https://oktelugu.com/

100 crore land acquired : ధరణినే మార్చేశారు.. 100 కోట్ల భూమికి ఎసరుపెట్టారు

100 crore land acquired : ‘మా ధరణి సొక్కం, సుద్ధ పూస, ఏహే ఇట్లాంటి మార్పు ఎవడైన తీసుకొచ్చిండ, ఇది గేమ్‌ ఛేంజర్‌ అంటరు’  తెలంగాణలోని అధికార పార్టీ పెద్దలు.. ‘క్షేత్రస్థాయిలో మాత్రం అట్లుంటదా? అట్లనే ఉంటే అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ పై దాడి ఎందుకు జరుగుతది, మేడ్చల్‌ ఆర్‌ఐ ఏసీబీకి ఎందుకు దొరుకుతడు? అసలు ఆ ధరణి సైటే పెద్ద లోపాల పుట్ట’ అని ప్రతిపక్ష పార్టీ నేత రేవంత్‌ అంటాడు. మేం అధికారంలోకి వస్తే […]

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2023 / 10:57 PM IST
    Follow us on

    100 crore land acquired : ‘మా ధరణి సొక్కం, సుద్ధ పూస, ఏహే ఇట్లాంటి మార్పు ఎవడైన తీసుకొచ్చిండ, ఇది గేమ్‌ ఛేంజర్‌ అంటరు’  తెలంగాణలోని అధికార పార్టీ పెద్దలు.. ‘క్షేత్రస్థాయిలో మాత్రం అట్లుంటదా? అట్లనే ఉంటే అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ పై దాడి ఎందుకు జరుగుతది, మేడ్చల్‌ ఆర్‌ఐ ఏసీబీకి ఎందుకు దొరుకుతడు? అసలు ఆ ధరణి సైటే పెద్ద లోపాల పుట్ట’ అని ప్రతిపక్ష పార్టీ నేత రేవంత్‌ అంటాడు. మేం అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటాడు. కానీ ఈ ధరణి పేరుతో రెవెన్యూ అధికారులు సర్కారు భూమిని పొతం పెడుతున్నారు. దర్జాగా కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    ప్రైవేటుపరం చేశారు

    ‘లుక్‌ ఈస్ట్‌’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ తూర్పు ప్రాంతాల అభివృద్ధికి నడుం బిగించింది. ఫలితంగా ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ ఏర్పడింది. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొందరు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వ భూములను మింగేసుడు షురూ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. భూ పరిమితి చట్టం కింద ఉన్న భూములను హారతికర్పూరం చేశారు. ‘సీలింగ్‌ ల్యాండ్‌ ఫర్‌ సేల్‌’ అంటూ.. భూములను దర్జాగా అమ్మేశారు అంతేకాదు.. ఆ భూములను కొన్నవారికి ఎంచక్కా పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను జారీ చేశారు. ధరణిలోనూ వారి పేర్లను ఎక్కించారు. ఇలా హైదరాబాద్‌ శివార్లలోని ఘట్‌కేసర్‌ మండలంలో రెండు సర్వే నంబర్లలో రూ. 100 కోట్లకు పైన విలువ చేసే ప్రభుత్వ భూమిని రెండో మాట లేకుండా ప్రైవేట్‌ పరం చేశారన్న ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి..

    హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుకు అత్యంత సమీపంలోని అంకుషాపూర్‌లో 16.16 ఎకరాల భూమి (సర్వే నంబర్‌ 180) ఉండగా.. అందులో 6.14 ఎకరాలను ప్రభుత్వం భూపరిమితి చట్టం కింద స్వాధీనం చేసుకుంది. 1986 ఆగస్టు 15న ఏడుగురు పేదలకు ఈ భూమిని అసైన్‌ చేసి, పట్టాలిచ్చింది. ధరణికి ముందు వరకూ రికార్డుల్లో ఈ ఏడుగురి పేర్లుండేవి. ధరణి వచ్చాక నలుగురు అసైనీల పేర్లే కనిపించాయి. మరో ముగ్గురు అసైనీలు- పెండం కృష్ణయ్య కుమారుడు పెండం మల్లయ్య, కప్పరగళ్ల రామయ్య కుమారుడు కప్పరగళ్ల మంకయ్య, కందకట్ల రాంరెడ్డి భార్య అమృత పేర్లు ధరణిలో గల్లంతయ్యాయి. రెవెన్యూ అధికారులకు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా.. వీరి సమస్య తీరలేదు. ఈ తతంగం వెనక ఈ అసైనీల్లో ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి రెవెన్యూ శాఖలో పనిచేశాడు.

    2.34 ఎకరాలు ఖతం

    సర్వే నంబర్‌ 180లో ఉన్న మొత్తం భూమి 16.16 ఎకరాలు. అందులో ప్రభుత్వం 6.14 ఎకరాలను భూపరిమితి చట్టం కింద స్వాధీనం చేసుకోగా.. మిగిలేది 10.02 ఎకరాలే. సంబంధిత పట్టాదారులు ఆ 10.02 ఎకరాల్లో 1997లో 2.04 ఎకరాలను, 2001లో 8.08 ఎకరాలను సాయితేజ గార్డెన్స్‌కు విక్రయించారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ డాక్యుమెంట్లు(510/1997, 1882/2001) ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అయితే.. ధరణిలో మాత్రం ఏడుగురి పేరిట 12.38 ఎకరాలున్నట్లు రెవెన్యూ సిబ్బంది కొందరు గిమ్మిక్కులు చేశారు. అంతేకాదు.. ఆ ఏడుగురికి ఈ 12.38 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను జారీ చేశారు. అంటే.. అసలు విస్తీర్ణం కంటే 2.34 ఎకరాలను అదనంగా కట్టబెట్టారు.

    ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకున్న 6.14 ఎకరాలకు క్రమంగా ఎసరుపెడుతూ వచ్చారు. అసలు ఆ ఏడుగురికి ఏ ప్రాతిపదికన పట్టాలు జారీ చేశారు? 2.34 ఎకరాలను అదనంగా ఎలా కేటాయించారు? పట్టాదారులు చూపించిన లింక్‌ డాక్యుమెంట్లు ఏమిటి? అవి నిజమైనవేనా? అనే విషయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. అప్పనంగా పాస్‌పుస్తకాలు ఇచ్చేశారు. ఇప్పుడు ఈ స్థలం చుట్టూ మూడువైపులా ప్లాట్లున్నాయని, గజం విలువ కనీసం రూ. 10వేలుగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

    పట్టాలిచ్చేశారు

    ఘట్‌కేసర్‌ రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 207లో సయ్యద్‌ అహ్మద్‌ యూసుఫుద్దీన్‌కు చెందిన 8.13 ఎకరాలను భూపరిమితి చట్టం కింద ప్రభుత్వం 1975లో (సీసీ/323/1975) స్వాధీనం చేసుకుంది. ధరణికి ముందు వరకు కూడా రికార్డుల్లో ఈ భూమి ‘మిగులు’గానే ఉంది. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఐజీ వెబ్‌సైట్‌లోనూ ఈ భూమిని 22(ఏ) కింద ప్రకటించారు. ఐజీఆర్‌ఎస్‌ మెమో(జీ1/15653/06) ద్వారా ఈ భూమిని నిషేధిత జాబితాలో చేర్చినట్లు స్పష్టం చేశారు. తహసీల్దార్‌ మెమో(423/ఇ/09) ప్రకారం కూడా ఈ భూమి నిషేధిత జాబితాలోనే ఉంది. ధరణిలోనూ లావాదేవీల స్టేట్‌స్ లో ఈ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు. కానీ, ఈ 8.13 ఎకరాల భూమిలో ప్రైవేటు వ్యక్తులకు పట్టాదార్‌ పాస్‌పుస్తకాలిచ్చేయడం విశేషం. ఈ ధరణి పేరుతో రెవెన్యూ అధికారులు సర్కారు భూమిని అక్రమార్కుల పాలు చేస్తున్నారని.. దర్జాగా కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.