What Is Love: తప్పు ఒప్పులతో నిమిత్తం లేకుండా ఎదుటి వ్యక్తిని యధాతధంగా అంగీకరించేదే ప్రేమ. వాలెంటైన్ నుంచి రోమియో జూలియట్ వరకు ఎన్నో ప్రేమ గాథలు ప్రేమ స్థాయిని పెంచాయి. త్యాగానికి, అంతులేని నిరతికి ప్రతీకైన ప్రేమ నేడు ఒక అవసరంగా మారిపోయింది. ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే… స్వేచ్ఛగా వదిలేసే ప్రేమే గొప్పదని స్థాయికి చేరింది. నిజంగా ప్రేమంటే కట్టిపడేసే బంధనమా? నిలువెల్లా నిలిచే బంధమా? లోపం ప్రేమలో ఉందా? దాన్ని వ్యక్తపరిచే మనిషి మనసులో ఉందా? ప్రేమ కోసం యుద్ధాలు జరిగే దశ నుంచి.. ప్రేమే ఒక యుద్ధం అనే మనిషి ఎందుకు అనుకుంటున్నాడు? ప్రేమించడం సులభమే.. కానీ దాని నిలబెట్టుకోవడమే ఇప్పుడు ఒక పరీక్ష ఎందుకు అయింది?

ఎందుకు ఇలా
ఒకప్పుడు మనసులో ప్రేమ చిగురించినప్పుడు ఎదుటి వ్యక్తికి వ్యక్తపరచడంలో అనేక బిడియాలు, కుటుంబ కట్టుబాట్లు అడ్డొచ్చేవి. కానీ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత పరిస్థితులు, జీవన విధానంలో ఏర్పడిన మార్పులు, కాళ్ల ముందుకే వచ్చిన అనేక రకాల సౌకర్యాలు మనసులో ఉన్న బిడియాలను, భయాలను పటాపంచలు చేశాయి. ఆర్థిక స్థిరత్వం కూడా ఇందుకు ఒక కారణం. పెద్దరికం కూడా యువతరానికే ఓటు వేస్తుండడంతో పరిస్థితి మారిపోయింది. ప్రేమ అనేది ఇప్పుడు ఒక కనీస అర్హతగా మారిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ఆ ప్రేమ నిలబడే స్థానమే తలకిందులు అవుతోంది. పెళ్లి పీటలు ఎక్కాక అప్పటిదాకా ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. మెజార్టీ జంటలు కలిసివుండి కలహించుకునే దానికంటే.. విడిపోయి సుఖంగా ఉండడమే మంచిదని స్థాయికి వచ్చాయి
స్వేచ్ఛ పెరిగింది
యువతరం ఆకాంక్షలకు తల్లిదండ్రులు ముందే గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో ప్రేమ పేరుతో స్వేచ్ఛ హద్దులు దాటుతున్నది. పెళ్లికి ముందే తనువులు ఏకమవుతున్న వేళ.. మొదట్లో ఉన్న మోహం తర్వాత క్రమేపి కనుమరుగవుతోంది. ఒకప్పుడు భారతీయ సంస్కృతి అన్ని దేశాలకు ఆదర్శమని చెప్పుకునే వేళ.. క్రమేపీ పాశ్చాత్య పోకడలు చొచ్చుకుని వస్తున్నాయి. తల్లిదండ్రులు వారించలేని పరిస్థితి. వారి నిర్ణయానికే తలోగ్గే దుస్థితి. ఇలాంటి సమయంలోనే అనుకోని పరిణామాలు యువతను పెడమార్గం పట్టిస్తున్నాయి. ఇవ్వను వరకు తల్లిదండ్రుల కట్టుబాట్ల మధ్య ఉండాల్సిన వారు స్వేచ్ఛగా విహరిస్తుండటం వల్లే అసలు సమస్యలు తలెత్తుతున్నాయి.

ప్రేమకు పెళ్లి అర్హత
ఇటీవల కేరళలో ఇద్దరు న్యాయవాదులు ప్రేమించుకున్నారు. శారీరకంగా కలుసుకున్నారు. తర్వాత ఆమెపై అతడికి భేదాభిప్రాయాలు తలెత్తడంతో బై బై చెప్పుకున్నారు. ఇదే సమయంలో మరో యువతి పరిచయం కావడంతో అతడు పెళ్లి పీటలెక్కాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి యువతీ కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో అతడు న్యాయస్థానం బోను లో నిలబడాల్సి వచ్చింది. ఆమె ఇష్టపూర్వకంగానే నేను శారీరకంగా కలిశానని, ఇందులో నా తప్పు ఏముందని అతను వాదించాడు. దీంతో కోర్టు కూడా ఏకీభవించి అతడికి బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు పరస్పర ఇష్టపూర్వకంగా శారీరకంగా కలిస్తే తప్పులేదని, అది అత్యాచారం కిందికి రాదని కోర్టు తేల్చి చెప్పింది. ఇలా ప్రేమలో ఉన్నప్పుడే అన్ని చూస్తుండడంతో పెళ్లి చేసుకున్నాక ఏముంటుందిలే అనే విరోధమైన ఆలోచన యువతను ఇతర దారుల్లోకి మళ్ళిస్తోంది. దీనివల్లే ప్రేమ అనేది ఒక శారీరక అవసరం అని యువత అనుకుంటున్నది. ప్రేమించేటప్పుడు శారీరకంగా కలుస్తాం. తర్వాత విడిపోతే ఏం చేస్తారు? అని ఓ మీడియా సంస్థ కొంత మందిని అడిగితే “ఏముంది అనుభవం మిగులుతుంది” అని యువత చెప్పడం వారిలో పెరిగిపోయిన మితిమీరిన స్వేచ్ఛకు నిదర్శనం.
కెరీర్ కు ప్రతిబంధకం
ప్రపంచీకరణ తర్వాత అవకాశాలు పెరిగాయి. అక్షరాస్యత అంతకంతకు పెరుగుతుండడంతో యువతీ యువకులు అని రంగాల్లో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ఐదు అంకెల జీతం తీసుకుంటే ఓహో అనుకునే రోజుల నుంచి ఇప్పుడు ఆరంకెల జీతాన్ని కూడా లైట్ తీసుకునే పరిస్థితులు వచ్చాయి. శ్రీమంతులు మాత్రమే వెళ్ళగలిగే అమెరికాకు సామాన్యుల సైతం పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల ముఖ్యంగా యువతరానికి విస్తృతమైన ఆర్థిక స్థిరత్వం లభిస్తుండడంతో సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చారు. ఇదే సమయంలో జీవితాన్ని ఎదుటి వాళ్ళతో పోల్చి చూడడం మనిషికి ఎక్కువైపోయింది. దీంతో తమలో ఉన్న సానుకూలతలను పక్కనపెట్టి, లోపాలను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. పైగా పెరిగిపోతున్న ఆత్మన్యూనత, పని ఒత్తిడి, చిరాకు, టార్గెట్లు.. వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి. దానివల్ల ఎదుటి వ్యక్తిపై ప్రేమను ప్రదర్శించాల్సిన చోట కోపాన్ని వ్యక్తపరుస్తుండడంతో ప్రేమ బీటలు వారుతోంది. పైగా అపరిమితమైన స్వేచ్ఛ కూడా మనిషిని మరో లోకంలోకి తీసుకెళ్తోంది. దీనివల్ల ఒకప్పుడు ఉన్న ప్రేమ తగ్గిపోయి కొత్తదారులు వెతుక్కునే పరిస్థితికి తీసుకొస్తోంది. ఫలితంగా ప్రేమ అనేది ఇనిస్టెంట్ అవసరంలా మారిపోయింది. ఇది కేవలం యువతరం మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు.. పది పదిహేనేళ్ళు కాపురం చేసిన వాళ్లది కూడా. అప్పటి దాకా నీతో ఉన్న వారి కుటుంబంలో ఈజీగానే బై బై అనే పదం చేరుపోతోంది.
Also Read:Milky Sea: శాటిలైట్ చిత్రాల్లో సంచలనం.. భూమిపై కంటపడ్డ పాలసముద్రం