
ప్రపంచ దేశాల ప్రజలను కరోనా వైరస్ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుంది. అయితే గతంలో కొందరు శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కనిపెట్టినా పెద్దగా ఫలితం ఉండదని.. కరోనాకు ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వార్తల గురించి స్పష్టతనిచ్చింది.
కరోనా కు ఇతర వైరస్ ల మాదిరిగా ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ ను ఇవ్వాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. డబ్ల్యూహెచ్వో డాక్టర్ రిచర్డ్ మిహిగో మాట్లాడుతూ వ్యాక్సిన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇన్ ఫ్లూయెంజా వైరస్ లకు, కరోనా వైరస్ కు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని ఇన్ ఫ్లూయెంజా వైరస్ కు ఇచ్చిన విధంగా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని తాము భావించడం లేదని పేర్కొంది.
క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నామని.. వ్యాక్సిన్లను, చికిత్సలను పరీక్షించే వాతావరణాన్ని కల్పించడమే తమ పని అని చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం నోవా వ్యాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రజెనెకా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వేయించుకున్న ఒక వ్యక్తిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో తాత్కాలికంగా ఆ కంపెనీ క్లినికల్ ట్రయల్స్ ఆగాయి.
మరోవైపు పలు దేశాల్లో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాల ప్రజల ఆరోగ్య పరిస్థితితో పాటు ఆర్థిక పరిస్థితిపై కూడా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సంవత్సరం చివరినాటికి లేదా 2021 జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.