Heart Disease : మొన్న లోకేష్ పాదయాత్ర సందర్భంగా తారకరత్న కుప్పకూలిపోయాడు.. కార్డియాక్ అరెస్ట్ అని డాక్టర్లు తేల్చేశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ లో ఆయన చికిత్స పొందుతున్నారు.. పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. ఈ క్షణమైనా కూడా వినరాని వార్త వినాల్సి వస్తుందేమోనని అభిమానులు కలత చెందుతున్నారు.. కేవలం తారకరత్నే కాదు ఇటీవల పాతికేళ్ల వయసులో పిల్లలు కూడా అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు.. అసలు అకస్మాత్తుగా గుండెపోటు ఎందుకు వస్తుంది? అది రావడానికి గల కారణాలేంటి? ఎలాంటి చర్యలు తీసుకుంటే మన గుండెను కాపాడుకోవచ్చు? దీనిపై ఓకే తెలుగు ప్రత్యేక కథనం.
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ పాతికేళ్ల యువకుడు మూడు రోజులపాటు ఉదయం నిద్ర లేచే సమయంలో ఛాతిలో నొప్పి సమస్యను ఎదుర్కొన్నాడు.. గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి, మందులు తీసుకున్నాడు.. ఒకరోజు స్నేహితుడి బండి పై వెళ్తూ కుప్పకూలిపోయాడు.. పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేసిన అనంతరం వైద్యులు స్టంట్ వేసి ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు.
ఇక కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు.. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి కన్నుమూశాడు.. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే.. వాస్తవానికి పునీత్ రాజ్ కుమార్, గౌతమ్ రెడ్డి ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద చూపిస్తూ.. రోజు జిమ్ చేస్తూ ఉంటారు.. ఆయిల్ ఫుడ్ అసలు తినరు. వీళ్ళకి కూడా గుండెపోటు వచ్చింది.
ఇటీవల వయస్సు సంబంధం లేకుండా గుండెపోట్లు సంభవిస్తున్నాయి.. ఫలితంగా స్టంట్ లు, యాంజియో ప్లాస్ట్ లు చేయించుకోవాల్సి వస్తోంది.. అయితే చాలామంది ఛాతిలో నొప్పి అంటే గుండెపోటుగా భావించడం లేదు.. అదేదో కడుపులో నొప్పి అని మాత్రమే అనుకుంటున్నారు. తలనొప్పికి, కడుపునొప్పికి సొంతంగా మందులు వినియోగిస్తున్నారు.. దీనివల్ల సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు పోతున్నాయని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధూమపానం, డ్రగ్స్ వాడకం వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు కుంచుచుకుపోతున్నాయి.. గుండెకు రక్తం సరఫరా కాక పోవడం గుండెపోటుకు దారితీస్తోంది.. చేసే పనిలో ఒత్తిడి పెరిగిపోయి గుండె నొప్పితో కొంతమంది సతమతమవుతూ ఉన్నారు. గుండెకు సంబంధించిన మరణాలలో సగం ఆకస్మాత్తుగా సంభవిస్తున్నవే. ఈ తరహా మరణాలకు కార్డియో వాస్క్యు లర్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. 40 ఏళ్లు దాటిన వారిలో 35 నుంచి 40 శాతం కార్డియాక్ అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది.. ఇలాంటి వారిలో 50 శాతం మంది ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నారు.. ఈ తరహా గుండెపోటు వచ్చిన వారికి లెవెల్ -1 కార్డియాక్ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా చికిత్స అందిస్తే దాదాపు 70 నుంచి 80% మేరకు రోగిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చు.. ఛాతి నొప్పి వచ్చిన రోగుల్లో 10 శాతం అత్యవసరంగా ఆసుపత్రికి వచ్చేసరికి తక్కువ రక్తపోటు, లేక ఎడమవైపు గుండె పంప్ పనితీరు మందగించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ వస్తుంది.. 25 సంవత్సరాల నుంచే గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటం వల్ల శక్తి సామర్థ్యాలు తగ్గుతూ ఉంటాయి.. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, కొలెస్ట్రాల్ వల్ల గుండెజబ్బులు పెరుగుతున్నాయి . మూత్రపిండాలు, కాలేయం వ్యాధులతో బాధపడే వారిలో కూడా గుండె సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.. యువత మధుమేహం వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవడం, ధూమపానం వంటి అలవాట్లకు దూరం కావడం గుండెకు క్షేమమని వైద్యులు చెబుతున్నారు.. ధూమపానం చేసే వారికి సమీపంలో ఉండేవారు కూడా ఆ పొగ కారణంగా త్వరగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు.. పొగాకును నమలడం, గుట్కా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.. ఇంట్లో ఒకరు పొగ తాగితే అది కుటుంబ సభ్యులందరికీ గుండె జబ్బును తెచ్చిపెడుతుంది.. పొగ తాగే వారిలో బ్లడ్ క్లాట్ అవుతుంది.. దీంతో స్ట్రోక్ వస్తుంది. డ్రగ్స్ వినియోగించే వాళ్లలో కూడా స్ట్రోక్ వస్తుంది.. పలు రకాల డ్రగ్స్ వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి గుండెపోటుకు దారితీస్తోంది.. ఇతరులతో పోలిస్తే స్మోకింగ్ చేసే వారిలో పది రెట్లు ఎక్కువగా 10 రెట్లు గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి.
ఇక ఛాతిలో హఠాత్తుగా నొప్పి రావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం.. గుండెనొప్పి మెల్లగా మొదలై.. ముందుకు, వెనక్కి, పక్కలకు పాకుతూ ఉంటుంది.. కొన్ని సందర్భాల్లో ఛాతి లో నొప్పి అనేది లేకున్నా… అసౌకర్యంగా అనిపిస్తుంది.. ఇది తగ్గిపోతూ, మళ్లీ వస్తూ ఉంటుంది.. ఇలాంటి లక్షణాలు ఉంటే గుండె సంబంధిత సమస్యలని భావించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.. నిర్లక్ష్యం పనికిరాదు.. సాధారణంగా ఛాతీ మధ్యలో మొదలైన నొప్పి, ఎడమవైపు, వెనక్కి వెళ్తూ ఉంటుంది.. అప్పుడప్పుడూ కుడివైపు వెళుతూ ఉంటుంది. ఒక్కోసారి రెండువైపులకూ విస్తరిస్తూ ఉంటుంది.. కొన్ని సందర్భాల్లో ఎడమవైపు భుజం నుంచి మణికట్టువరకు తిరుగుతూ ఉంటుంది. అందుకే గుండె చెప్పేది వినాలి.. గుండె ఆరోగ్యానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.