
తెలుగు రాష్ట్రాలలో ఇటీవల జరిపిన దాడులలో రూ 2,000 కోట్ల మేరకు హవాలా లావాదేవీలు బైటపడిన్నట్లు ఆదాయపన్ను శాఖ గత వారం చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనాలు పుట్టిస్తున్నది. తాజాగా నాటి అధికార పక్షం టిడిపి నుండి కాంగ్రెస్ కు రూ 400 కోట్లు చేరినట్లు వెల్లడైనది. ఈ విషయమై ఆదాయపన్ను శాఖ నేరుగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్ నే తమ ముందు హాజరుకమ్మనమని నోటీసు జారీచేసింది.
మొదటి నోటీసుకు స్పందించక పోవడంతో రెండోసారి ఈ నెల 18న హాజరు కావాలని మరోసారి నోటీసు ఇచ్చింది. లేనిపక్షంలో అరెస్ట్ చేయవలసి వస్తుందని పరోక్షంగా హెచ్చరించింది. దానితో ఖంగారు పడిన అహ్మద్ పటేల్ శ్వాససంబంధ వ్యాధితో బాధపడుతున్నాను అంటూ ఫరిదాబాద్‌లోని మెట్రో ఆసుపత్రిలో చేరాను. కాబట్టి ఇప్పటికిప్పుడు విచారణకు హాజరు కాలేనంటూ సందేశం పంపారు.
తెలుగుదేశం హయాంలో అమరావతిలో భారీ నిర్మాణం పనులు చేపట్టిన ఒక సంస్థ నుంచి దాదాపు రూ 400 కోట్లు అధికార పార్టీ నాయకుల ద్వారా కర్నాటకలోని బెంగళూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడి ద్వారా ఢిల్లీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి చేరాయని కొంత కాలం క్రితం ఐటీ, ఈడీ పత్రికా ముఖంగా వెళ్లడించిన సంగతి తెలిసిందే.
ఈ హవాలా వ్యవహారంతో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంబంధం ఉందనే వార్తలు రావటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఇటీవల చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంపై దాడి చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దాదాపు రూ 2,000 కోట్ల లావాదేవీలకు సంబంధించిన రికార్డులు ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆదాయం పన్ను శాఖ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌ను విచారణకు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అహ్మద్ పటేల్ హవాలా నిధులకు సంబంధించిన వివరాలను ఉన్నది ఉన్నట్టు వెల్లడించే పక్షంలో కొందరు ఆంధ్రా, అలాగే పలువురు జాతీయ నాయకులు ఇబ్బందుల్లో పడడం ఖాయం.