Palm toddy benefits: పల్లెటూర్లలో ఉండే తాటి చెట్ల నుంచి వచ్చే కల్లు తాగడం వల్ల ఎంతో ఆరోగ్యమని కొందరు చెబుతూ ఉంటారు. కొన్ని ప్రత్యేక కాలాల్లో ఈ చెట్లనుంచి వచ్చే ద్రవం తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందని కొందరు వైద్యులు సైతం చెబుతున్నారు. కానీ తాటి చెట్టు నుంచి వచ్చిన కల్లు తాగడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారని మరికొందరు చెబుతున్నారు. వాస్తవానికి చెట్లనుంచి స్వచ్ఛమైన కల్లు మాత్రమే వస్తుంది. ఇలా వచ్చిన దానిని కొందరు కల్తీ చేసి విక్రయించడం ద్వారా.. దానిని తాగిన వారు అనారోగ్యాల పాలవుతుంటారు. అంతేకాకుండా తాటి చెట్ల నుంచి వచ్చిన కల్లు ను ఇష్టం వచ్చిన సమయంలో కాకుండా.. నిర్ణీత సమయంలో మాత్రమే తీసుకోవాలి. లేకుంటే అది పాయిజన్ గా మారే అవకాశం ఉంది. అసలు ఏ సమయంలో కల్లు తాగడం మంచిది? షుగర్ వ్యాధి ఉన్నవారు కల్లు తాగడం మంచిదేనా?
చాలామంది తాటికల్లు అనగానే ఎప్పుడైనా తాగవచ్చు అని అనుకుంటారు. కానీ తాటి చెట్టు నుంచి తీసిన కల్లును 12 గంటల లోపు మాత్రమే తీసుకోవాలి. తాటికల్లులో 75 క్యాలరీలు ఉంటాయి. ఇందులో సుక్రోజ్ కూడా ఉంటుంది. అయితే తాటికల్లు వెంటనే తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ సమయం గడుస్తున్న కొద్ది ఇందులో ఆల్కహాల్ శాతం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ కల్లుకు ఎండ వేడి ఎక్కువగా తగలడం వల్ల మరింతగా ఆల్కహాల్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల తాటి కల్లు ఉదయం ఎలాంటి ఆహారం తీసుకోకుండా మాత్రమే తాగే ప్రయత్నం చేయాలి.
కొంతమంది చెబుతున్న ప్రకారం తాటికల్లును డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చు అని అంటున్నారు. అయితే ఉదయం మాత్రమే తీసిన తాటికల్లులో సుక్రోజ్ శాతం తక్కువగా ఉండడంతో తీసుకోవచ్చు అని అంటున్నారు. అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే అని చెబుతున్నారు. ఇన్సులిన్ వాడేవారు.. షుగర్ శాతం ఎక్కువగా ఉన్నవారు వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు.
స్వచ్ఛమైన తాటికల్లు తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమే అని అంటున్నారు. తాటికల్లు తాగడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరానికి చల్లదనని ఇస్తుంది. వేసవి కాలంలో అయితే ఇది ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలాగే దాహం ఎక్కువగా వేసే వారికి కూడా దాహాన్ని తగ్గిస్తుంది. తాటికల్లులో సహజ షుగర్లు, ఖనిజాలు ఉండడంవల్ల తాగిన వెంటనే శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. మూత్ర సంబంధిత సమస్యలు ఉన్నవారు.. యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తాటికల్లు లో విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. అలసటతో ఉన్నవారు, రోజంతా శారీరకంగా పనిచేసిన వారు తాటికల్లు తాగడం వల్ల శరీరానికి ఉపశమనం కలుగుతుంది.