https://oktelugu.com/

24 కోట్ల వ్యాక్సిన్లు వృథా!

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. అయితే కొన్ని దేశాలు ఇప్పటి వరకు 2 శాతం కూడా టీకాలు ఇవ్వలేదు. కానీ మరికొన్ని దేశాల్లో మాత్రం వ్యాక్సిన్లు మిగలిపోవడంతో అవి ఎక్స్ ఫైర్ డేట్ అయిపోయి వృథా అయిపోతున్నాయి. ధనిక దేశాలు పేద దేశాలకు వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేస్తాయని ఇదివరకు తీర్మానించాయి. కానీ ఆ మేరకు పంపిణీ చేసినట్లు కనిపించడం లేదు. దీంతో చాలా పేద దేశాలు వ్యాక్సిన్లు అందక తమ ప్రజల ప్రాణాలను రక్షించుకోలేకపోతున్నాయి. ధనిక […]

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2021 / 02:17 PM IST
    Follow us on

    ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. అయితే కొన్ని దేశాలు ఇప్పటి వరకు 2 శాతం కూడా టీకాలు ఇవ్వలేదు. కానీ మరికొన్ని దేశాల్లో మాత్రం వ్యాక్సిన్లు మిగలిపోవడంతో అవి ఎక్స్ ఫైర్ డేట్ అయిపోయి వృథా అయిపోతున్నాయి. ధనిక దేశాలు పేద దేశాలకు వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేస్తాయని ఇదివరకు తీర్మానించాయి. కానీ ఆ మేరకు పంపిణీ చేసినట్లు కనిపించడం లేదు. దీంతో చాలా పేద దేశాలు వ్యాక్సిన్లు అందక తమ ప్రజల ప్రాణాలను రక్షించుకోలేకపోతున్నాయి. ధనిక దేశాలు తమకు అవసరమైన కంటే ఎక్కువ వ్యాక్సిన్లు సమీకరించుకొంటుండగా.. పేద దేశాలకు మిగిలిన వాటిని దానం చేయలేకపోతున్నాయి.

    ఎయిర్ ఫినిటీ నివేదిక ప్రకారం ధనిక దేశాలు 120 కోట్ల వ్యాక్సిన్లు అధికంగా సమీకరించుకుంటున్నాయి. అయితే ఇందులో మూడోవంతు అంటే కనీసం 24 కోట్ల టీకాలను పేద దేశాలకు పంచకపోతే అవి వృథా అయ్యే అవకాశం ఉంది. అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. లాటిన్ అమెరికాలో నలుగురిలో ఒకరికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని తెలిపింది. ఈ పరిస్థితి దక్షిణ అమెరికా, కరీబీయన్ దీవుల్లో 20 శాతం కంటే తక్కువగా ఉంది. నికరాగువా, హోండూరాస్, గ్వాటేమాల లాంటి దేశాల్లో వ్యాక్సిన్ గురించి కనీసం ప్రచారం కూడా చేయడం లేదు.

    గత జూన్ లో నిర్వహించిన జీ-7 సభ్య దేశాలు పేద దేశాలకు వంద కోట్ల డోసులు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించాయి. ఇందులో సభ్య దేశంగా ఉన్న అమెరికా 58 కోట్ల డోసులు పేద దేశాలకు ఇస్తామని తెలిపారు. కానీ ఇప్పటి వరకు 14 కోట్ల డోసులు మాత్రమే ఇచ్చారు. ఇక బ్రిటన్ 10 కోట్ల డోసులను ఇస్తామని తెలిపింది. కానీ ఇప్పటి వరకు 90 లక్షలను మాత్రమే పంపిణీ చేసింది. దీంతో పేద దేశాల్లో వ్యాక్సినేషన్ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది.

    ప్రపంచంలోని అన్ని దేశాల మధ్య టీకా పరస్పర సహకారం కొనసాగించాలని కోవాక్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు కూడా తెలిపింది. ఈ కార్యకమంలో భాగంగా వ్యాక్సిన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి మధ్యాదాయ దేశాలకు పంపిణీ చేస్తారు. 2021లో 200 కోట్ల డోసులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో ఎక్కువ శాతం భారత్ నుంచి రావాల్సి ఉంది. కానీ మార్చి నెలలో సెకండ్ వేవ్ విజృంభించడంతో వ్యాక్సిన్ ఎగుమతిని నిషేధించారు. దీంతో మిగతా దేశాలు ఇస్తున్న వ్యాక్సిన్లతో సరఫరా చేస్తున్నారు. కానీ వ్యాక్సినేషన్ చాలా నెమ్మదిగా సాగుతోంది.

    ఇదిలా ఉండగా కొన్ని ధనిక దేశాలు మిగులు డోసులను వృథా చేసుకుంటున్నాయి. ఎయిర్ ఫినిటీ అధ్యయనం ప్రకారం వ్యాక్సినేషన్ ఉత్పత్తిదారులు ప్రతినెల 150 కోట్ల డోసులు తయారు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకు 1,100 కోట్ల డోసులు ఉత్పత్తి చేశారు. దీంతో వ్యాక్సిన్ల ఉత్పత్తి భారీగా ఉన్నప్పుడు పంపిణీ కూడా సక్రమంగానే సాగుతుందని ఎయిర్ ఫినిటీ అధ్యయనవేత్తలు అంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ డోసులు ఉత్పత్తి చేసి పంపిణీకి ఆటంకం లేకుడా చూస్తారని అంటున్నారు.

    ‘ఒక దేశంలో వ్యాక్సిన్లు ఎక్కువగానే అవసరం ఉంటోంది . స్వదేశ అవసరాలకు మించిన ఉత్పత్తి జరిగినప్పుడు తప్పకుండా ఇతర దేశాలకు పంపిణీ చేస్తాము. అలా కాదని అవసరం ఎక్కువగా ఉన్న ఇతర దేశాలకు పంపిణీ చేస్తే రాజకీయ ఒత్తిడి పెరిగిపోతుంది’ అని బ్రిటన్ కు చెందిన అగాథే డెమరస్ అంటున్నారు. బ్రిటన్లో మిగులు వ్యాక్సిన్లు లేవని, నాలుగు మిలియన్ డోసులకు ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకుందని అంటున్నారు. అయితే కోవాక్స్ పట్ల అందరూ నిబద్ధతతో వ్యవహరించాలని, కొన్ని దేశాలు ప్రతినెలా 150 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తుంటే మిగతా దేశాలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని కొందరు అంటున్నారు.