చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి ఆ దేశంతో పాటు భారత్, బ్రెజిల్ లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. మూడు రోజుల చికిత్స అనంతరం ట్రంప్ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
కోలుకున్న తరువాత ట్రంప్ కరోనా వైరస్ గురించి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్ ఇతర ఫ్లూ లాంటిదేనని చెప్పారు. తనకు కరోనా సోకడం దేవుడిచ్చిన వరమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చికిత్స అనంతరం ఒక వీడియోను విడుదల చేసిన ట్రంప్ ఆ వీడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైరస్ ను దేవుని ఆశీర్వాదంగా భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
కరోనా వల్ల తనకు ఎన్నో శక్తివంతమైన మందుల గురించి తెలిసిందని వెల్లడించారు. రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ మందులు తనపై అద్భుతంగా పని చేశాయని వెల్లడించారు. అమెరికా పౌరులకు ఉచితంగా చికిత్స అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. కరోనా చికిత్స అందించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. వీడియో అంతా పాజిటివ్ గా మాట్లాడిన ట్రంప్ చైనాపై మాత్రం విమర్శల వర్షం కురిపించారు.
చైనా నుంచి వ్యాప్తి చెందిన వైరస్ కు అమెరికా దేశ పౌరులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి చైనా భారీ మూల్యం చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా మరణాలు ఎక్కువగా నమోదు కాగా ఇప్పటికే 2,10,000 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మరోవైపు మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి.