తెలంగాణ ఏర్పడ్డాక తొలి సీఎంగా కేసీఆర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందాడు. మొదటి ఐదేళ్లు దేశం గర్వించే అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి.. అబ్బురపరిచేలా కాళేశ్వరం కట్టి ప్రజల మనసులు చూరగొన్నాడు. రైతులకు పెద్దపీట వేశాడు. సంక్షేమ జల్లు కురిపించారు. కేసీఆర్ పనితనానికి మెచ్చి తెలంగాణ ప్రజలు రెండో దఫా అవకాశం ఇచ్చారు. 2018 డిసెంబర్ లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఆశీర్వదించారు. ఆ నెల ప్రమాణ స్వీకారంతో కేసీఆర్ సీఎం అయ్యాడు. ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ తోపాటు ఒక్క హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే అయ్యాడు. 2019 లో సగం ఏడాది గడిచినా మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా అటు పార్టీ నేతలను, ఇటు ప్రజలను విసిగించాడు. హరీష్ రావును పక్కనపెట్టాడన్న చర్చ బాగా సాగింది. అది హరీష్ పై సానుభూతిని.. కేసీఆర్ పై వ్యతిరేకతను పెంచింది. కేసీఆర్ మొండితనంతో అప్పటి నుంచే ప్రజల్లో.. పార్టీ నేతల్లో విశ్వసనీయతను కోల్పోయారనే అపవాదును మూటగట్టుకున్నాడు. 2019 సగం గడిచాక మంత్రివర్గ విస్తరణ జరిగినా పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. కేసీఆర్ కు వ్రతం చెడ్డా ఫలితం రాకుండా మారింది.
ఈ క్రమంలోనే 2020లో ఏదైనా చేద్దాం.. ఉద్దారిద్దాం.. అనేసరికి చైనా నుంచి ‘కరోనా వైరస్’ ఊడిపడింది. అన్నీ బంద్ అయిపోయాయి. ప్రభుత్వాలు, పరిశ్రమలు, ఆర్తిక వ్యవస్థలు కుప్పకూలాయి. రూపాయి పట్టడం కష్టమైంది. ఈ కరోనా దెబ్బకు ధనిక రాష్ట్రం తెలంగాణ కూడా అప్పుల కోసం కేంద్రాన్ని , ఆర్బీఐని యాచించే పరిస్థితికి వచ్చింది. కరోనా మొత్తం యావత్ ప్రపంచాన్నే కాదు.. తెలంగాణ రాష్ట్రాన్ని ఫుట్ బాల్ ఆడేసింది. ఆదాయాన్ని మింగేసింది. దీంతో ఈ సంవత్సరంలో కేసీఆర్ చేద్దామన్నా చేతిలో రూపాయి లేని పరిస్థితి. అందుకే ఆయన నిర్లప్తిత, నిర్లక్ష్యం.. కరోనా వేళ కంటితుడుపు చర్యలు ప్రజలను ఆకర్షించలేకపోయాయి.
కరోనా లాక్ డౌన్ టైంలో కేసీఆర్ ఉచితంగా మనిషికి 10 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం.. 1500 ప్రతి కుటుంబానికి ఇచ్చినా అవి ఉద్యోగ, ఉపాధి మొత్తం కోల్పోయి రోడ్డున పడడంతో ఈ పైసలు సరిపోలేదు. వారి అవసరాలను తీర్చలేదు. సో కేసీఆర్ చేసినా ఆ పేరు ఆయనకు రాకుండా పోయింది. ఇక కేంద్రంలో మోడీ సార్ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ గాలి బుడగలా అది ఎటుపోయిందో తెలియని పరిస్థితి. అయితే ఎవ్వరూ ఏం చేయలేదు. కానీ ప్రజల్లో ప్రభుత్వాల తీరుపై ఆ వ్యతిరేకత మాత్రం కంటిన్యూ అయిపోయింది.
కేంద్రంలోని బీజేపీ హిందుత్వ, రామమందిరం, జాతీయ వాదంతో అంతో ఇంతో నెట్టుకురాగా.. కేసీఆర్ కరోనా వేళ ఏం చేయలేని పరిస్థితులు.. ప్రత్యామ్మాయాలు లేకపోవడం మైనస్ గా మారింది. అదీ కాకుండా కరోనా వేళ తెలంగాణలో దేశంలోనే తక్కువ టెస్టులు చేయడం.. పైగా ప్రైవేటు ఆస్పత్రుల కరోనా దోపిడీ వెలుగుచూడడం కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ప్రైవేటు దోపిడీకి కుటుంబాలు రోడ్డునపడి.. ఇళ్లు, వాకిలీ, ఆస్తులు అమ్ముకున్న వారి వ్యథలు కోకొల్లలు. ఇక గాంధీ ఆస్పత్రిలో జర్నలిస్టులు, కొందరు ప్రజలు చనిపోవడం ప్రభుత్వ ఆసుపత్రుల అధ్వాన స్థితిపై విమర్శలకు కారణమైంది.
తెలంగాణపై కరోనా తీవ్ర ప్రభావమే చూపింది. ఓ వైపు ఉద్యోగ ఉపాధి దూరమవ్వడం.. మరోవైపు ప్రభుత్వం సాయం అరకొరగా అందడం.. డబ్బులన్నీ వైద్యానికే ఖర్చయిపోవడంతో కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. అటు ఏపీలో కరోనా వేళలోనూ జగన్ కసిగా పనిచేశాడు. నవరత్నాల పేరుతో కరోనా కల్లోలం లోనూ ప్రజలకు నేరుగా నగదు అందించి ఏపీ సీఎం జగన్ ప్రజల మనుసులు చూరగొనగా.. తెలంగాణలో అలాంటి ప్రయత్నాలు కేసీఆర్ చేయకుండా స్తబ్దుగా ఉండిపోయారు. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమై మాటల తూటాలు పేల్చి సైలెంట్ అవ్వడం.. ప్రజలకు ఆర్థికంగా ఆదుకోకపోవడంతో కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత పెల్లుబుకింది.
ముఖ్యంగా యువత, నిరుద్యోగులు, ఉద్యోగులకు, ఉద్యోగాలు పోయిన వారికి కేసీఆర్ సర్కార్ ఏం చేయలేయపోయిందన్న ఆవేదన ఆ వర్గాల్లో ఉంది. ఎంత సేపు రైతుల, పింఛన్లు, గ్రామీణుల చుట్టే కేసీఆర్ సర్కార్ ప్రాధాన్యతలు ఉన్నాయి. ఒక్క ఉద్యోగ ప్రకటన లేదు. నిరుద్యోగులకు డీఎస్సీ లాంటివి లేవు. ఉద్యోగులకు పీఆర్సీ ముచ్చటే లేదు. వారి జీతాలు కేసీఆర్ సర్కార్ కోసేసింది. దాదాపు 30శాతం ఉన్న పట్టణాల్లోని యువత, నిరుద్యోగులు, ఉద్యోగులను కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఆ సెగలు పొగలు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపించాయి. కేసీఆర్ ను ఓడగొడితే తప్పితే ఆయనకు జ్ఞానోదయం రాదన్న భావన ప్రజల్లో బలంగా ఏర్పడింది. ప్రత్యామ్మాయంగా బీజేపీ ప్రబలంగా కనిపించడం.. కేసీఆర్ వైఫల్యాలను బలంగా ఎండగట్టడంతో ప్రజలు కమలం పార్టీ వైపు ఆకర్షితులయ్యారు.
తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ , టీఆర్ఎస్ కు ఎదురులేకుండా గెలిచింది. కానీ తొలిసారి దుబ్బాకలో ఓటమితో తొలి దెబ్బ పడింది. ట్రబుల్ హరీష్ రావు అన్నీ తానై నడిపించి తిరిగినా గెలిపించలేకపోవడం.. కేసీఆర్ మ్యాజిక్ పనిచేయకపోవడం ప్రజల్లో పెల్లుబుకిన ఆగ్రహానికి కారణంగా చెప్పొచ్చు. ఇక అదే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పునరావృతమైంది. హైదరాబాద్ వరదలు.. కేసీఆర్ పరిహారం ఆగిపోవడం.. ప్రజలను ఆదుకోకపోవడం.. కబ్జాలతో సిటీ మునగడం.. ఇలా కర్ణుడిచావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు కేసీఆర్ నిర్లక్ష్య , ఉదాసీన పాలన ఆయన పుట్టి ముంచింది. ఇలా తెలంగాణలో తిరుగులేకుండా ముందుకు సాగిన కేసీఆర్ కు రెండోసారి గెలిచాక కలిసిరాలేదు. ఆయన నిర్లక్ష్యమే ప్రజలకు దూరం చేసిందన్న వాదన అందరిలోనూ నెలకొంది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఓటమితో నష్టనివారణ చర్యలు చేపడుతున్న కేసీఆర్ ను ప్రజలు నమ్ముతారా? మళ్లీ కేసీఆర్ నిలబడుతాడా? లేదా అన్నది కాలమే సమాధానం చెప్తుంది..
-నరేశ్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: 2020 roundup kcr rule in telangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com