CM KCR On Singareni: సింగరేణి.. తెలంగాణలో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి పాత్ర చాలా కీలకం. సుమారు 45 వేలు మంది కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రకృతికి విరుద్ధంగా భూగర్భంలోని నల్ల బంగారాన్ని వెలికి తీసి మనకు వెలుగులు అందిస్తున్నారు. మహారత్న కంపెనీలకు దీటుగా, కోలిండియాను మించి లాభాలు ఆర్జిస్తోంది సింగరేణి. ఏటా ఉత్పత్తితోపాటు లాభాలు పెరుగుతున్నాయి. 1999లో జరిగిన ఒప్పందం ప్రకారం ఏటా సంస్థ లాభాల్లో వాటాను కార్మికులకు చెల్లిస్తోంది. ఇక జాతీయ కార్మిక చట్టాల ప్రకారం కోలిండియా, సింగరేణి పీఎల్‌ఆర్ బోనస్ ఇస్తున్నాయి. కోలిండియా దసరాకు ఈ బోనస్ ఇస్తుండగా, సింగరేణి దీపావళికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.1,200 కోట్లకుపైగా లాభాలు ఆర్జించింది. ఇందులో కార్మికులకు 29 లేదా 30 శాతం వాటా ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. ఇక పీఎల్‌ఆర్ బోనస్ కోలిండియా, సింగరేణి సంస్థ కార్మిక సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం నిర్ణయిస్తాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం కానీ, కేసీఆర్ సొంతంగా జేబులో నుంచి ఇచ్చేది కానీ రూపాయి కూడా లేదు. కానీ ఇటీవల కేసీఆర్ సింగరేణి కార్మికుల రాగం అందుకున్నారు. దసరా, దీపావళి సందర్భంగా వెయ్యి కోట్లు చెల్లించబోతున్నామని చెబుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా..
సింగరేణి ప్రభుత్వ, యాజమాన్య సంస్థ. ఇది తెలంగాణ ప్రభుత్వ ఇంధన శాఖ యాజమాన్యంలో ఉంది . బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన 49% యాజమాన్యం ద్వారా సంస్థ యొక్క కేంద్ర ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది. ప్రస్తుతం 45 గనులను నిర్వహిస్తోంది, ఇక్కడ 20 ఓపెన్ కాస్ట్, 25 భూగర్భ గనులు తెలంగాణలోని 6 జిల్లాల్లో ఉన్నాయి. 45 మంది కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. కొత్తతరం కార్మికులు, పెరిగిన సాంకేతికత, యాంత్రీకరణతో సంస్థ ఉత్పత్తి ఏటా పెరుగుతోంది. దీంతో లాభాల్లో కార్మికులకు చెల్లించే లాభాలు కూడా పెరుగుతున్నాయి.
1999లో ఒప్పందం..
సింగరేణి సంస్థ 1990లో నష్టాల్లో కూరుకుపోయింది. తరచూ సమ్మె, కార్మికుల గైర్హాజరు కారణంగా లాభాల సంగతి దేవుడెరుగు, సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు సింగరేణిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 1998 నుంచి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. గుర్తింపు సంఘంతోనే కార్మికుల సమస్యలపై చర్చించడం, సమ్మెకు పిలుపు నిచ్చినా గుర్తింపు సంఘం ఇస్తేనే పరిగణనలోకి తీసుకోవడంతో సంస్థలో మార్పు మొదలైంది. ఖాయిలా పడిన సింగరేణిని మళ్లీ లాభాల బాట పట్టించేందుకు కేంద్రంతో మాట్లాడి బకాయిలు వాయిదా వేయించారు. కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సంస్థ సాధించే లాభాల్లో వాటా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు 1999 నుంచి కార్మికులకు లాభాల్లో వాటా ఇవ్వడం మొదలైంది. 10 శాతంతో మొదలైన లాభాల వాటా ఇప్పుడు 30 శాతానికి పెరిగింది. అదే సమయంలో కార్మికుల సంఖ్య తగ్గింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.
ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ప్రచారం..
రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా సింగరేణిలో లాభాల పంపిణీ ఆగదు. దీపావళికి చెల్లించే బోనస్ కార్మికుల హక్కు. ఈ విషయం సింగరేణి కార్మికులకు తెలుసు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తామే చెల్లిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఎక్కడ మాట్లాడినా సింగరేణి కార్మికులకు దసరా, దీపావళికి రూ.1000 కోట్లు చెల్లించబోతున్నట్లు చెబుతున్నారు. కానీ ఇందులో కేసీఆర్‌ది కానీ, ప్రభుత్వ సొమ్ము కానీ రూపాయి లేదు. కార్మికుల శ్రమనే ఒప్పందం ప్రకారం యాజమాన్యం చెల్లిస్తుంది. కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాటిని కప్పిపుచ్చేందుకు రూ.1000 కోట్లు ఇస్తున్నామని పదే పదే చెబుతున్నారని సింగరేణి కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల వడ్డీలేని రుణం, ఇళ్ల స్థలాలు, మారుపేర్ల మార్పు వంటి హామీలను సీఎం గతంలో కార్మికులకు ఇచ్చారు. అవి ఏవీ నెరవేర్చలేదు. ఈ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పడే అవకాశం ఉంది. మరోవైపు 2021 నుంచి సంస్థ నుంచి తీసుకున్న డబ్బులను, విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఫలితంగా సంస్థ మళ్లీ నష్టాలు చవిచూస్తోంది. దీని ప్రభావం కూడా ఎన్నికలపై పడే అవకాశం ఉంది. వీటిని మర్చిపోవడానికే కేసీఆర్ కొత్త ప్రచారం మొదలు పెట్టారని కార్మికులు అంటున్నారు.