10 years of Janasena : దారంతా చీకటి.. రోడ్డంతా గుంతలు..చేతిలో చిరుదీపం.. గుండెల నిండా ధైర్యంతో ముందు అడుగు వేస్తున్నా.. పదేళ్ల కిందట ఇదే మాట చెప్పి జనసేనను ప్రారంభించారు పవన్ కళ్యాణ్. తొలుత ఉద్యమ సంస్థ తరహాలో ఆలోచన చేసినా.. రాజకీయ వ్యవస్థ లేకపోతే తన ఆలోచనలు ఆవిష్కృతం కావని భావించిన పవన్ జనసేన రాజకీయ పక్షంగా ప్రకటించారు. అయితే అప్పుడే పదేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. జనసేన ఆశ, ఆశయం తీరిందంటే.. కచ్చితంగా నెరవేరిందనే చెప్పొచ్చు. తాను రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదు.. ప్రజా సమస్యల పరిష్కారానికేనంటూ పవన్ ప్రారంభం నాటి నుంచే చెబుతూ వస్తున్నారు. జనసేనకు సంస్థాగత నిర్మాణం లేకపోవడం మైనస్. కానీ కోట్లాది మంది అభిమానులు ఆ పార్టీకి సొంతం. వారంతా పవన్ ను ఇష్టపడతారు. జనసేనను ఫాలో అవుతున్నారు. అధినేత ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. స్వచ్ఛందంగా ప్రజాసేవలో భాగస్థులవుతున్నారు.
అయితే రాజకీయం అంటే ‘పవర్’ అన్న అభిప్రాయం ఉన్న ప్రస్తుత తరుణంలో పవన్ ను ఒక వర్గం ఫెయిల్యూర్ నాయకుడిగా చూస్తోంది. కానీ సమాజం, సమకాలిన అంశాలపై అవగాహన ఉన్న వారు మాత్రం పవన్ లో ఓ కొత్త తరహా నాయకుడ్ని చూస్తున్నారు. తటస్థులు సైతం అభిమానులుగా మారుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న అభిమానమే పవన్ ను నడిపిస్తోంది. జనసేనను ఒక రాజకీయ అతీతమైన శక్తిగా అవతరించేలా చేస్తోంది. జనసేన ఆవిర్భవించి పదేళ్లవుతోంది. చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగలేదు. అయినా ప్రజాదరణ పొందుతోంది. వాస్తవానికి సీట్లు, ఓట్లు లేని పార్టీల ముఖం చూడడమే ప్రజలు మానేశారు. అంతెందుకు దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్, నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వామపక్షాలు.. ఇలా అన్ని పార్టీలకు ఆదరణ తగ్గినా.. అశేష భారతావనిని ఏలుతున్న బీజేపీ సైతం ఉనికి కోసం పరితపిస్తున్న తరుణంలో పవన్ జనసేనను ఏపీ రాజకీయ యవనికపై నిలబెట్టారు.. నిలబెట్టగలిగారు.
చిల్లర రాజకీయాలకు పవన్ దూరంగా ఉన్నారు. 2013లో జనసేన ఆవిర్భవించింది. అక్కడకు కొద్దిరోజులకే సాధారణ ఎన్నికలు వచ్చాయి. నాటి ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమిలకు మద్దతు ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీని గాడిలో పెట్టాలంటే అనుభవమున్న చంద్రబాబు అవసరమని భావించారు. అందుకే స్వచ్ఛందంగా, బేషరతుగా మద్దతు తెలిపారు. నాడే పవర్ పాలిట్రిక్స్ ప్రారంభించి ఉంటే.. జనసేనకు చట్టసభల్లోకి వెళ్లే అరుదైన చాన్స్ దక్కి ఉండేది. కూటమిలో భాగంగా సీట్ల కేటాయింపు జరిగి ఉండేది. అటు తరువాత తాను మద్దతిచ్చిన రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. దానిని అడ్వాంటేజ్ గా తీసుకొని రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు డిమాండ్ చేసినా వచ్చేవి. కానీ ఏనాడూ వాటి కోసం దేబిరించలేదు.
అయితే ఉద్దానం కిడ్నీ వ్యాధి, కౌలురైతులకు ఓదార్పు..ఇలా రాష్ట్ర ప్రజల సమస్యలను తన భుజానికెత్తుకున్నారు. టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలిగారు. అటు ప్రత్యేక హోదా, విభజన సమస్యల పరిష్కారంలో చంద్రబాబు తన అనుభవాన్నివినియోగంచడంలో వెనుకబడ్డారని.. రాజకీయ లబ్ధి కోసం పాకులాడారన్న కారణంతో టీడీపీతో విభేదించారు. అటు బీజేపీకి సైతం దూరమయ్యారు. వామపక్షాలతో జతకట్టి 2019 ఎన్నికల్లో పోటీచేశారు. కానీ ఓటమే ఎదురైంది. తాను రెండుచోట్ల పోటీచేసి ఓడిపోయారు. అయినా ప్రజలను నిందించలేదు. అంతులేని మెజార్టీతో విజయం సాధించిన వైసీపీని ఆహ్వానించారు. మూడేళ్ల పాటు సమయమిచ్చారు. అయితే వైసీపీ పాలనను గాలికొదిలేయడం, విధ్వంసాలకు దిగుతుండడం, రాష్ట్రాన్ని అప్పులపాలుచేయడం, సంక్షేమం మాటున దోపిడీకి దిగుతుండడంతో రోడ్డుపైకి వచ్చి పోరాడుతున్నారు. రాజకీయ కారణాలతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పక్కకు జరిగినా.. వారి బాధ్యతను తనపై నెత్తుకొని పవన్ గట్టి పోరాటమే చేస్తున్నారు.
జనసేన ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంది. ఎదుర్కొంటోంది కూడా. రాజకీయ వ్యూహాలు చేయడంలో పవన్ వెనుకబడ్డారు. సంస్థాగత నిర్మాణం జరగకపోవడం పార్టీకి మైనస్ గా మారింది. నామినేషన్ వేస్తే చాలూ ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేస్తారన్న భావనలోనే ఉండిపోయారు. ఆ కారణంతోనే రెండుచోట్ల పోటీచేసి ఓటమి చవిచూశారు. విఫల నేతగా నిలబడ్డారు. ఇప్పటికీ విపక్షాలకు కార్నర్ అయ్యారు. వ్యతిరేకుల విమర్శలకు అవకాశమిచ్చారు. పదేళ్ల తరువాత కూడా జనసేనకు ఒక కన్ఫ్యూజన్ వీడడం లేదు. తాము పవర్ లోకి వస్తాం అని గంటాపధంగా చెప్పలేకపోతున్నారు. కానీ పలానా వారికి అధికారం దూరం చేస్తాం.. పలానా వారు తమతో కలిస్తే కానీ గెలవలేరు అన్న భావనలోనే జనసైనికులు ఉండిపోతున్నారు. ఇప్పటివరకూ బీజేపీని మిత్రపక్షంగా చెబుతున్నారు. కానీ వారితో కలిసింది లేదు. అలాగని కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్న టీడీపీతో కూడా బహిరంగంగా కలవలేకపోతున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం, గందరగోళం నెలకొంది.
ఏపీలో కర్నాటక సీన్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే అది వాస్తవానికి దగ్గరగా ఉన్నా.. ఎలా వర్కవుట్ అవుతుందన్నది ప్రశ్నార్థకం. ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధే ఉంది. అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఉన్నా.. సంక్షేమ పథకాలు, తన మార్కు దూకుడుతో విజయం తధ్యమన్న ధీమాలో ఉంది. అటు టీడీపీ సైతం తనకు క్షేత్రస్థాయిలో బలం తగ్గలేదని చెబుతోంది. తన శక్తియుక్తులను కూడదీసుకొని పోరాడుతోంది. ఈ సమయంలో రాజకీయ వ్యూహ చతురతో ముందుకెళ్లాల్సిన అవసరముంది. ముఖ్యంగా కుల రాజకీయాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొవాలి. పలానా కులం నాయకుడని చిత్రీకరించి మిగతా వర్గాలను జనసేన నుంచి దూరం చేసే కుట్రలను ఛేదించాలి. తటస్థులు, విపక్షాల్లో ఉన్న పవర్ ఫుల్ లీడర్స్ ను తనవైపు తిప్పుకోవాలి. అంతకంటే ముందుగా పార్టీ అనుబంధ విభాగాలను యాక్టివ్ చేయాలి. గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేయాలి. వీటన్నింటినీ అధిగమిస్తే మాత్రం ఏపీలో జనసేన కింగ్ అవుతుంది… కింగ్ మేకర్ గా మారుతోంది, అప్పుడు కర్నాటక కుమారస్వామి ఎపిసోడ్ రిపీట్ అవుతుంది.