
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే మాటను మనం తరచూ వింటూ ఉంటాం. అప్పుడప్పుడూ మద్యం తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం లేకపోయినా తరచూ మద్యం తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మరీ ఎక్కువగా మద్యం తాగితే మాత్రం ప్రాణాలే పోతాయని తాజాగా జరిగిన ఒక ఘటన ప్రూవ్ చేస్తోంది. తరచూ ఏదో ఒక కారణంతో మద్యం సేవించేవాళ్లు వీలైనంత తక్కువగా మద్యం తీసుకుంటే మంచిది.
రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ జిల్లాలో ఐదుగురు స్నేహితులు మృతి చెందారు. అయితే మృతి చెందడానికి గల కారణాల గురించి వాళ్ల కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించగా వాళ్లు అతిగా మద్యం తాగడం వల్లే కుటుంబ సభ్యులు చనిపోయినట్టు చెప్పారు. దీంతో షాక్ అవ్వడం పోలీసుల వంతయింది. మోతాదుకు మించి మద్యం సేవిస్తే ఎంత ప్రమాదమో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది.
మద్యం తాగి చనిపోయిన వాళ్లలో నలుగురి మృతదేహాలను వాళ్ల కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఖననం చేశారు. దీంతో పోలీసులు చనిపోయిన ఐదో వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. అతని పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే నిజంగానే ఐదుగురు మద్యం తాగడం వల్ల చనిపోయారా..? లేక ఇతర కారణాల వల్ల చనిపోయారా..? అనే ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కువగా మద్యం తాగితే కాలేయంతో పాటు ఇతర శరీర అవయవాలు దెబ్బ తినే అవకాశం ఉంది. అందువల్ల మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.