House: ప్రతి ఒక్కరి జీవితంలో యూనివర్సల్ కోరిక సొంత ఇల్లు కట్టుకోవడం. అద్దె ఇంట్లోపరిమితులకు లోబడి జీవించాలి. కానీ సొంత ఇంట్లో ఎలా ఉన్న ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా నేటి కాలంలో సొంత ఇల్లు ఉందంటే నెలకు రూ.10 వేల వరకు ఆదాయం పొందుతున్నట్లే. అయితే సొంత ఇల్లు కలిగి ఉండడం ఆషామాషీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సొంతంగా ఇల్లు నిర్మించుకుందామనుకున్నా నిర్మాణ ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో సొంత ఇల్లును ఎలా కొనుగోలు చేయాలి? ఏం చేస్తే రిస్క్ లేకుండా ఇల్లు కొనగలుగుతాం..
ఉద్యోగం, వ్యాపారం చేసేవారెవరైనా తమకు వచ్చిన ఆదాయంతో ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటారు. అయితే ఒక ఇల్లు కొనాలంటే జీవితాంతం కష్టపడిన సొమ్ములో సగం వరకు పోతుంది. ఆ డబ్బు మొత్తం కూడబెట్టేసరికి సమయం ఉండదు. ఇలాంటి తరుణంలో ముందుగా అప్పు చేసి ఇల్లు కొనానుకుంటారు. అయితే ఇల్లు కోసం చేసే అప్పు తీరదు అని కొందరి భావనం. అలాంటప్పడు బడ్జెట్ ప్రకారమే ఇల్లును కొనుగోలు చేయండి. ఉదాహరణకు సంపాదనలో 30 శాతం వరుకు ఇల్లు కొనుగోలుకు వెచ్చించే వారైతేనే కొనుగోలు చేయాలి. లేకుంటే ఈఎంఐఐ భారంతో ఇతర ఖర్చులకు ఇబ్బందులు ఏర్పడుతాయి.
సొంత ఇల్లు అంటే జీవితాంతం ఉంటుంది. అద్దె ఇంట్లో ఉన్నవారు అక్కడి వాతావరణ పరిస్థితులు నచ్చకపోతే మరో ఇంట్లోకి చేరొచ్చు. కానీ ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేస్తే అక్కడే ఉండిపోవాలి. ఈ తరుణంలో మంచి లోకేషన్, మార్కెట్, హాస్పిటల్ తదితర అవసరాలకు ఈ ఇల్లు అనుకూలంగా ఉందా? అనేది చూసుకోవాలి. ముఖ్యంగా అక్కడి వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. ఇక ఇల్లు కొన్న తరువాత అందులో మీరే ఉంటారా? లేక అద్దెకు ఇవ్వగలరా? అనే విషయం ప్లాన్ చేసుకోవాలి.
ఇల్లు కొనుగోలు చేసే ముందు దానికి తగిన బడ్జెట్ సెట్ అవుతుందా? అనేది ప్లాన్ వేయాలి. ఉదాహరణకు రూ.50 లక్షలతో ఇల్లు కొనుగోలు చేస్తే ఆ బడ్జెట్ ను తీర్చగలిగే శక్తి ఉంటుందా? లేదా ఒకవేళ ఉద్యోగం పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా.. ఇల్లు అప్పు తేరే మార్గం ఉందా? అనేది చూసుకోవాలి. లేకుండా ఇల్లుకు చేసిన రుణం ఈఎంఐలు పెండింగులో పడితే మొదటికే మోసం అవుతుంది. అందుకే రెవెన్యూ బడ్జెట్ ప్లానింగ్ తప్పనిసరిగా ఉండాలి.