
Traffic Challan : ‘‘హెల్మెట్ లేని ప్రయాణం చట్ట విరుద్ధం.. ఇందుకు తప్పదు భారీ జరిమానా’’ అని చెబుతుంటారు. ఫైన్ వేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. సీట్ బెల్టు పెట్టుకోకపోయినా.. ఓవర్ స్పీడుతో దూసుకెళ్లినా.. పరిమితికి మించి ప్రయాణించినా.. సిగ్నల్ జంప్ చేసినా.. ఈవిధంగా ఏ నిబంధన విధించినా చలానా వడ్డిస్తూనే ఉంటారు. అంతేకాదు.. రెండు మూడు చలానాలు పెండింగ్ లో ఉన్నా, సకాలంలో ఫైన్ కట్టకపోయినా.. వాహనాన్ని కూడా సీజ్ చేస్తుంటారు. అయితే.. ఇవన్నీ సామాన్యులకేనా? మీకు వర్తించవా సార్లు? అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు నెటిజన్లు.
ఈ ప్రశ్నలకు సంబంధించిన ఆధారాలు కూడా పోస్టు చేస్తుంటారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం.. ట్రిపుల్ రైడింగ్ వంటి ఫొటోలు పెట్టి కౌంటర్లు వేస్తుంటారు. అయితే.. ఇప్పుడు ఓ కారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఎవరిదో కాదు.. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ వాహనం. మరి, ఈ కారు ఫొటో ఎందుకు మీడియాలోకి ఎక్కిందో తెలుసా? చలానా పెండింగ్ లో ఉంది! రెండు సార్లు కాదు.. మూడు సార్లు కాదు.. ఇవి రెండూ కలిపి ఉన్నాయి! అంటే.. 23 సార్లు ఈ వాహనానికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.
కానీ.. ఇప్పటి వరకూ చెల్లించలేదు. ఆగస్టు 30 తారీఖు వరకు ఉన్న చాలానాలు ఇవన్నీ. ఇందులో 22 సార్లు అతివేగంతో ప్రయాణించినందుకు చలానా విధించగా.. ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినందుకు విధించారు. ఈ చలానాల మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాలా 22, 095 రూపాయలు!
ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామాన్యుల విషయంలో ముక్కు పిండి మరీ ఫైన్ కట్టించే పోలీసులు.. అధికారుల వాహనాల విషయంలో మాత్రం చూసీ చూడనట్టు వదిలేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మీకో న్యాయం.. మాకో న్యాయమా? అని అడుగుతున్నారు. మరి, దీనికి ట్రాఫిక్ పోలీసులు ఏం సమాధానం చెబుతారో?