CM Revanth Reddy: ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలకు మొత్తం అసెంబ్లీ నే వేదిక. అక్కడ అనేక రకాల చట్టాలు రూపొందుతాయి. అనేక రకాల జీవో లు అక్కడే రూపు దిద్దుకుంటాయి. అలాంటి అసెంబ్లీకి ఎన్నిక కావాలి అంటే.. ఎమ్మెల్యే అని పిలిపించుకోవాలంటే కచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాలి. ప్రత్యర్థి మీద గెలుపొందాలి. అయితే ఈ ఎమ్మెల్యే అని పిలిపించుకునేందుకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. ఓటర్లకు డబ్బులు పంచటం, రకరకాల తాయిలాలు ఎరవేయడం వంటివి చేస్తుంటారు. కేవలం ఇవి మాత్రమే కాదు.. చట్టసభలకు వెళ్లే అభ్యర్థులపై కేసులకేం తక్కువ లేదు.ఇటీవల నూతనంగా ఏర్పడిన అసెంబ్లీలో.. ఏకంగా 82 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.
రిటైర్డ్ ఐఏఎస్ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ కార్యకలాపాలు సాగిస్తూ ఉంటుంది. పాలనలో సచ్చీలత, పాలకులలో జవాబు దారి తనాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఇందుకోసం సమాచార హక్కు చట్టాన్ని వాడుకుంటుంది. దాని ప్రకారం వ్యవస్థలో ఉన్న లోపాలను బయట పెడుతూ ఉంటుంది. ఇటీవల తెలంగాణ మూడో అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల చరిత్రను మొత్తం ఈ సంస్థ బయట పెట్టింది. మొత్తం 82 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. సీరియస్ క్రిమినల్ కేసులను 59 మంది ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ఈ వివరాలను అభ్యర్థులు ప్రకటించిన ఆపిడవిట్ల ఆధారంగా ప్రకటించామని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వివరించింది. ఇక ఈ కేసుల విషయానికొస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై 89 కేసులు ఉన్నట్టు ప్రకటించింది. 2018 ఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రకటించిన అఫిడవిట్లలో 73 మంది ఎమ్మెల్యే ల పై మాత్రమే క్రిమినల్ కేసులు నమోదయాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది.
ఇక ప్రస్తుత అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే పై మర్డర్ కేసు ఉందని, ఏడుగురు ఎమ్మెల్యేలపై ప్రయత్నం కేసులు నమోదయి ఉన్నాయని ప్రకటించింది. ఇద్దరు ఎమ్మెల్యేలపై మహిళలను వేధించిన కేసులు ఉన్నాయని వివరించింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేల్లో 52 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని, భారత రాష్ట్ర సమితి నుంచి 20 మంది ఎమ్మెల్యేల పై క్రిమినల్ కేసులు నమోదయాయని, భారతీయ జనతా పార్టీ నుంచి ఏడుగురు, సిపిఐ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి నలుగురు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇక సీరియస్ క్రిమినల్ కేసుల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 31 మంది ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. భారత రాష్ట్ర సమితి నుంచి 17 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ లోని ఏడుగురు ఎమ్మెల్యేలు, సిపిఐ నుంచి ఒక ఎమ్మెల్యే, ఎంఐఎం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు నమోదయాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. వ్యవస్థలో దాగి ఉన్న నిజాలను బయటికి వెలికి తీయడమే తమ లక్ష్యమని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది.