Liquor Home delivery: మద్యం హోం డెలివరీపై మీ అభిప్రాయమేంటీ..? ఇంటికే సరఫరా చేస్తే.. మీకు ఓకేనా? ఆన్ లైన్ ఆర్డర్ కు ఫీజు ఎంత చెల్లించగలరు? హోం డెలివరీని మీరు ఎందుకు కోరుకుంటున్నారు..? ఇవీ.. మందు బాబులకు, ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వేసిన ప్రశ్నలు. పలు కారణాలతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లిక్కర్ ను హోండెలివరీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఈ మేరకు సర్వే జరిగింది. మరి, దీనిపై రాష్ట్ర వాసులు ఏం చెప్పారు? అన్నది చూద్దాం.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. చివరకు కరువు కాలాల్లోనూ కళకళలాడే దుకాణం బహుశా ఒక్క మందుషాపు కావొచ్చు. సాయంత్రమైతే చుక్క కోసం మందుబాబులు పడే తాపత్రయం అంతాఇంతా కాదు. అప్పు చేసైనా సరే.. గొంతు తడి చేసుకోవాలని అనుకుంటారు. అందుకే.. 24 బై 7 వైన్ షాపులు, బార్ షాపులు కిటకిటలాడుతూనే ఉంటాయి. అయితే.. కరోనా భయం ఇంకా పూర్తిగా తొలగకపోవడం.. అదే సమయంలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీకి జనాలు భారీగా అలవాటు పడిన నేపథ్యంలో.. మద్యాన్ని కూడా హోం డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే పలు రాష్ట్రాలు మద్యం హోం డెలివరీ విషయంలో కీలకంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి కూడా. ఈ నేపథ్యంలోనే ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI) ఇటీవల 8 రాష్ట్రాల్లో ఓ సర్వే నిర్వహించింది. మద్యం హోం డెలివరీ పట్ల జనాలు సుముఖంగా ఉన్నారా? లేదా.. ఏ కారణాలతో ఈ విధానాన్ని సమర్థిస్తున్నారు? అనే వివరాలు సేకరించింది.
ఈ సర్వేలో హైదరాబాద్ వాసులు వంద శాతం హోం డెలివరీని సమర్థిస్తున్నట్టు ఆ సర్వే తెలిపింది. హైదరాబాద్ తోపాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లోనూ హోం డెలివరీకి డిమాండ్ పెరుగుతోందని సర్వే గుర్తించింది.
ఇప్పటికే.. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, పుదుచ్చెరి, పంజాబ్, అస్సాం, ఒడిషా, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు మద్యం హోం డెలివరీ చేస్తున్నాయి. ఇదే కోవలో మరికొన్ని రాష్ట్రాలు కూడా సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో ISWAI సర్వే నిర్వహించింది. ఇందులో మొత్తం 7,500 మంది అభిప్రాయాలు సేకరించింది. వీరిలో వంద శాతం మంది హోం డెలివరీని సమర్థించారని సర్వే వెల్లడించింది.
దీనివల్ల కరోనా గోల తప్పడంతోపాటు మద్యం కల్తీని కూడా అరికట్ట వచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ డెలివరీకి గానూ 50 నుంచి 100 రూపాయలు ఛార్జ్ చెల్లించేందుకు సగం మంది అంగీకరించారు. మిగిలిన వారు మాత్రం ఆర్డర్ విలువలో 5 నుంచి 10 శాతం ఫీజుగా తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. ఇప్పటికే ఉన్న ఈ-కామర్స్ యాప్ ల ద్వారా డెలివరీ చేస్తే బాగుంటుందని సూచించారు. మొత్తానికి హోం డెలివరీకి అందరూ సిద్ధంగా ఉన్నట్టు తేలింది. మరి, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.