https://oktelugu.com/

Bihar Politics : ప్రభుత్వం వైపు ముగ్గురు ఎమ్మెల్యేలు.. శాసనసభలో ప్రతిపక్ష ఆశలు ఆవిరి

అప్పుడు మహాకూటమి ఆధ్వర్యంలో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. తాజాగా ఆ కూటమికి టాటా చెప్పి మళ్లీ బీజేపీతో చేతులు కలిపాడు. సోమవారం అసెంబ్లీలో బల నిరూపణ ఎదుర్కొని విజయం సాధించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 12, 2024 / 04:08 PM IST
    Follow us on

    Bihar Politics : అనేక నాటకీయ పరిణామాల మధ్య బీహార్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో కొలువుదదీరింది. అయితే ఇటీవల ఆర్జేడీ తో తెగదెంపులు చేసుకుని నితీష్ కుమార్ బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే శాసనసభలో బల నిరూపణ చేసుకునేందుకు సోమవారం శాసనసభలో సమావేశమయ్యారు. ఈ క్రమంలో అక్కడ ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ ప్రభుత్వం వైపు కూర్చోవడం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ఆర్జేడీ ఎమ్మెల్యేలు చేతన్ ఆనంద్, నీలమ్ దేవి, ప్రహ్లాద్ యాదవ్ ప్రభుత్వం వైపు కూర్చుని సంచలనం సృష్టించారు. అంతేకాదు తేజస్వి యాదవ్ కు తిరుగులేని షాక్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా నిర్ఘాంత పోవడం ఆర్జేడీ పార్టీ వంతయింది.

    బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమికి 110 ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 125 ఎమ్మెల్యేల బలం ఉంది. బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 122 మంది ఎమ్మెల్యేలు. అయితే ఎన్డీఏ కూటమిలోని నలుగురైదుగురు ఎమ్మెల్యేలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే చాలు నితీష్ ప్రభుత్వం సభ విశ్వాసం కోల్పోతుందని మహాకూటమి నాయకులు బలపరీక్షకు ముందు భావించారు. అయితే వారు అనుకున్నదొకటి.. శాసనసభలో జరిగింది మరొకటి. ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వం వైపు వెళ్లడంతో ప్రతిపక్ష కూటమి ఆశలు ఆవిరయ్యాయి. దీంతో నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రివర్గం కూర్పు దాదాపు పూర్తయింది. బిజెపి ఎమ్మెల్యేలకు కీలకమైన మంత్రిత్వ శాఖలను నితీష్ ప్రభుత్వం కేటాయించింది. అంతేకాదు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోను బీహార్ రాష్ట్రంలో కీలక స్థానాల్లో బిజెపి నాయకులు పోటీ చేసే విధంగా మార్పులు జరిగాయని తెలుస్తోంది.

    గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జేడీయు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. నితీష్ పార్టీకి 43 స్థానాలు మాత్రమే వచ్చాయి. 74 స్థానాలు సాధించిన బిజెపి నితీష్ పార్టీకి మద్దతు తెలిపి అతడిని ముఖ్యమంత్రి చేసింది. ఆ తర్వాత బిజెపితో విభేదాలు తలెత్తడంతో నితీష్ కుమార్ ఆర్జేడితో చేతులు కలిపాడు. గత ఎన్నికల్లో ఆర్జేడీ కి 75 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకుంది. అప్పుడు మహాకూటమి ఆధ్వర్యంలో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. తాజాగా ఆ కూటమికి టాటా చెప్పి మళ్లీ బీజేపీతో చేతులు కలిపాడు. సోమవారం అసెంబ్లీలో బల నిరూపణ ఎదుర్కొని విజయం సాధించాడు.