Homeహెల్త్‌Foods For Brain Health: పిల్లల ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఇవే.. పరీక్షల సీజన్‌లో...

Foods For Brain Health: పిల్లల ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఇవే.. పరీక్షల సీజన్‌లో ఇవి తినిపించండి

Foods For Brain Health: పరీక్షల సీజన్‌ మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. మరో పక్షం రోజుల్లో టెన్త్‌ ఆ తర్వాత మిగతా తరగతులు పరీక్షలు ప్రారంభం అవుతాయి. అయితే పరీక్షల సమయంలో పిల్లలకు ప్రత్యేకమైన ఆహారం తినిపిస్తే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని నూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. అప్పుడే పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తానని పేర్కొంటున్నారు. ఆహారం విషయంలోనూ స్వల్ప మార్పులు చేయాలని సూచిస్తున్నారు. పరీక్షల సమయంలో కొన్ని సూపర్‌ఫుడ్స్ తినిపించాలంటున్నారు. ఆ సూపర్‌ ఫుడ్స్‌ ఏంటో చూద్దాం.

ఆకు కూరలు
పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ B6, B12 సమృద్ధిగా లభిస్తాయి. ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థలో వీటి పాత్ర కీలకం. ఇవి జ్ఞాపకశక్తిని, చురుకుదనాన్ని పెంచుతాయి. బ్రకోలి, పాలకూరలో ఫోలేట్ ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ప్రయోజనాలు పొందేందుకు పిల్లలకు డైట్‌లో ఆకు కూరలను చేర్చాలి.

సిట్రస్ పండ్లు
సిట్రస్‌ పండ్లు మెదడు ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. పిల్లల డైట్‌లో వీటిని చేర్చడం వలన పరీక్షల సమయంలో శరిరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అందుకోసం డైట్‌లో నారింజ, బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష వంటి పండ్లు సిట్రస్ జాతికి చెందినవి చేర్చాలి.

మిల్లెట్స్
మిల్లెట్స్‌ను పిల్లల డైట్‌లో చేర్చడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ప్రిపరేషన్‌ సమర్థవంతంగా సాగుతుంది. అందుకే పిల్లల డైట్‌లో రాగులు, సజ్జలు, కొర్రలు వంటి చిరుధాన్యాలు(మిల్లెట్) చేర్చాలి. వీటిల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లతో కూడిన ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు చిరుధాన్యాలు శక్తిని అందిస్తాయి. చిరుధాన్యాలతో జావా చేసుకోవచ్చు. ఇతర వంటకాల్లో వాటిని జోడించవచ్చు.

బ్రౌన్ రైస్
బ్రౌన్ రైస్‌ను పిల్లల డైట్‌లో చేర్చడం వలన చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇందులో ఫైబర్‌తో కూడిన కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయి. ఎగ్జామ్ సమయంలో ప్రిపరేషన్‌కు అవసరమైన ఏకాగ్రత, శ్రద్ద పెంపొందుతుంది.

గింజలు, విత్తనాలు
అవిసె గింజలు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, వాల్‌నట్స్‌, గుమ్మడి విత్తనాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌తోపాటు విటమిన్‌ ఇ, జింక్‌, ఐరన్‌ వంటి మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అందుకే ఎగ్జామ్స్ సమయంలో నట్స్, సీడ్స్‌ను పిల్లలో డైట్‌లో చేర్చాలి.

కాయ ధాన్యాలు
కాయ ధాన్యాలు శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. వీటిని పిల్లలకు తరచూ స్నాక్స్‌ రూపంలో ఇస్తే ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఫలితంగా ఎగ్జామ్ సమయంలో ప్రిపరేషన్ ఆరోగ్యపరంగా, ఏ ఆటంకం లేకుండా కొనసాగిస్తారు.

చేపలు
చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మెదడు పనితీరుకు చాలా అవసరం. వేగవంతమైన సమాచారం ప్రాసెసింగ్, జ్ఞాపకశక్తి నిలుపుదల, ఏకాగ్రత పెరుగుదలలో ఈ యాసిడ్స్ కీలకపాత్ర పోషిస్తాయి. చేపలతో చేసిన వంటకాలను పరీక్షల సమయంలో ఎక్కువగా అందించాలి.

ఓట్స్
ఓట్స్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి కూడా శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఓట్స్ తింటే, పిల్లలు రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చు.

క్వినోవా
క్వినోవాలో కోలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది న్యూరోట్రాన్స్మిషన్‌, మెంటల్ హెల్త్‌ను మెరుగుపర్చుతుంది. క్వినోవాను వివిధ వంటకాల్లో బియ్యానికి ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు. ఇది స్థిరమైన శక్తిని అందిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular