
Pawan Kalyan : జనసేనను తాము పరిగణనలోకి తీసుకోబోము అన్నట్టుగా వైసీపీ నేతలు మాట్లాడుతుంటారు. గత ఫలితాలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తుంటారు. కానీ.. రాజకీయంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని అనుకోవడానికి అవకాశమే లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందన్నది ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి.. పవన్ కల్యాణ్ విషయంలోనూ దీనికి అవకాశం ఉందని, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ భవిష్యత్ లో ఉందనే అంటున్నారు విశ్లేషకులు. అయితే.. దీనికి కొన్ని పనులు చేయాలని అంటున్నారు. అదేంటన్నది చూద్దాం.
పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోవడంతో.. ఇక జనసేన పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. పవన్ దుకాణం మూసేసి, ఇక సినిమాలు చేసుకోవడం మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు కూడా. ఆయన కూడా ఇలాగే చేస్తారని భావించారు. కానీ..ఎవ్వరూ ఊహించని విధంగా వెంటనే జనాల్లోకి వచ్చేశారు పవన్. ఓడిపోయినా.. తాను జనాల్లోనే ఉంటానని చెప్పారు. దీన్ని ఎవ్వరూ ఊహించలేదు. తలపండిన రాజకీయ నేతల్లో ఒకరైన ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు పవన్ పై స్పందిస్తూ.. ఇది అసాధారణమని అన్నారు. ఇలాంటి ఫలితాల తర్వాత కూడా పవన్ వెంటనే జనాల్లోకి రావడం అనేది చాలా పెద్ద క్వాలిటీ అన్న.. సరిగ్గా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఉందని చెప్పారు. దాదాపుగా విశ్లేషకులు అందరూ ఇదే విషయాన్ని చెబుతున్నారు.
రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీవాసులు రెండో ఆలోచన లేకుండా.. అనుభవజ్ఞుడు అనే ఒకేఒక్క కారణంతో.. చంద్రబాబు(Chandra babu)కు పట్టం కట్టారు. కానీ.. ఆయన సరైన రీతిలో పాలించలేదని, అవినీతి, బంధు ప్రీతి వంటి పలు కారణాలతో ఆయనను తిరస్కరించారు. జగన్(Jagan) కు పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు ఆయన పాలన సగం కాలం పూర్తయింది. ఇప్పటికైతే పూర్తిస్థాయి వ్యతిరేకత లేదుగానీ.. కొంత వ్యతిరేకత వచ్చింది. రాష్ట్ర అభివృద్ధి ఊసే లేకపోవడం.. జీతాలకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉండడం మైనస్ గా మారింది. ఈ పరిస్థితి కొనసాగితే.. ఎన్నికల నాటికి జగన్ ను కూడా జనాలు పక్కన పెట్టాలనే నిర్ణయానికి రావొచ్చు కూడా.
అదే జరిగితే.. తమకే అవకాశం ఇస్తారని టీడీపీ నేతలు ఆశతో ఉన్నారు. కానీ.. పవన్ కల్యాణ్ కూడా రేసులో ఉన్నారు. ఆయనను ఆషామాషీ నేతగా తీసుకోవడానికి ఏమీలేదు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అదే ఆయనకు పెద్ద బలం. దాంతోపాటుగా.. ఓడినా జనం మధ్యనే ఉన్నారనే సానుకూలత ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా.. నిజాయితీపరుడిగా మచ్చలేని వ్యక్తిత్వం కలవాడిగా పవన్ ఉన్నారు. ఇక, రాష్ట్రంలోనే అతిపెద్ద సామాజికవర్గానికి చెందిన నేతకావడం మరో అనుకూలత. పై ఇద్దరినీ చూశాం కాబట్టి.. ఈ సారి పవన్ కు అవకాశం ఇద్దామని జనం అనుకోవచ్చని కూడా అంటున్నారు.
కాబట్టి.. పవన్ కల్యాణ్ ఇప్పటి నుంచే తనదైన కార్యాచరణతో ముందుకు సాగాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బీజేపీతో ఆయన పొత్తులో ఉన్నారు. ఈ పొత్తు ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది కీలకాంశంగా ఉంది. తన పార్టీకి సంబంధించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ముందుగానే సిద్ధం చేసుకొని, జనాల్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇవన్నీ సరిగ్గా చూసుకుని వెళ్తే.. పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి కావడం అసాధ్యమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, పవన్ ఏం చేస్తారన్నది చూడాలి.