Homeలైఫ్ స్టైల్Dead Bedroom Relationship: బంధాలకే పరిమితం.. అనుబంధాలు దూరం!

Dead Bedroom Relationship: బంధాలకే పరిమితం.. అనుబంధాలు దూరం!

Dead Bedroom Relationship: ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం.. ప్రేమగా మాట్లాడుకుంటారు.. అన్యోన్యంగానే ఉంటారు.. కానీ ఏం లాభం..? అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అవును.. ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలు ఇలాగే ఉంటున్నారట. ఒకే పడకగదిలో ఉన్నా.. తరచూ శృంగార జీవితాన్ని ఆస్వాదించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. రోజులు, వారాలు, నెలలు కాదు.. ఏడాదికి ఒకసారి కూడా శృంగారంలో పాల్గొనని జంటలు కూడా ఉన్నాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం చెబుతోంది. దీన్నే ‘డెడ్‌ బెడ్‌రూమ్‌’గా పిలుస్తున్నారు నిపుణులు. ఏదేమైనా ఈ దూరం అప్పటికప్పుడు ప్రభావం చూపకపోయినా.. దీర్ఘకాలంలో దంపతుల మధ్య పూడ్చుకోలేనంత అగాథం సృష్టించే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే దీనికి కారణాలను ఆదిలోనే పసిగట్టి.. సమస్యను పరిష్కరించుకోవడం మంచిదంటున్నారు.

అనుబంధాన్ని దృఢ పరిచే అంశం..
భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని దృఢం చేసే అంశాల్లో శృంగారానిది కీలక పాత్ర. కానీ వివిధ కారణాల రీత్యా చాలా జంటలు దీనిపై ఆసక్తి చూపరు. ఒకే గదిలో కలిసి పడుకుంటున్నప్పటికీ నెలల తరబడి.. ఎడమొహం, పెడమొహంగానే వ్యవహరిస్తారు. ఇలాంటి అనుబంధాన్నే ‘డెడ్‌ బెడ్‌రూమ్‌ రిలేషన్‌షిప్‌’గా పిలుస్తారు. అయితే ఇందుకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వివిధ అంశాలు కారణమవుతున్నాయని చెబుతున్నారు నిపుణులు.

‘కోరికలు’ కొండెక్కడానికి కారణాలు..

– దంపతుల్లో ఒకరికి శృంగారంపై ఆసక్తి ఉన్నా.. మరొకరు అయిష్టత చూపడం, సిగ్గుపడడం.. వంటి కారణాల వల్ల చాలామంది దంపతులు దూరంగా ఉండాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో అవతలి వారు చిన్న బుచ్చుకునే ప్రమాదం ఉంటుంది.

– గది వాతావరణానికి సర్దుకోకపోవడం వల్ల కూడా భార్యాభర్తలు దూరంగా ఉండాల్సి వస్తుందట. అంటే.. ఒకరు ఏసీ కావాలని, మరొకరు వద్దని.. ఒకరు వెలుతురు ఉండాలని, మరొకరు చీకటిని కోరుకోవడం.. ఇలాంటి వాగ్వాదాల మధ్య మానసిక ప్రశాంతత కొరవడుతుంది. ఇది కూడా శృంగార జీవితాన్ని దెబ్బతీస్తుంది.

– ఉమ్మడి కుటుంబాల్లో ఉండే వారిలో చాలామంది తరచూ తాము కోరుకున్నట్లు శృంగార జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నట్లు తమ వద్దకొచ్చే కేసుల్ని బట్టి నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇతర కుటుంబ సభ్యులు ఏమనుకుంటారోనని జంటలు అసౌకర్యానికి గురవడం, సిగ్గు, బిడియం.. వంటివి ప్రధాన కారణాలుగా మారుతున్నాయంటున్నారు.

– కొంతమంది భార్యాభర్తలు వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి రావచ్చు. ఈ దూరం కూడా దాంపత్య బంధంలో చిచ్చు పెట్టచ్చంటున్నారు నిపుణులు.

– మహిళల్లో చాలామందికి పిల్లలు పుట్టాక లైంగిక కోరికలు తగ్గుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. ఇందుకు పిల్లల బాధ్యతల వల్ల తీరిక లేని షెడ్యూల్, శరీరంలో హార్మోన్ల మార్పులు, ప్రసవానంతరం ఆలస్యంగా కోలుకోవడం.. వంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

– కెరీర్‌పై పెట్టే శ్రద్ధ దాంపత్య జీవితంపై పెట్టకపోవడం మరో కారణంగా చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో వృత్తిరీత్యా విపరీతమైన అలసట, ఒత్తిడి వల్ల చాలామందిలో లైంగికాసక్తి తగ్గుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది.

– కొంతమంది లైంగిక వ్యాధులకు భయపడి.. మరికొందరు థైరాయిడ్, మధుమేహం, నరాల సమస్యలు, క్యాన్సర్‌.. వంటి దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతూ శృంగార జీవితానికి దూరమవుతున్నారట.

– ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించే మందులు, గర్భనిరోధక మాత్రలు.. వంటివి లైంగికాసక్తిని దెబ్బతీస్తాయి. ఇది కూడా డెడ్‌ బెడ్‌రూమ్‌ రిలేషన్‌షిప్‌కి దారితీస్తుందంటున్నారు నిపుణులు.

– కొన్ని జంటలు కుటుంబ ఒత్తిళ్లతో సంతానం కోసం బలవంతంగా కాపురం చేస్తున్నాయని.. ఇక పిల్లలు పుట్టాకా ఆరోగ్యకరమైన దాంపత్య జీవితాన్ని గడపట్లేదని తమ వద్దకొచ్చిన కొన్ని కేసుల గురించి చెబుతున్నారు నిపుణులు. దీనిని కూడా ఓ తరహా ‘డెడ్‌ బెడ్‌రూమ్‌ రిలేషన్‌షిప్‌’గా పరిగణిస్తున్నారు.

పరిష్కార మార్గాలివీ..
కలిసి ఒకే పడకగదిలో ఉన్నా.. ఒక్కటి కాలేకపోతే మాత్రం ఆలుమగల అన్యోన్యత దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి నెగెటివ్‌ బంధాన్ని దూరం చేసుకొని శృంగార జీవితాన్ని ఆస్వాదించాలంటే జంటలు పలు విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు.

– లైంగికాసక్తిని పెంచుకోవడానికి, ఇతర లైంగిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి నిపుణుల థెరపీ/కౌన్సెలింగ్‌ చాలావరకు ఉపయోగపడతాయి. అందుకే డెడ్‌ బెడ్‌రూమ్‌ రిలేషన్‌షిప్‌లో ఉండే జంటలు ఇలాంటి తరగతులకు హాజరవడం మంచిది.

– వ్యక్తిగతంగా, వృత్తిపరంగా జంటలు ఎంత బిజీగా ఉన్నా.. రాత్రిపూట పడకగదిలో ఏకాంతంగా కాసేపు సమయం గడపాలి. ఈ క్రమంలో ఒకరి మనసులో ఉన్న లైంగిక కోరికలను మరొకరితో నిర్మొహమాటంగా, నిర్భయంగా పంచుకోవాలి. ఇది ఇద్దరి మధ్య అడ్డు తెరల్ని తొలగించడంతో పాటు.. శృంగార కోరికలు పెరిగేలా చేస్తుందంటున్నారు నిపుణులు.

– ఆసక్తి లేదని లైంగిక జీవితాన్ని నిర్లక్ష్యం చేసే భాగస్వామికి.. మీరే మోటివేటర్‌ కావాలని చెబుతున్నారు నిపుణులు. అంటే.. శృంగార జీవితం వల్ల కలిగే ప్రయోజనాల్ని, దీనికి సంబంధించిన ఇతర విషయాల్ని భార్యాభర్తలు ఒకరికొకరు చెప్పుకోవాలి. అప్పుడు ఎదుటివారిలో క్రమంగా మార్పును గమనించచ్చు.

– ఎప్పుడూ ఇల్లు, ఉద్యోగం అని కాకుండా.. వీలు కుదుర్చుకొని వెకేషన్లకు ప్లాన్‌ చేసుకోవడం కూడా మంచిదే. ఈ క్రమంలో రొమాంటిక్‌ ప్రదేశాల్ని ఎంచుకోవడం ముఖ్యం. అలాగే ప్రతిసారీ మీతోపాటు పిల్లల్ని కూడా తీసుకెళ్లాలని కాకుండా.. అప్పుడప్పుడూ మీరిద్దరే ఏకాంతంగా వెళ్లి రండి.. తిరిగొచ్చాక తప్పకుండా మార్పు కనిపిస్తుంది.

– వివిధ లైంగిక సమస్యలు కూడా శృంగార ఆసక్తిని తగ్గిస్తుంటాయి. కాబట్టి నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకుంటే తిరిగి శృంగార జీవితాన్ని ఆస్వాదించచ్చు.

– అలాగే పిల్లలు తమతోపాటు పడుకోవడం వల్ల కూడా కొంతమంది లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేరు. కాబట్టి వారికి ఒక వయసొచ్చాక వేరే గదిలో పడుకునేలా అలవాటు చేయాలి.

వీటితో పాటు ఇద్దరూ కలిసి రొమాంటిక్‌ సినిమాలు చూడడం, వ్యాయామాలు చేయడం, ఇంట్లో పనులు కలిసి పంచుకోవడం.. వంటి వాటి వల్ల కూడా దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. తద్వారా లైంగిక జీవితాన్ని ఆస్వాదించచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular