317 GO Controversy over job and teacher transfers : ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘జాగరణ దీక్ష’తో రగిలించాడు. ఇదిప్పుడు ఉద్యమంగా మారుతోంది. కరీంనగర్ లోని బండి సంజయ్ నివాసం కేంద్రంగా సాగుతున్న ఈ ఉద్యమం నిన్న రాత్రి నుంచి రణరంగంగా మారింది. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ జనజాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టి మరీ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో బండి సంజయ్ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
బండి సంజయ్ జాగరణ దీక్షను అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఎంపీ కార్యాలయం పొగతో కమ్ముకుంది. గునపాలతో గేట్లు కూలుస్తుండగా.. లోపలి నుంచి బీజేపీ కార్యకర్తలు అడ్డుకొని నానా రచ్చ చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోంది. సొంత జిల్లాలో కూడా పరాయివాడిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. జీవోను సవరించి అందుకు అనుగుణంగా బదిలీ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవ్వడం.. బండిసంజయ్ ను వారంతా ఆశ్రయించడంతో ఆయన సమస్య పరిష్కారం అయ్యే వరకూ ‘జాగరణ దీక్ష’ చేపట్టారు. ఉపాధ్యాయులకు న్యాయం జరిగేవరకూ ఊరుకునే ప్రసక్తే లేదని.. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా దీక్ష కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.
-ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలపై జీవో 317లో ఏముంది?
తెలంగాణ ప్రభుత్వం మరో వివాదం తెరమీదకు తెచ్చింది. కేసీఆర్ సర్కారు తెలంగాణలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ వేగంగా చేపడుతోంది. జీవో నెం. 317 వివాదాస్పద జీవోను విడుదల చేసింది. దీంతో ఉద్యోగులు, నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అటు ఉపాధ్యాయులు ఇటు నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ సర్కారు ఈ జీవోను రద్దు చేయాల్సిందేనని అందరు డిమాండ్ చేస్తున్నారు. 317 వివాదాస్పదమవడానికి కారణాలు చూస్తే మన రాష్ర్టంలోని ఉద్యోగులను జోనల్, మల్టీజోనల్, స్టేట్ కేడర్లుగా విభజించారు. దీంతో టీచర్ ఉద్యోగాలను జిల్లాల వారీగా భర్తీ చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం మాత్రం ఉమ్మడి పాత జిల్లాల వారీగా నియమించేందుకు జీవో తెచ్చారు. స్థానికత ఆధారంగా కాకుండా సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకున్నారు. దీంతో సీనియర్లు అంతా నగరాలు, పట్టణాలు ఎంపిక చేసుకుంటుంటే.. సీనియార్టి లేని వారంతా మారుమూల గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. అంతేకాదు.. కొత్త జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటే ఏ జిల్లా వారు ఆ జిల్లాకు వెళతారు. కానీ ఉమ్మడి జిల్లా అనే సరికి జూనియర్లు అంతా తమ సొంత జిల్లాలకు దూరంగా ఎక్కడో మారుమూల జిల్లాకు వెళ్లాల్సి వస్తోంది. సొంత జిల్లాను వదిలిపెట్టి పోవడంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుత జీవో ప్రకారం సీనియర్లు పట్టణాలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో వారికి అక్కడే సీటు కేటాయిస్తున్నారు. జూనియర్లను మాత్రం మారుమూల గ్రామాలకు పంపిస్తున్నారు. దీంతో జూనియర్లు ఇక గ్రామాల్లోనే ఎక్కువ రోజులు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జూనియర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఉదాహరణకు తీసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐదు జిల్లాలుగా మారింది. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లితోపాటు కొన్ని మండలాలు భూపాలపల్లి, సిద్దిపేటకు వెళ్లాయి. దీంతో సీనియర్లు అంతా మెరుగైన కరీంనగర్ ఎంచుకుంటే కరీంనగర్ కు చెందిన జూనియర్ ఉద్యోగులు భూపాలపల్లి, సిద్దిపేట వంటి తమ స్థానికత కానీ దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే సమస్య వస్తోంది. తమ సొంత జిల్లా కానీ దూర జిల్లాలకు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల సీనియర్లు అంతా కరీంనగర్ ఎంపిక చేసుకొని ఇక్కడికే రావడంతో జూనియర్లకు అన్యాయం జరుగుతోంది.
-నిరుద్యోగులకు శరాఘాతమే..
మరోవైపు నిరుద్యోగులకు కూడా ఈ జీవో ఆశనిపాతంగానే మారిందని చెప్పాలి. జూనియర్లు మారుమూల ప్రాంతాలకు పంపిస్తుండటంతో ఇక వారు అక్కడే ఉండాల్సి రావడంతో పోస్టులు ఖాళీ ఏర్పడవు. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా దొరకవు. అందుకే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 రద్దు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించాలనే బండి సంజయ్ దీక్ష చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు దీనికి సంఘీభావం తెలిపారు. ఇదో కొత్త ఉద్యమంగా మారింది. తెలంగాణ సర్కార్ తీరుపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది.
-ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది?
తెలంగాణ ప్రభుత్వం బండి సంజయ్ చేపట్టిన ఈ జాగరణ దీక్షను ఎందుకు టార్గెట్ చేసిందన్నది ఉత్కంఠగా మారింది. ఉద్యోగ, ఉపాధ్యాయులతో సాధారణంగా ప్రభుత్వాలు పెట్టుకోవు. అలా పెట్టుకున్న వారు గతంలో ఓడిపోయారు. ఆ భయమే కేసీఆర్ ను వెంటాడు. వారి సమస్యలపై బండి సంజయ్ దీక్ష చేపట్టడం.. దానికి మద్దతు పెరుగుతుండడంతో తమ ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత పెరగకుండా చూడడానికే ఆయనను ప్రభుత్వం తాజాగా అరెస్ట్ చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు ఈ జీవో నిరుద్యోగులపై కూడా ప్రభావం చూపడంతోనే బండి సంజయ్ దీక్షను ఉక్కుపాదంతో ప్రభుత్వం అణిచివేస్తోంది. ఇప్పటికే ఆ వర్గాలన్నీ అసంతృప్తితో ఉన్నాయి. ఇప్పుడు మరింత పెంట కాకూడదనే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.