Fake Certificate
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశవ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లకు అడ్డాగా మారింది. సీక్రెట్ జరుగుతున్న ఈ తంతు తాజాగా ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. అయితే నిర్వాహకుల మధ్యలో వచ్చిన విభేదాలే ఈ అంతరాష్ట్ర స్కాం బయటపడడానికి కారణం. లేకపోతే ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లేదనే టాక్ ఏపీ లో నడుస్తోంది.
Also Read: ఆమ్రపాలికి అరుదైన అవకాశం!
ఈ నకిలీ సర్టిఫికెట్ల ముఠా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఆన్ లైన్ లో కోర్సులున్నాయని.. దరఖాస్తు చేసుకుంటే క్లాసులు నిర్వహించి పరీక్షల అనంతరం సర్టిఫికెట్లు ఇస్తామని దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో ప్రచారం నిర్వహించింది. విద్యార్థుల నుంచి భారీగా సొమ్ములు వసూలు చేసి డూప్లికేట్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. వీరి చేతిలో మోసపోయిన ఓ బ్రాంచ్ నిర్వాహకుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ అంతరాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టును రట్టు చేశారు.
ప్రకాశం జిల్లాలో భారీ నకిలీ సర్టిఫికెట్ల ముఠా పట్టుబడింది. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విద్యార్థులకు అమ్ముతున్న ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మహిళతో సహా ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా ఏపీలోని 11 జిల్లాల్లో బ్రాంచ్ లు ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. 5 లక్షల 47వేల రూపాయల బ్యాంక్ అకౌంట్ ను సీజ్ చేశారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న కంప్యూటర్, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం జిల్లా శిలారపు బాల శ్రీనివాసరావు వైజాగ్ లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ సెంటర్ (జేఎన్.టీ.యూ) పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను రిజిస్టర్ చేశాడు. తన భార్య సుజాతను దీనికి వైఎస్ చైర్మన్ చేశాడు. ప్రకాశం జిల్లా యద్దనపూడికి చెందిన జంపని వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కలిసి దందా ప్రారంభించాడని పోలీసులు తెలిపారు.
Also Read: ఆంధ్రజ్యోతి యూటర్న్…. ఇంతకు మించిన సాక్ష్యం అవసరమా…?
దేశవ్యాప్తంగా విద్యార్థులకు వివిధ యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లను ఈ ముఠా అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. దీని వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ భారీ స్కాం బయటపడడంతో దేశవ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లకు ఏపీ అడ్డాగా మారిందా? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.