NGT Compensation: ఏదైనా ఓ పద్దతి ప్రకారం వెళితేనే చక్కటి ఫలితాలు వస్తాయి. అందునా బాధ్యతాయుతమైన రాజకీయ పక్షం అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించాలి. అప్పుడే ఆ పార్టీ ప్రజల అభిమానం పొందగలుగుతుంది. ఇప్పుడు అదే ఒరవడిలో ముందుంది పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ. పార్టీ స్థాపించి సుదీర్ఘ కాలమవుతున్నా.. పార్టీ చేతికి పవర్ రాకున్నా.. సుశిక్షితులైన జన సైనికులు ఆ పార్టీకి సొంతం. పార్టీ అధినేత ఆశయాలకు తగ్గట్టు నడుచుకుంటూ ముందుకు సాగుతున్నారు జన సైనికులు. ఈ నేపథ్యంలో ఎన్నో దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న సమస్యలకు ప్రాథమికంగా పరిష్కార మార్గం చూపగలిగారు. అటు పవన్ కళ్యాణ్: చొరవతోనే ఉద్దానం కిడ్నీ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలు కొలిక్కి వచ్చాయి. అటు మత్స్యకారుల సమస్యలను పవన్ ఎలుగెత్తి చాటడంలో ప్రభుత్వాల్లో చలనం వచ్చింది. విపక్షంలో ఉన్నా బాధ్యతాయుతంగా వ్యవహరించి.. ప్రభుత్వం మెడలు వంచి ఎన్నో సమస్యలు పరిష్కరించిన సందర్భాలున్నాయి.

ఇప్పుడు తాజాగా జనసేన మరో ప్రజా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఏపీలో సహజ వనరుల విధ్వంసం విషయంలో జనసేన చొరవతో స్పందించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ సంచలన తీర్పు వెలువరించింది. జగన్ సర్కారుకు రూ.5 కోట్ల జరిమానా విధించింది. పేదల ఇళ్ల స్థలాల కోసమని కాకినాడ జిల్లాలో వందలాది ఎకరాల మడ ఆడవులను సేకరించారు. సునామి, తుపాన్ల నుంచి కాపాడుతూ వస్తున్న వృక్ష సంపదను నాశనం చేశారు. దీనిపై కొందరు జనసేన నేతలు జాతీయ ట్రైబ్యునల్ ను ఆశ్రయించడంతో వైసీపీ సర్కారు దోషిగా నిలబడింది. తిరిగి మడ అడవులను పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడింది.

ఏపీలో వైసీపీ సర్కారు పేదలకు ఇళ్ల స్థలాలు అందించిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల లభ్యత లేదు. అటువంటి చోట నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి విఘాతం కలిగించేలా అడవులు, తీర ప్రాంతాలను ధ్వంసం చేసి మరీ లేఅవుట్ లు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో కాకినాడ శివారులోని దమ్మలపేటలో సీఆర్ జెడ్ పరిధిలో ఉన్న 116 ఎకరాలను సేకరించారు. 415 మంది ఇళ్ల స్థలాలు అందించారు. మడ అడవులను ధ్వంసం చేసి మరీ లేఅవుట్లు ఏర్పాటుచేశారు. దీనిపై జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణతో పాటు మరికొంతమంది జాతీయ హరిత ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా విచారణ కొనసాగింది. ప్రభుత్వ చర్యను తప్పుపడుతూ రూ.5 కోట్లు జరిమానా విధించడంతో పాటు కీలక ఆదేశాలిచ్చింది. మడ అడవుల్ని తిరిగి పునరుద్ధరించాలని ఆదేశించింది. ఐదేళ్లలో ప్రక్రియ పూర్తికావాలని సూచించింది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి నివేదిక ఇవ్వాని ఏపీ సీఎస్ ను ఆదేశించింది. పర్యవేక్షణకు ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. మొత్తానికైతే జనసేన పోరాటం.. జగన్ సర్కారుకు సంకట స్థితిని తెచ్చి పెట్టింది.