తెలంగాణలో 90 శాతం అదుపులో కరోనా!

తెలంగాణలో కరోనా వైరస్ ఆందోళనకర రీతిలోకి మారినప్పటికీ, క్రమంగా అదుపులోకి వస్తున్నది. 90 శాతం అదుపు చేయగలిగామని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ భరోసా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో వైరస్ ఉనికి ఉండబోదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖ్రరావు ప్రకటించిన మరుసటి రోజునుండి ఉపద్రవం వలే డిల్లీ మర్కజ్‌ నుంచి పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా ఎదురు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఒకింత తీవ్రమైన వత్తిడికి గురయింది. మొదట్లో ఢిల్లీ […]

Written By: Neelambaram, Updated On : April 9, 2020 11:51 am
Follow us on


తెలంగాణలో కరోనా వైరస్ ఆందోళనకర రీతిలోకి మారినప్పటికీ, క్రమంగా అదుపులోకి వస్తున్నది. 90 శాతం అదుపు చేయగలిగామని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ భరోసా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో వైరస్ ఉనికి ఉండబోదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖ్రరావు ప్రకటించిన మరుసటి రోజునుండి ఉపద్రవం వలే డిల్లీ మర్కజ్‌ నుంచి పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా ఎదురు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఒకింత తీవ్రమైన వత్తిడికి గురయింది.

మొదట్లో ఢిల్లీ నుండి వచ్చిన వారు సహకరింపక పోవడం, వైద్య సిబ్బందిపై దాడులకు కూడా దిగడంతో ఒక విధంగా గందరగోళానికి గురయ్యారు. అయితే క్రమంగా పరిస్థితులు అదుపులోకి వస్తూ ఉండడంతో అధికారులు ఇప్పుడు ఊపిరి పీల్చుకొంటున్నారు.

డిల్లీ మర్కజ్‌ నుంచి రాష్ర్టానికి 1,100 మందికి పైగా రాగా, వారితో కాంటాక్ట్‌ అయిన 3,158 మందిని క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచామని, వారిని పరీక్షించి నెగెటివ్‌ వచ్చినవారిని 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచుతామని రాజేందర్ తెలిపారు. వాళ్లంతా ఏప్రిల్‌ 21 వరకు ఇండ్లలోనే ఉండాలని స్పష్టంచేశారు.

వారిపై వైద్య, పోలీసు సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని, రోజుకు రెండుసార్లు వైద్యసిబ్బంది వెళ్లి పరీక్షిస్తారని మంత్రి చెప్పారు. మర్కజ్‌ కేసులు తగ్గినప్పటికీ పరిస్థితిని తేలిగ్గా తీసుకోవద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు వెల్లడించారు. చికిత్స పొందుతున్నవారిలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదని తెలిపారు. వారిలో కొందరికి పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌ వచ్చినవారిని డిశ్చార్జ్‌ చేస్తామని మంత్రి ఈటల పేర్కొన్నారు.

మరోవంక, పీపీఈలు, ఎన్‌-96 మాస్క్‌లు, గ్లౌజ్‌లు, మందులు.. టెస్టింగ్‌ కిట్లు అధికసంఖ్యలో అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆయా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడుతున్నారు. 5 లక్షల పీపీఈ కిట్లు, 5 లక్షల ఎన్‌-95 మాస్క్‌లు, 2 కోట్ల డాక్టర్‌ మాస్క్‌లు, కోటి గ్లౌజ్‌లు, 5 లక్షల గాగుల్స్‌, 3.5 లక్షల టెస్టింగ్‌ కిట్లు త్వరలో రానున్నట్లు మంత్రి వెల్లడించారు.రూ.400 కోట్ల వ్యయంతో మందులు కొంటున్నామని చెప్పారు.

ఇక, తెలంగాణలో ఐదారు పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తిస్తూ, ప్రత్యేక పర్యవేక్షణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు ఆ విధంగా 125 ప్రదేశాలను గుర్తించగా, వాటిల్లో 60 హైదరాబాద్ నగరంలోనే ఉండడం గమనార్హం.