https://oktelugu.com/

 Water Merged into  Sea : విస్తారంగా కురిసిన వర్షాల వల్ల.. ఎన్ని నీళ్లు సముద్రం పాలయ్యాయో తెలుసా..

మిన్ను కురిస్తేనే మన్ను పండుతుంది. మన్ను పండితేనే కడుపుకు ఇంత తిండి లభిస్తుంది. ఇన్ని జరగాలంటే సకాలంలో వర్షాలు కురవాలి. సమృద్ధిగా నీళ్లు రావాలి. అప్పుడే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. క్షుద్బాధ లేకుండా సాఫీగా ఉంటుంది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 11, 2024 / 11:17 PM IST

    Rain Water Merged into  Sea

    Follow us on

    Water Merged into  Sea :  గత కొద్ది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా నమోదవుతున్న వర్షపాతాన్ని పరిశీలిస్తే.. ఏడాది మొత్తం కురవాల్సిన ఒక్కరోజే కురుస్తోంది. మిగతా రోజులు అయితే ఎండ లేకుంటే భిన్నమైన వాతావరణం నమోదవుతోంది. ఇక కొన్ని ప్రాంతాలలో విపరీతమైన వర్షం కురుస్తోంది. రోడ్లు, రవాణా, ఇండ్లు, పంట పొలాలు మొత్తం నాశనం అవుతున్నాయి. ఇక కొన్ని ప్రాంతాలలో పంటలు కోసే కాలంలో వర్షాలు కురుస్తున్నాయి. అన్నదాతలకు కన్నీటిని మిగుల్చుతున్నాయి. మొత్తంగా చూస్తే అతివృష్టి భయానక పరిస్థితులను కలుగజేస్తోంది. జనజీవనాన్ని పూర్తిగా స్తంభించేలా చేస్తోంది. ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా అధికంగానే వర్షపాతం నమోదయింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు దేశంలో ప్రధాన నదులైన వంశధార, గోదావరి, కృష్ణ స్థాయిని మించి ప్రవహించాయి. ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలు.. స్థానికంగా నమోదైన వర్షాపాతం వల్ల విస్తారంగా ప్రవహించాయి. ఈ నదుల ప్రవాహం వల్ల విలువైన జలాలు సముద్రంలో కలిశాయి. ఫలితంగా వేలాది టీఎంసీల నీరు వృధా అయ్యింది.. అయితే ఎన్ని టీఎంసీల నీరు వృధా అయ్యిందో కేంద్ర జల సంఘం లెక్కగడితే.. ఆశ్చర్యపోవడం ప్రజలవంతయింది.

    అన్ని టీఎంసీలు వృధా

    ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు విస్తారంగా వర్షాలు కురిసాయి. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాలు విపరీతమైన వర్షపాతాన్ని నమోదు చేయించాయి. ఫలితంగా కృష్ణ, గోదావరి, వంశధార నదులు అత్యంత ప్రమాదకరంగా ప్రవహించాయి. వీటి పరిధిలో సుమారు 5,021 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. ఇందులో గోదావరి మొదటి స్థానంలో ఉంది. గోదావరి నది నుంచి 4130 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. కృష్ణా నుంచి 869, వంశధార నుంచి 21 టిఎంసిల నీరు వృధా అయ్యింది. ఇక ఈ మూడు నదుల పరిధిలో ఏర్పాటుచేసిన బ్యారేజీ ల వల్ల 293 టీఎంసీల నీరు మాత్రమే నిలువ చేయగలిగారు. వాటిని మాత్రమే పంటల సాగుకు ఉపయోగించుకున్నారు. ఈ నదుల మీద నిర్మించిన రిజర్వాయర్లలో నిల్వచేసిన నీటి కంటే.. వృధాగా వెళ్లిన జలాలే ఎక్కువ. వృధాగా వెళ్లిన నీళ్లు సుమారు నాలుగు రెట్లు ఉంటాయని జల సంఘ నిపుణులు చెబుతున్నారు..” విస్తారంగా వర్షం కురవడం.. వరద ప్రవాహం తారాస్థాయి నుంచి దాటిపోవడం.. ఎగువ ప్రాంతాలలో కూడా విపరీతంగా వర్షాలు కురవడంతో వరద విస్తారంగా వచ్చింది. అందువల్ల విలువైన జలాలు కడలిపాలయ్యాయి. దీనివల్ల ఉపయోగం లేకుండా పోయింది. చాలా ప్రాంతాలలో పంట పొలాలు నాశనమయ్యాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. రవాణా వ్యవస్థ అద్వానంగా మారింది. అందువల్లే నీళ్లు మొత్తం సముద్రం పాలయ్యాయి. ఈ నీటిని మొత్తం వినియోగించుకునే వ్యవస్థ గనుక ఉంటే కరువు కాటకాల సమయంలో ఉపయుక్తంగా ఉండేదని” నీటి రంగ నిపుణులు చెబుతున్నారు..