
Saidabad Rape Case : సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ప్రాణాలు తీసిన నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మురంగా వేట కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటన గురించి తెలుసుకున్న యావత్ సమాజం.. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతో.. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ఏకంగా 1000 మంది పోలీసులు రంగంలోకి దిగారు.
చిన్నారిపై అత్యాచారం తర్వాత నిందితుడు ఏవైపులా వెళ్లే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారో.. అన్నివైపులా గాలింపు మొదలు పెట్టారు. ఎల్బీనగర్ నుంచి వెళ్లే దారులన్నింటా సోదాలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట హైవేతోపాటు కాలిబాటలన్నీ కలియతిరుగుతున్నారు. ఇక, నగరంలోనూ అణువణువునా గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న కల్లు, మద్యం దుకాణాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. లేబర్ అడ్డాలను కూడా శోధిస్తున్నారు. నిందితుడు రాజు మద్యానికి బానిసయ్యాడని, అందువల్ల ఏదో ఒక మద్యం దుకాణం వద్దకు వెళ్లే అవకాశంఉందని భావిస్తున్నారు. ఇప్పటికే.. అన్ని పోలీసు స్టేషన్లకు నిందితుడి ఫొటోను పంపించిన హైదరాబాద్ పోలీసులు.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజును పట్టుకోవాలని ఆదేశాలిచ్చారు. టాస్క్ ఫోర్స్ మొదలు, సీసీఎస్, ఎస్ వోటీ బృందాలు అణువణువూ జల్లెడ పడుతున్నాయి.
సీసీ కెమెరాలో రాజుతోపాటు కనిపించిన అతని స్నేహితుడిని ఇప్పటికీ పిలిచి పోలీసులు విచారించారు. అయితే.. ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, అసలు ఆ విషయం తనకు తెలియదని అతను చెప్పినట్టు సమాచారం. రాజు స్వగ్రామమైన జనగామ జిల్లా కొడకండ్లతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరులోనూ సోదాలు నిర్వహించారు. అతని బంధువులను ప్రశ్నించారు. కానీ.. ఇప్పటి వరకు జాడ దొరకలేదు.
దీంతో.. అతడు నిర్మానుష్య ప్రదేశంలో తలదాచుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటికే రాజును పట్టుకున్నవారికి, ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రూపాయల రివార్డు అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాధ్యమైనంత త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
అయితే.. నిందితుడు తప్పించుకునే ముందు జుట్టుకు రబ్బరు బ్యాండ్ పెట్టుకొని ముఖానికి మాస్కు పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు గాలింపు ముమ్మరం చేయడంతో.. గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు చేయించుకునే ఉండే అవకాశం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనికి సంబంధించిన ఫొటోలు కూడా పోలీసులకు అందుబాటులో లేవు. 2021 ఫిబ్రవరిలో ఒక కేసు విషయమై చైతన్యపురి పోలీసులు స్టేషన్ కు పిలిచి విచారించారు. ఈ క్రమంలో తీసిన ఫొటో ఒక్కటే ఆధారంగా ఉండడంతో.. దాన్నే అన్ని స్టేషన్లకూ పంపించారు.