Journalist Mahender : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలతోపాటు వ్యాధులు ముసురుకుంటున్నాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా వైరల్ ఫీవర్లు నమోదవుతున్నాయి. డెంగీ, చికున్‌గన్యా, టైఫాయిడ్, మలేరియా లాంటి కేసులు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇదే సమయంలో జ్వరంతో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ప్రతీ జిల్లాలో కనీసం రెండు మూడు మరణాలు చోటుచేసుకున్నాయి.. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. జ్వరబాధితులను గుర్తించి చికిత్స చేస్తోంది. అత్యవసరమైన వారిని ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు వైద్య సిబ్బంది. ఇలా జ్వరాల కట్టడికి ఒకవైపు చర్యలు తీసుకుంటుండగా, కొన్ని జ్వరాలు అకస్మాత్తుగా కబళిస్తున్నాయి. మంచం పట్టేలా చేస్తున్నాయి. డెంగీ, చికున్ గన్యాతో మరణాలు సంభవించడమే కాకుండా వైరల్ ఫీవర్లు కూడా ప్రాణాపాయ స్థితికి చేరుస్తున్నాయి. తాజాగా ఓ జర్నలిస్టు వైరల్ ఫీవర్ బారిన పడి మంచం పట్టాడు. ప్రాణాపాయ స్థితికి చేరాడు. వైరల్ ఇన్‌ఫెక్షన్ రక్తంలోకి చేరి కదలలేని పరిస్థితి నెలకొంది. సాదా సీదా జర్నలిస్టుగా జీవనం సాగిస్తున్న ఆయన ఆర్థిక పరిస్థితి కూడా అంతంతే. అతన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని జర్నలిస్టు సంఘాల నేతలు కోరుతున్నారు.
సాక్షి రిపోర్టర్..
కరీంనగర్ జిల్లాలో సాక్షి దిన పత్రికలో స్పోర్ట్స్ రిపోర్టర్‌గా పనిచేస్తున మహేందర్.. దీనావస్థ తెలుసుకుని అందరూ చలించిపోతున్నారు. అత్యంత దయనీయమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న మహేందర్ వైరల్ ఫీవర్‌బారిన పడగా, వైరల్ ఇన్‌ఫెక్షన్ రక్తంలోకి చేరడంతో అతని అరికాళ్లు, చేతులు పనిచేయకుండా పోయాయి. మహేందర్ సాధారణ పరిస్థితికి రావాలంటే రోజుకు రూ.2 లక్షల విలువ చేసే ఆరు ఇంజక్షన్లు ఏడు వారాలు ఇవ్వాలని వైద్యులు తెలిపారు. అంటే రోజుకు రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. ఇతర వైద్య పరీక్షలు, చికిత్స కోసం మొత్తం కలిసి రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. సగటు జీవితం గడుపుతున్న మహేందర్ కుటుంబానికి అంత ఖరీదైన చికిత్స చేయించే పరిస్థితి లేదు. దీంతో మహేందర్‌ను ఆదుకునేందుకు జర్నలిస్టు సంఘాలు విరాళాలు సేకరిస్తున్నాయి.
ముందుకు వస్తున్న సహచరులు..
మహేందర్ ప్రాణాలు కాపాడేందుకు క్రీడాకారులు, జర్నలిస్తు మిత్రులు, ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. తమవంతుగా ఆర్థికసాయం అందిస్తున్నారు. ఇదే సమయంలో జర్నలిస్టులు ఫండ్ రైసింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహేందర్ కోసం 8688117162 నంబర్‌కు ఫోన్‌పే లేదా గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించాలని కోరుతున్నారు. సోషల్ మీడియాతోపాటు, రాజకీయ నాయకులు, ప్రజాప్రనిధులను కలిసి విన్నవిస్తున్నారు. దీంతో చాలా మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అయితే వీలైనంత త్వరగా ఆర్థికసాయం అందితే మహేందర్‌కు త్వరగా వైద్యం అందితే కోలుకునే అవకాశం ఉంటుంది.