Walking: నడకతో జబ్బు.. అర్థం కాలేదా? అయితే ఇది కచ్చితంగా చదవాల్సిందే..

వయసును బట్టి కండర మోతాదు, బలం, నాణ్యత తగ్గుతూ వస్తుంటాయి. దీన్నే సార్కోపీనియా అంటారు. ఇది నలభయ్యో పడిలో మొదలవుతుంది. మరోవైపు నాడీ వ్యవస్థ కూడా క్షీణిస్తూ వస్తుంటుంది. శరీరం మొత్తమంతా విస్తరించి ఉన్న నాడుల సామర్థ్యం, నాడీ కణాల సంఖ్య తగ్గుతుంటాయి.

Written By: Swathi, Updated On : August 6, 2024 4:08 pm

Walking

Follow us on

Walking: నడవడం కొంత సమయం వరకు మామూలే. కానీ అందరికీ కాదు. కొంత వయసు వచ్చిన తర్వాత నడవడం మరింత సమస్యగా మారుతుంది. కాళ్లు, చేతులు, కడుపు, వీపు, కంటి భాగంలోని కండరాలు మెదడు మధ్య ప్రసారమయ్యే సంకేతాలు ఇందులో పాలు పంచుకుంటాయి. సాఫీగా నడవటం, నడక వేగం మన ఆరోగ్యాన్ని పట్టి చూపుతాయి. వృద్ధాప్యం ముంచుకొస్తున్న తీరునూ వివరిస్తాయి.

ఆరోగ్య రహస్యం జాగ్రత్త అవసరం
వృద్ధాప్యం ముంచుకొస్తున్నకొద్దీ నడకలో మార్పులు సహజమే. అరవై ఏళ్లు వచ్చేసరికి నడకలో చాలా వరకు మార్పు వస్తుంది. పూర్తిగా నడక విధానమే మారుతుంది. అయితే అదేపనిగా ముందుకు పడిపోవటం, తూలటం వంటి లక్షణాలు ఉంటే మీరు జాగ్రత్త పడాల్సిందే. ఇటీవలి కాలంలో నడవటం కష్టంగా అనిపిస్తున్నా తాత్సారం చేయరాదు. డాక్టర్‌ను సంప్రదించి కారణమేంటో గుర్తిస్తే, తగు చికిత్సతో కుదురుకోవచ్చు.

వయసును బట్టి కండర మోతాదు, బలం, నాణ్యత తగ్గుతూ వస్తుంటాయి. దీన్నే సార్కోపీనియా అంటారు. ఇది నలభయ్యో పడిలో మొదలవుతుంది. మరోవైపు నాడీ వ్యవస్థ కూడా క్షీణిస్తూ వస్తుంటుంది. శరీరం మొత్తమంతా విస్తరించి ఉన్న నాడుల సామర్థ్యం, నాడీ కణాల సంఖ్య తగ్గుతుంటాయి. 20-60 ఏళ్ల మధ్యలో ఏటా 0.1% చొప్పున నాడీకణాలు తగ్గుతాయని అంచనా. అరవై ఏళ్లు దాటాక వీటి క్షీణత వేగం మరింత పెరుగుతుంది. ఎవరైనా 90 ఏళ్ల వరకూ బతికారనుకోండి. వీరిలో 50 ఏళ్ల వయసుతో పోలిస్తే 90 ఏళ్ల వయసులో మెదడు కణజాలం బరువు 150 గ్రాముల తక్కువ ఉంటుంది అంటున్నారు నిపుణులు. అందుకే నడకను శారీరక, మానసిక ఆరోగ్యానికి సూచికగా భావిస్తుంటారు. ఈ విషయం అధ్యయనాల్లోనూ బయటపడింది.

కాలు ముందు భాగం మోకాలు నుంచి మడమ వరకు ఉన్న కండరాలు పాదాన్ని పైకి లాగుతాయి. దీని మూలంగానే మనం ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు పాదం పైకి లేస్తుంది. కానీ కొందరిలో పాదం ముందుకు వంగిపోతుంటుంది (ఫుట్‌ డ్రాప్‌). దీంతో వేళ్లు నేలకు తాకి, కింద పడుతుంటారు. మధుమేహం మూలంగా నాడులు దెబ్బతిన్నవారిలో దీన్ని చూస్తుంటాం. కాలు మీద కాలు వేసి కూర్చోవటం వంటివి లేదా యోగాసనాలు వేయటం కూడా కారణమే.

రక్తనాళాలు కుంచించటంతో: నడుస్తున్నప్పుడు పిరుదు కండరాల్లో నొప్పి వస్తుంది., అది కాలి వెనక నుంచి కిందికి కూడా వస్తుంటుంది. పిక్క వరకు నొప్పి విస్తరించవచ్చు. నడవడం ఆపేస్తే నొప్పీ తగ్గుతుంది. దీనికి మూలం కాళ్లలో రక్తనాళాల లోపలి మార్గం సన్నబడటం. నడిచినప్పుడు నొప్పి పుట్టటం లేదా ఆగినప్పుడు నొప్పి తగ్గటాన్ని క్లాడికేషన్‌ అంటారు.

రక్తనాళాల లోపలి మార్గం కుంచించుకుపోతే కాళ్లకు రక్త సరఫరా సరిగ్గా జరగదు. నడుస్తున్నప్పుడు కాలి కండరాలకు ఎక్కువ ఆక్సిజన్‌ కావాలి. తగినంత రక్తం సరఫరా కాకపోతే ఆక్సిజన్‌ అంతగా అందదు. కండరాల్లో ఆక్సిజన్‌ లేకపోవటంతో లాక్టిక్‌ ఆమ్లం విడుదలవుతుంది. ఇది కండరాలు పట్టేసిన భావన కలిగిస్తుంది. నడక ఆపేసినప్పుడు కండరాలకు అంత ఆక్సిజన్‌ అవసరముండదు కాబట్టి నొప్పీ తగ్గుతుంది.

విటమిన్ల లోపంతో: విటమిన్‌ బి12 లోపంతోనూ నడుస్తున్నప్పుడు తడబడొచ్చు. పెద్దవారిలో బి12 లోపం లక్షణాలు తెలియాలంటే కొన్ని నెలలు, సంవత్సరాల సమయం పడుతుంది. కానీ నాడీ వ్యవస్థ పరిపక్వ మవుతున్న పిల్లల్లో తక్కువ కాలంలోనే కనిపించొచ్చు. మంచి విషయం ఏంటంటే- దీని లోపాన్ని సరిచేసుకోవటం తేలికే. మాత్రలు, అవసరమైతే ఇంజెక్షన్ లతో భర్తీ చేసుకోవచ్చు.

లోపలి చెవి ఇన్‌ఫెక్షన్ల్: లేబీరైనైటిస్‌ వంటి లోపలి చెవి సమస్యలూ తాత్కాలికంగా నడక తీరును మార్చే అవకాశం ఉంది అంటున్నారు. తూలిపోయేలా చేయొచ్చు. ఇవి చాలావరకూ వాటంతటవే తగ్గుతాయి. చెవిలోని ద్రవం నుంచి అందే సంకేతాలతోనే మెదడు మనం నిల్చున్నా మా, కూర్చున్నామా అనే విషయాన్ని నిర్ణయించుకుంటుంది. అప్పుడు చెవి నుంచి అందే సంకేతాలను పోల్చుకోవటంలో మెదడు తికమక పడుతుంది. కళ్లకు కనిపించే దృశ్యానికి, చెవి నుంచి అందే సంకేతాలకు పొంతన కుదరకపోవడం వల్ల తూలిపోయే ప్రమాదముంది.