Bobbili Yuddham: తెలుగు నేలపై ఎన్నో యుద్ధాలు జరిగినా.. బొబ్బిలి యుద్ధానిది ప్రత్యేక స్థానం. పౌరుషాగ్నికి ప్రతీకగా నిలుస్తుంది ఈ యుద్ధం. వీర పరాక్రమం, వెన్నుపోటు, పగ, ప్రతీకారాలతో సాగిన ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది. రెండున్నర శాతాబ్దాలు దాటినా ఆ యుద్ధగాథ ఇప్పటికీ తెలుగునోట ఏదో ఒకచోట వినిపిస్తూ ఉంటుంది. 1757 జనవరి 24న అరవీర భయంకర యుద్ధం బొబ్బిలి సంస్థానాధీశులకు, విజయనగరం రాజవంశీయుల మధ్య సాగింది. నేటితో ఆ యుద్ధానికి 266 సంవత్సరాలు అయ్యింది. వీర మరణం పొందిన యోధుల గాథ ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. నాటి యుద్ధ పర్యవసానాలు, రాజవంశానికి చెందిన మహిళల ఆత్మబలిదానాలు ఇప్పటికీ కళ్లెదుట సాక్షాత్కరిస్తుంటాయి.
18వ శాతాబ్దం మధ్యకాలంలో బొబ్బిలి సంస్థానం జమిందారుగా రాజగోపాలక్రిష్ణ రంగారావు ఉండేవారు. విజయనగరం సంస్థానం రాజుగా పూసపాటి పెద విజయరామరాజు పాలించేవారు. అయితే ఇరువురి మధ్య ఆధిపత్యం కోసం పోరాటం నడిచేంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉండేది. రెండు రాజ్యాల మధ్య సరిహద్దు జల వివాదాలు నడిచేవి. సరిహద్దు జలాలను బొబ్బిలి ప్రాంత ప్రజలు బలవంతంగా తీసుకెళ్లేవారు. కానీ బొబ్బలి సంస్థానం బలం ముందు విజయనగరం రాజుల బలం సరితూగేది కాదు. ఎప్పటికప్పుడు విజయరామరాజు ఆ జల దోపిడీని అడ్డుకట్ట వేయలేకపోయారు. అందుకే ఫ్రెంచి కమాండర్ ఇన్ చీఫ్ బుస్సీతో చేతులు కలిపి బొబ్బలి రాజును తుది ముట్టించాలని భావించాడు. మిగతా జమిందార్లు మాదిరిగా బొబ్బిలి సంస్థానాధీలకు ఫ్రెంచి పాలకులతో సఖ్యత ఉండేది కాదు. దానిని అవకాశంగా మలుచుకున్న విజయరామరాజు వారి మధ్య వైరాన్ని మరింత పెంచారు. చర్యలన్నిటి పర్యవసానమే బొబ్బిలి యుద్ధం.భారత దేశ చరిత్రలో మున్నెన్నడూ ఎరగని సంఘటనను ఆవిష్కరించిన యుద్ధం ఇది. అనేక జానపద గాథలకు ప్రాణం పోసిన బీభత్స కాండ ఈ యుద్ధంలో జరిగింది.
1757 జనవరి 24న విజయనగరం సైనికులు, ఫ్రెంచి సేన సంయుక్తంగా బొబ్బిలి సంస్థానంపై దండెత్తాయి. అష్ట దిగ్బంధం చేశాయి. ఆ సమయంలో బొబ్బిలి సంస్థాన సర్వసైన్యాధికారిగా రాజు బావమరిది తాండ్ర పాపారాయుడు ఉండేవాడు. ఎంతో పరాక్రమవంతుడు. సరిగ్గా పాపారాయుడు రాజాంలో ఉండే సమయంలో ఫ్రెంచి సైన్యం, విజయనగరం సైనికులు బొబ్బిలి కోటపై యుద్ధం ప్రకటించాయి. ఆ విషయాన్ని బొబ్బిలి రాజులు వేగుల ద్వారా పాపారాయుడికి సమాచారమిచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఫ్రెంచి గూడాచార్యులు ఇది గమనించి వేగులను చంపారు. దీంతో తాండ్ర పాపారాయుడికి సమాచారం లేకుండా పోయింది. దీంతో విజయనగరం సైనికులకు మార్గం సుగమమైంది. ఫ్రెంచి సైన్యంతో కలిసి బొబ్బలి కోటను టార్గెట్ గా చేసుకొని దాడి చేయడం ప్రారంభించారు. ఫిరంగుల మోతతో బొబ్బిలి దద్దరిల్లిపోయింది. బొబ్బిలి కోట పేకమేడలా కూలిపోయింది. సమాచారం లేక తాండ్ర పాపారాయుడు రాకపోవడం.. వేలాదిమంది గా ఉన్న ఫ్రెంచి, విజయనగరం సైనిక బలగాన్ని చూసి బొబ్బిలి రాజు రాజగోపాలక్రిష్ణ రంగారావు ఓటమిని అంచనా వేశారు. యుద్ధం అనంతరం మహిళలు, పిల్లలకు చిత్రహింసలు తప్పవని భావించిన బొబ్బిలి రాజు కోట ప్రాంగణంలోని తమ నివాసాలకు నిప్పుపెట్టడమే కాకుండా.. మందుపాతరల మధ్య పిల్లలను, స్త్రీలను నిలబెట్టి పేల్చేశారు. రాజకుమారుడ్ని చంపేయమని రాజు తన గురువును ఆదేశించారు. ఆయన మనసు అంగీకరించక చంపక వేరే మార్గంలో రాజకుమారుడ్ని దారి మళ్లించారు. అలా బొబ్బిలి రాజవంశం సజీవంగా ఉంచగలిగారు. కానీ రాజు నుంచి మిగతా పరివారం అంతా అసువులుబాసింది. వీరమరణం పొందింది. బొబ్బిలి కోటలో ఎటుచూసినా శవాలే. దీంతో కోటలోకి వచ్చేందుకు శత్రు సైన్యం భయపడింది. అక్కడ నుంచి నిష్క్రమించింది.
అయితే రాజాంలో ఉండిపోయిన బొబ్బిలి రాజు బావమరిది, సర్వ సైన్యాధికారి తాండ్ర పాపారాయుడు జరిగిన విషయాన్ని తెలుసుకొని పగతో రగిలిపోయాడు. ఈ ఘటనకు బదులు తీర్చుకుంటానని శపథం చేశాడు. సరిగ్గా బొబ్బిలి యుద్ధానికి మూడో రోజు రాత్రి విజయనగరం కోటకు మారు రూపంలో చేరుకున్నాడు. అంతరంగిక గదిలో నిద్రిస్తున్న పెద విజయరామరాజుపై దాడి చేశారు. 32 కత్తిపోట్లు పొడిచాడు. దీంతో పెద విజయరామరాజు ప్రాణాలు వదిలాడు. అటు విజయనగరం సైనికుల కాల్పుల్లో తాండ్ర పాపారాయుడు కన్నుమూశాడు. కుప్పకూలిపోతూనే తన శపథం నెరవేర్చుకున్నానని నినదించాడు. అయితే పెద విజయరామరాజును చంపిన తరువాత తాండ్ర పాపారాయుడు తనకుతానే కత్తితో పొడుచున్నట్టు కథనం కూడా ఉంది.తాండ్ర పాపారాయుడు వస్తున్నాడని తెలిసి ఫ్రెంచి కమాండర్ ఇన్ చీఫ్ బుస్సీ అక్కడ నుంచి జారుకున్నట్టు ప్రచారం ఉంది. అయితే జరిగిన తప్పిదాన్ని తెలుసుకొని బుస్సీ ప్రాణాలతో బయటపడిన వారసుడ్ని బొబ్బిలి రాజుగా పట్టాభిషేకం చేసినట్టు చరిత్ర చెబుతోంది.
ఆనాడు బొబ్బిలి యుద్ధం జరిగిన చోట, బొబ్బిలి కోట నేలమట్టమైన చోట యుద్ధ చిహ్నంగా భైరవసాగరం వద్ద స్మారక స్తంభాన్ని ఏర్పాటు చేశారు.బొబ్బిలి యుద్ధంలో వాడిన కత్తులు, బల్లేలు, కవచాలు, దుస్తులు, తుపాకులు, పల్లకీ, సింహాసనాలతో బొబ్బిలి కోటలో మ్యూజియం ఏర్పాటు చేశారు. నాడు బొబ్బిలి రాజులు వాడిన ఆనాటి కార్లను సైతం ప్రదర్శనకు ఉంచారు. వీటిని చూసేందుకు బొబ్బిలి కోటకు నిత్యం సందర్శకులు వస్తూ ఉంటారు. ఏటా జనవరి 24 న బొబ్బిలి అమరవీరులకు రాజవంశీయులతో పాటు ఈ ప్రాంతీయులు ఘన నివాళులర్పిస్తుంటారు. మంగళవారం బొబ్బిలి లో రాజవంశీయులైన మాజీ మంత్రి సుజయ్ కృష్ణరంగారావు, టీడీపీ ఇన్ చార్జి బేబీ నాయన స్తూపాల వద్ద అంజలి ఘటించారు.