Rajya Sabha: దేశంలో వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రికార్డును సమం చేసింది. ఇక నరేంద్రమోదీ.. ప్రధానిగా వరుసగా మూడుసార్లు ఎన్నికై పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. 2000 సంవత్సరం నుంచి బీజేపీకి దేశంలో ఆదరణ పెరుగుతూ వస్తోంది. 1999లో వాజ్‌పేయ్ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినా 13 రోజులకే పడిపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో బలమైన, సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఇక 2014 నుంచి ఎన్డీఏకు తిరుగులేకుండా పోయింది. అయితే లోక్‌సభలో మెజారిటీ సీట్లు గెలుస్తున్న బీజేపీకి రాజ్యసభలో మాత్రం మెజారిటీ లేదు. దీంతో బిల్లుల ఆమోదానికి మిత్రపక్షాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. కానీ, మోదీ కృషితో తాజాగా రాజ్యసభలోనూ ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. తాజాగా 12 స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 21వరకు నామినేషన్లు స్వీకరించగా, తొమ్మిది స్థానాల్లో బీజేపీ రెండు స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలైన ఎన్సీపీ, ఆర్‌ఎల్‌ఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు, తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎగువ సభలో మెజారిటీ మార్కు..
ఎన్డీఏకు ఎగువ సభలో మెజార్టీ మార్కును అందుకుంది. తాజాగా రాజ్యసభలో బీజేపీ బలం 96కి చేరగా, మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ ఆ బలం 112కు పెరిగింది. దీనికితోడు అధికార పార్టీకి ఆరుగురు నామినేటెడ్, ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది. తాజాగా కాంగ్రెస్ నుంచి ఒక సభ్యుడు గెలుపొందడంతో రాజ్యసభలో ప్రతిపక్షాల బలం 85కి పెరిగింది.
బిల్లల ఆమోదానికి ఇబ్బంది..
రాజ్యసభలో బీజేపీకి గత నెల వరకు బీజేపీకి 86 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎన్డీఏ కూటమితో కలుపుకుంటే బలం 101. రాజ్యసభలో మెజార్టీ మార్కు 114 కాగా.. అందుకు సరిపడా ఎంపీలు అధికార కూటమికి లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో బిల్లులు ఆమోదం కోసం కేంద్రం మిత్ర పక్షాలతోపాటు తటస్థ పార్టీలపై ఆధారపడాల్సి వచ్చేది. తాజాగా జరిగిన 12 రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో బీజేపీ 2, మిత్రపక్షాలు 9 సీట్లు గెలిచాయి. దీంతో ఎన్డీ బలం 112కు చేరింది. ఆరుగురు నామినేటెడ్, ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది.