వేల మందిని కేసుల్లో ఇరికించింది.

యావత్ భారతాన్ని కదిలించేలా..
యావత్ భారతదేశం అమరావతి ఉద్యమాన్ని గుర్తించుకునేలా రాజధాని రైతులు, మహిళలు, దళితులు ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరిట హైకోర్టు నుంచి తిరుపతికి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 2021, నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకూ పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రకు 13 జిల్లాల ప్రజల మద్దతు తెలిపారు. ఈ ఏడాది మార్చి 3న రైతుల న్యాయపోరాటం విజయం సాధించింది. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను విధిగా అమలు చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిని కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో రైతులు ‘బిల్డ్ అమరావతి – సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. 900 రోజుల పాటు నిరాటంకంగా పోరాటాన్ని కొనసాగించడం గొప్ప విజయంగా ప్రజా సంఘాల నేతలు అభివర్ణిస్తున్నారు. అమరావతి ఉద్యమం చరిత్రలో కలికితురాయిగా ఆచంద్రార్కం నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Major- Vikram Movie: మూవీ లవర్స్ కి బెస్ట్ వీకెండ్… థియేటర్స్ లో రెండు అద్భుత చిత్రాలు!
Recommended Videos
[…] […]
[…] […]