కరోనా రక్కసితో లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది బాధితులు ఆసుపత్రుల పాలయ్యారు. అయితే డబ్బున్న వారు కోట్ల రూపాయలు వెచ్చించినా కొందరి ప్రాణాలు దక్కలేదు. మరికొందరు ఉన్నదంతా ఊడ్చి మరణం అంచుల వరకు వెళ్లారు. ఈ సమయంలో కొన్ని ఆసుపత్రులు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని అందినకాడికి దండుకున్నాయి. ప్రభుత్వాలు ప్రజల వద్ద నుంచి నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాలని సూచించినా అవేమీ పట్టించుకోకుండా లక్షల్లో ఫీజులు వసూలు చేసి బాధితుల జేబులు గుళ్ల చేశారు.
కరోనా చికిత్సను తెలంగాణ ప్రభుత్వం మొదట్లో కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే చికిత్సకు అనుమతిచ్చినా ఆ తరువాత ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా అవకాశం ఇచ్చింది. అయితే నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. అయినా కొన్ని ఆసుపత్రులు అవేమీ పట్టించుకోకుండా రోగుల వద్ద ఇష్టం వచ్చిన విధంగా ఫీజులు వసూలు చేశాయి. దీంతో కొందరు బాధితులు మీడియా ముందుకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
బాధితుల మొర ఆలకించిన తెలంగాణ ప్రభుత్వం కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులపై చర్యలకు ఆదేశించింది. దీంతో పలు ఆసుపత్రుల అనుమతులు రద్దు చేసింది. మరింత విచారణ చేసి అధిక ఫీజులు వసూలు చేసినట్లని తేలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాకుండా అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులు బాధితులకు తిరిగి తమ మొత్తాన్ని చెల్లించేలా చూస్తామని కూడా తెలిపింది.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు కొన్ని ధరలను నిర్ణయించింది. ఈమేరకు జీవో 40ని జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఒక్క రోజుకు ఐసీయూ గదిలో ఉంటే: 7,500
వెంటిలేటర్ తో కూడిన ఐసీయూ గదిలో రోజుకు రూ.9,000
సాధారణ వార్డుల్లో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు రూ.4,000
హెచ్ఆర్ సిటీ : రూ.1995
డిజిటల్ ఎక్స్ రే : రూ.1300
ఐఎల్6: రూ.1300
డీడైమర్ : రూ.300
సీఆర్పీ రూ: 500
ప్రొకాల్ సీతోసిన్ :రూ.1400
ఫెరిటీన్: రూ.400
ఎల్డీహెచ్: రూ.140
పీపీఈ కిట్ ధర రూ.273 మించరాదు
సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్స్ కు కిలోమీటరుకు రూ.75, కనీసం రూ.2వేలు
ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్స్ కు కిలోమీటరుకు రూ.125. కనీసం రూ.3 వేలు