World Cancer Day 2025 : ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి, దాని గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, ఈ వ్యాధితో పోరాడటానికి ప్రపంచ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. అయితే నేడు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా, ఈ రోజు ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఉద్దేశ్యం ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా, దాని నివారణ, చికిత్స, నియంత్రణ కోసం సంయుక్త ప్రయత్నాలను ప్రోత్సహించడం కూడా అంటున్నారు నిపుణులు. మరి ఈ రోజు ప్రజలను భయపెట్టే ఈ వ్యాధి గురించి పూర్తి అవగాహన పెంచుకోవడం మన బాధ్యత. అందుకే ఈ ఆర్టికల్ మీకోసం.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ చరిత్ర
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4, 2000న ప్రారంభమైంది. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) దీనిని స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి, ఈ వ్యాధిపై పోరాటంలో ప్రపంచ సంఘీభావాన్ని ప్రదర్శించడానికి UICC ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ దినోత్సవాన్ని స్థాపించడం ముఖ్య ఉద్దేశ్యం క్యాన్సర్ గురించిన అపోహలను తొలగించడంమే.
క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం, ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు ఈ వ్యాధికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా ప్రేరేపించడం కూడా ఈ రోజు ముఖ్య ఉద్ధేశ్యం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజున వివిధ క్యాన్సర్ సంబంధిత కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, అవగాహన ప్రచారాలు నిర్వహిస్తుంటారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ప్రాముఖ్యత
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొనే వ్యాధి క్యాన్సర్ కాబట్టి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. జీవనశైలిలో మార్పులు, కాలుష్యం, పొగాకు, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఈ వ్యాధిని మరింత పెంచుతున్నాయి.
ఈ అంశాలన్నింటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఈ వ్యాధిని నివారించడానికి వారికి సరైన సమాచారం, వనరులను అందించడం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ లక్ష్యం. ఈ రోజు ద్వారా, క్యాన్సర్ లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్స, నివారణ గురించి ప్రజలకు సమాచారం అందించాలి. అలాగే, ఈ రోజున క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులతో మద్దతు ప్రకటిస్తుంటారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 థీమ్ ఏంటంటే?
ప్రతి సంవత్సరం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఒక ప్రత్యేక ఇతివృత్తంతో జరుపుకుంటారు. ఈ థీమ్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో కొత్త లక్ష్యాలను, దిశను నిర్దేశిస్తుంది. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ థీమ్ “యునైటెడ్ బై యునైక్”. క్యాన్సర్‌ను కేవలం చికిత్స ద్వారా ఓడించలేమని, ప్రజలతో కలిసి పోరాడి దాని మూలాల నుంచి నిర్మూలించాల్సిన యుద్ధం అని ప్రజలకు అర్థమయ్యేలా చేయడమే ఈ ఇతివృత్తం లక్ష్యం. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో ప్రతి వ్యక్తి సహకరించవచ్చని ఈ థీమ్ నొక్కి చెబుతుంది.
క్యాన్సర్ పై అవగాహన అవసరం
క్యాన్సర్ అనేది ఒక వ్యాధి. దీనిని ముందుగానే తెలుసుకుంటే నయం చేయవచ్చు. కానీ, చాలా సందర్భాలలో క్యాన్సర్ లక్షణాల గురించి ప్రజలకు తెలియదు. దీని వల్ల వ్యాధి ఎక్కువ అవుతుంది. చికిత్స కూడా కష్టమవుతుంది. అందుకే క్యాన్సర్ అవగాహన పెంచడం చాలా ముఖ్యం.
ఆకస్మిక బరువు తగ్గడం, దీర్ఘకాలిక దగ్గు లేదా గొంతు నొప్పి, శరీరంలో గడ్డలు, అలసట, చర్మ మార్పులు వంటి క్యాన్సర్ లక్షణాల గురించి ప్రజలకు తెలియజేయాలి. అలాగే, ఈ రోజున ప్రజలు క్రమం తప్పకుండా మీ హెల్త్ చెకప్ చేయించకోవడం అవసరం. అంతేకాదు కనీసం ఈ రోజు నుంచి అయినా ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలి.
క్యాన్సర్ నివారణ చర్యలు
క్యాన్సర్‌ను నివారించడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
పొగాకు – మద్యం సేవించవద్దు: పొగాకు, మద్యం సేవించడం క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో ఒకటి. వీటికి దూరంగా ఉండటం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన, రెడ్ మీట్ వినియోగాన్ని నివారించాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం: శారీరక శ్రమను మీ దినచర్యలో చేర్చుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
క్రమం తప్పకుండా పరీక్షలు: ముఖ్యంగా కుటుంబంలో క్యాన్సర్ ఉంటే, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. సూర్యకిరణాల నుంచి రక్షణ అవసరం. చర్మ క్యాన్సర్‌ను నివారించడానికి, ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.