CM Jagan Security: ఉత్తర కొరియాలో నియంత పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు కింగ్ జోమ్ ఉన్ నిత్యం హై సెక్యూరిటీ నడుమ తన చర్యలను ఎప్పటికప్పడు మారుస్తుంటారు. ఆయన భద్రతాదళంలో మెరికల్లాంటి మహిళా కమాండోలు సైతం ఉంటారు. నిత్యం భద్రతావలయంగా ఉంటారు. అయితే అచ్చం అలాంటి మహిళా కమాండోలతో ఏపీ సీఎం జగన్ కు భద్రత కల్పించనున్నారు. దేశంలో ఏ సీఎంకు లేని విధంగా 63 మంది మహిళా కమాండోలు జగన్ భద్రతకు ఎంపిక చేశారు. అన్నిరకాల శిక్షణలు పూర్తిచేసుకున్నవీరు విధుల్లో చేరనున్నారు. అయితే ఎవరికీ లేని భద్రత జగన్ కు ఎందుకంటే.. మహిళల నుంచి ఆయనకు ముప్పు ఉందని చెబుతుండడం విశేషం.
సాధారణంగా ముఖ్యమంత్రి అంటే భారీ భద్రతా వలయం ఉంటుంది. అయితే తొలిసారిగా మహిళలతో భద్రత అనేసరికి వింతగా ఉంది. అయితే నిఘా వర్గాల హెచ్చరికలతోనే ఆ చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళల నుంచి జగన్ పై వ్యతిరేకత ఉన్నట్టు ఐ ప్యాక్ తో పాటు నిఘా వర్గాలు హెచ్చరించినట్టు ఒక ప్రచారం జరుగుతోంది. నేరుగా మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేసి పథకాలు అందిస్తున్నా వారి నుంచి ఆ స్థాయిలో సంతృప్తి వ్యక్తం కావడం లేదట. ప్రధానంగా నవరత్నాల్లో భాగంగా మద్యనిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుచేయకపోగా మద్యం షాపులను పెంచారు. మద్యం ధరలు అమాంతం పెంచి పచ్చని కుటుంబాల్లో కల్లోలం నింపుతున్నారని మహిళల్లో జగన్ పై ఆగ్రహం ఉంది.
ఇటీవల గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో నిలదీతలు, ప్రశ్నించడంలో మహిళలే ముందు వరుసలో ఉన్నారు. మహిళలకు సంబంధించి అంగన్ వాడీలు, ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలేవీ కార్యరూపం దాల్చలేదు. చివరకు వారికి పెంచినట్టు చెబుతున్న జీతాలు, ఇతర అలవెన్సులు కూడా అందలేదు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు, పారిశుధ్య కార్మికులు ఇలా అన్ని వర్గాల మహిళలు తమకిచ్చిన హామీలు అమలుచేయలేదని ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికల చివరి ఏడాది కావడంతో ఈ వర్గాల నుంచి ప్రతిఘటన ఉంటుంది. అందుకే మహిళా కమాండోలతో సీఎం భద్రత ఏర్పాటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల ప్రభుత్వ వైఫల్యాలపై మహిళలే ఎక్కువగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో సైతం వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. షేర్ చేస్తున్నారు. మహిళలు ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారని ప్రకటిస్తున్నా.. లోలోపల ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారు. అందుకే ఆర్ముడ్ రిజర్వ్, ఏపీఎస్పీ, సివిల్ పోలీసుల నుంచి మెరికల్లాంటి మహిళలను ఎంపిక చేశారు. పదిరకాల శిక్షణలు ఇచ్చారు. ప్రకాశం ఎస్పీ మల్లికా గార్గ్ పర్యవేక్షణలో 63 మంది మహిళా కమాండోలు శిక్షణ పూర్తిచేసుకున్నారు. వీరంతా ఒకటి రెండురోజుల్లో సీఎం భద్రతా టీమ్ లో చేరనున్నారు. కారణాలేమైనా దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల నుంచి రక్షణ కోసం మహిళా కమాండోలను నియమించుకోవడం సీఎం జగన్ కే చెల్లింది.