ఈ మధ్య కాలంలో ప్రపంచంలో కొన్ని వింతైన, ఆశ్చర్యకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వినడానికి నమ్మశక్యం కాకపోయినా ఆ ఘటనలకు ఆధారాలు ఉండటంతో ఆ వార్తలను నమ్మాల్సి వస్తోంది. ఒక ఘటనలో మహిళ మెదడులో చిన్న సైజు గుడ్లు ఉండటంతో షాక్ అవ్వడం వైద్యుల వంతయింది. అమెరికాలో ఒక మహిళకు చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన 25 ఏళ్ల మహిళ గడిచిన కొన్ని సంవత్సరాలుగా భరించలేని తలనొప్పితో బాధ పడుతోంది. తలనొప్పిని తగ్గించుకోవడం కోసం ఆ మహిళ ఎన్నో మందులను వాడింది. ఎన్ని మందులు వాడినా తలనొప్పి తగ్గలేదు సరికదా అంతకంతకూ పెరిగింది. కొందరు వైద్యులు ఆ మహిళ మైగ్రేన్ తో బాధ పడుతూ ఉండవచ్చని భావించారు. కొన్ని రోజుల క్రితం తలనొప్పి మరింత ఎక్కువ కావడంతో ఆమె వైద్యులను సంప్రదించింది.
ఆ మహిళ ఆరోగ్య సమస్య అర్థం కాని వైద్యులు ఎం.ఆర్.ఐ చేసి ఆ మహిళ మెదడులో కణితి ఉందని ఆ కణితి వల్లే ఆ మహిళ బాధ పడుతోందని గుర్తించారు. ఆపరేషన్ చేసి మహిళ మెదడులో కణతి తొలగిద్దామని భావించిన వైద్యులకు ఆపరేషన్ సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ మహిళ మెదడులో టేప్ వార్మ్ గుడ్లు ఉన్నాయని వైద్యులు గుర్తించి మెదడులోని ఆ గుడ్లను తొలగించారు.
నాడీ వ్యవస్థలో పరాన్నజీవులు ఇలా జరగడానికి కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎవరైతే ఉడికీఉడకని మాంసం తింటారో అలాంటి వాళ్లు ఎక్కువగా ఈ సమస్య బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే పచ్చి మాంసం తింటాతో వారి మెదడులో ఇలాంటి గుడ్లు చేరే అవకాశం ఉంటుందని.. పూర్తిగా ఉడికిన మాంసం మాత్రమే తినాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.