Thati Munjalu: ప్రకృతి మనకు ఎంతో చేస్తోంది. ఎన్నో ఆరోగ్యవంతమైన చెట్లు, పండ్లు, ఆకులను ఇస్తుంది. అయితే వాటిని గుర్తించడంలోనే మనిషి విఫలమవుతున్నాడు. అందుబాటులో ఉన్నవానిని సద్వినియోగం చేసుకోలేక.. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన వేల రూపాయలు ఆస్పత్రికి ఖర్చు పెడుతున్నారు. ఉచితంగా, సహజంగా అందే వాటిని దూరం పెడుతన్నారు. అయితే వైద్యులు కూడా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలని సూచిస్తుంటారు. కానీ, వాటిని పెద్దగా పట్టించుకోకుండా జంక్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ రెడీమేడ్ ఫుడ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
తాటి ముంజలు దొరకవా..
ఇక ప్రస్తుతం తాటి ముంజల సీజన్. పది ఇరవై ఏళ్ల క్రితం వరకు తాటి ముంజలు మార్కెట్‌లో విరివిగా లభించేవి. ఇక ఊళ్లకు వెళితే.. గౌడన్నలు ఫ్రీగా కోసి ఇచ్చేవారు. చెట్టు మీది తాటి ముంజలు తింటే వచ్చే టేస్టే వేరు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే తాటి ముంజలు కూడా రానురాను దొరకవేమో అనిపిస్తోంది.
కోసేవారు లేక..
గ్రామాల్లో గీత కార్మికులు తగ్గిపోతున్నారు. గౌడ కుటుంబాలు ఉన్నా తాటి చెట్లు ఎక్కేవారు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ఊళ్లో ప్రతీ గౌడ కుటుంబంలో ఒకరిద్దరు గీత కార్మికులు ఉండేవారు. ఇప్పుడు ఊరికి కూడా ఇద్దరు ముగ్గురు మించి ఉండడం లేదు. దీంతో కల్లు గీసేవారు, తాటి ముంజలు కోసేవారు తగ్గిపోతున్నారు. సీజనల్‌గా తాటి ముంజలు అమ్మేవారు ఇబ్బంది పడుతన్నారు.
పెరుగుతున్న ధర..
తాటి ముంజలు కోసేవారు తగ్గిపోవడంతో తాటి ముంజల ధర కూడా పెరుగుతోంది. ఊళ్లో ఉండే ఇద్దరు ముగ్గురు గీత కార్మికులు తాటి చెట్టు ఎక్కి ముంజలు కోసి ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు. ఒకప్పటిలా ఫ్రీగా కోసి ఇవ్వడం లేదు. దీంతో వాటిని మార్కెట్‌కు, ఊళ్లకు తీసుకువచ్చి అమ్మేవారు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఒకప్పుడు రూపాయి, రెండు రూపాయలు ఉన్న ముంజలు ఇప్పుడు పది రూపాయలకుపైగా పలుకుతోంది.
ముంజలు తీయడం ఇబ్బందే..
ఇక గీత కార్మికులు తాటికాయలు మాత్రమే కోసి ఇస్తున్నారు. ముంజలు తీయడం లేదు. దీంతో వాటిని అమ్మేవారే అమ్మే స్థలంలోనే కోసి ఇస్తున్నారు. గీత కార్మికులు నేర్పరితో కోయడం వలస సులభంగా ముంజలు తీస్తారు. కానీ మహిళలు ఒక కాయ కోడానికి ఐదు నిమిషాలు పడుతుంది. దీంతో కొనేవారు వేచి ఉండలేక వెళ్లిపోతున్నారు. నాణ్యత కూడా దెబ్బతింటోంది.
ఇక ఆన్‌లైన్‌లో కొనాల్సిందే..
పరిస్థితి చూస్తుంటే రాబోయే రెండు మూడు ఏళ్లలోనే తాటి ముంజలను కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఈ కామర్స్ కంపెనీలు ఇప్పటికే మామిడి ఆకులు, కొబ్బరి బోండాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. కొద్ది రోజుల్లో తాటి ముంజలు కూడా ఆన్‌లైన్‌లో దర్శనమివ్వడం ఖాయం. ప్రజలకు కొనే ప్రతీ వస్తువును ఈకామర్స్ సంస్థలు బిజినెస్‌గా మార్చుకుంటున్నాయి.