World No Tobacco Day 2026: సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తుల్లో వేలాది హానికర రసాయనాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం, శ్వాసకోశ వ్యాధులు వంటి అనేక ప్రాణాంతక సమస్యలకు కారణమవుతాయి. పొగ తాగే వ్యక్తులే కాకుండా, వారి చుట్టూ ఉన్నవారు కూడా పరోక్ష ధూమపానం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అయితే పొగాకు మానడానికి ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచవ్యాప్తంగా ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం’ను నిర్వహిస్తున్నారు.పొగాకు వాడకం వల్ల కలిగే ప్రాణాంతక ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశ్యం. అయినా కూడా పొగరాయుల్లో ప్రత్యేకంగా అవగాహన రాకపోతే పొగాకును మానలేరు. ఇలాంటి సందర్భంగా ఇవి చేయాలని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే?
1987లో World Health Organization (WHO) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పొగాకు సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతుండటంతో, ప్రజలను ఈ ప్రమాదకర అలవాటు నుంచి దూరం చేయడానికి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయినా కూడా నేటి కాలంలో యువతలో పొగాకు వినియోగం ఆందోళనకరంగా పెరుగుతోంది. స్నేహితుల ప్రభావం, ఫ్యాషన్‌గా భావించడం, ఒత్తిడి తగ్గుతుందనే అపోహలు యువతను పొగాకు వైపు ఆకర్షిస్తున్నాయి.
అయితే ఒకసారి అలవాటు పడితే దాని నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. అందుకే యువతను పొగాకు మహమ్మారి నుంచి రక్షించేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేయాలని WHO సూచిస్తోంది. మరోవైపు పొగాకు మానడంలో మొదటి అడుగు దృఢమైన సంకల్పం. ‘నేను ఈ అలవాటును పూర్తిగా వదిలేస్తాను’ అనే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా మీ నిర్ణయం గురించి తెలియజేస్తే వారు మీకు మద్దతు అందిస్తారు. పొగాకు మానడానికి ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించుకోవడం కూడా మంచి పద్ధతి.
పొగాకు తీసుకోవాలనే కోరిక వచ్చినప్పుడు వెంటనే నీరు తాగడం, పండ్లు తినడం, షుగర్‌లెస్ చ్యూయింగ్ గమ్ నమలడం లేదా కొద్దిసేపు నడవడం వంటి పనులు చేయాలి. లోతైన శ్వాస తీసుకోవడం, వ్యాయామం చేయడం కూడా కోరికను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణంగా ఈ కోరిక కొన్ని నిమిషాల్లో తగ్గిపోతుంది. టీ తాగేటప్పుడు, స్నేహితులతో కూర్చున్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు పొగాకు వాడే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాంటి పరిస్థితులను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడాలి. పొగాకు గుర్తుకు తెచ్చే వస్తువులు, ప్యాకెట్లు, లైటర్లు వంటి వాటిని ఇంటి నుంచి తొలగించడం మంచిది.
పొగాకు మానడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని గంటల్లోనే రక్తపోటు, గుండె స్పందన సాధారణ స్థితికి చేరుతాయి. కొన్ని వారాల్లో శ్వాసక్రియ మెరుగుపడుతుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. మీ ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తు కోసం ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకుకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పడం ఉత్తమ నిర్ణయం.
