Best time to eat breakfast: చాలామంది ఉదయం లేవగానే వాకింగ్ చేస్తుంటారు. ఆ తర్వాత హడావుడిగా రెడీ అయి తమ విధుల్లోకి వెళ్తారు. ఈ గ్యాప్ లో వీలైతే టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి సమయం ఉండదని కొందరు అంటుంటే.. ఉదయమే ఏమి తినబుద్ధి కాదు అని మరి కొందరు అంటారు. అయితే ఇంకొందరు బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా సమయపాలన లేకుండా తింటుంటారు. వాస్తవానికి ప్రతిరోజు నిర్ణీత సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల శరీరానికి ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇష్టం వచ్చినట్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎనర్జీ లేకుండా అలసటతో ఉంటారని చెబుతున్నారు. అసలు అల్పాహారం ఈ సమయంలో చేయాలి? ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి?
కొందరు అయితే నిపుణులు తెలుపుతున్న ప్రకారం ప్రతిరోజు ఒక నిర్ణీత సమయంలో అల్పాహారం తీసుకోవడం మంచిదని అంటున్నారు. కొంతమంది వైద్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఉదయం 8 గంటల లోపు బ్రేక్ ఫాస్ట్ చేయడం మంచిది అంటున్నారు. ఎందుకంటే రాత్రంతా నిద్రపోయిన సమయంలో శరీరానికి ఎలాంటి ఆహారం అందదు. ఉదయం లేవగానే అల్పాహారం తీసుకోవడం వల్ల మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది. ఈ సమయంలో క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. అలాగే ఉదయమే శరీరానికి సరైన ఆహారం అందించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఉదయం ఏదైనా ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అందువల్ల ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల లోపు అల్పాహారం తీసుకోవడం మంచిదని వైద్యులు తెలుపుతున్నారు.
అయితే ఈ సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరైన సమయంలో ఆల్పాహారం తీసుకోకపోతే గ్యాస్, అసిడిటీ వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి, నీరసం వంటి సమస్యలు ఉంటాయి. ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మధ్యాహ్నం ఎక్కువగా భోజనం చేయాల్సి వస్తుంది. ఇలా ప్రతిరోజు పరిమితికి మించి భోజనం చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
బ్రేక్ ఫాస్ట్ కోసం సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. ఉదయం ప్రోటీన్లు కలిగిన పాలు, పప్పులు, గుడ్లు తీసుకోవాలి. అలాగే ఫైబర్ కలిగిన పండ్లు, కూరగాయలను సలాడ్ గా తీసుకోవడం మంచిది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కలిగిన జొన్న, ఓట్స్, రాగి కి సంబంధించిన ఆహారం తీసుకోవడం వల్ల ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసే ముందు గోరువెచ్చని నీరు తాగాలి. 20 లేదా 30 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం చేయాలి. ఆ తర్వాత అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరం సమతుల్య స్థితిలో ఉంటుంది.