Plastic Effects: ఉదయం తాగే టీ, తినే టిఫిన్, తెచ్చుకునే సరుకులు, నిల్వ ఉంచుకునే పచ్చళ్ళు.. ఇలా ప్రతిదాంట్లో ప్లాస్టిక్ అనేది మారింది. పాలిథిన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా దాని నుంచి వచ్చే వ్యర్ధాలు మనిషి శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అవి అతడి మనుగడను ప్రమాదంలో పడేస్తున్నాయి.. ఇవాళ జాతీయ పౌష్టికాహార సంస్థ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేయగా.. దారుణమైన విషయాలు వెలుగు చూశాయి.
ప్లాస్టిక్ వినియోగం.. మన శరీరంలోని హార్మోన్లపై దుష్ప్రభావం చూపిస్తోంది. రకరకాల అనారోగ్యాలకు కారణమవుతోంది. ప్లాస్టిక్ లో ఉండే బిస్ఫెనాల్ _ఏ(బీపీఏ) అనే రసాయనం పురుషులను నిర్వీర్యం చేస్తోంది. అంతేకాదు అమ్మ కడుపులో ఉన్న మగ పిల్లలపై ఆ రసాయనం తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ రసాయనం వల్ల మగవారిలో సంతాన సామర్థ్యం తగ్గుతోందని తేలింది. మనం నిత్యం ఉపయోగించే ఆహార నిల్వ డబ్బాలు, కూల్ డ్రింక్స్, మొదలైన ప్లాస్టిక్ వస్తువుల్లో బిపిఏ రసాయనం అధికంగా ఉంటుంది. అది మన శరీరంలోని అత్యంత కీలకమైన హార్మోన్ వ్యవస్థను దెబ్బతీసే ఎండోక్రైన్ విధ్వంసకారిగా పనిచేస్తుంది. గర్భిణీలు ఈ బిపిఏ రసాయనానికి ఎక్కువగా గురైతే వారి గర్భంలో ఉండే మగ శిశువుల వృషణాలపై అది తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ఆ మగ శిశువుల వృషణాల్లో అవసరమైన మేర వీర్య ఉత్పాదన జరగకపోవచ్చని, వీర్యం సాంద్రత కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ పౌష్టికాహార సంస్థ శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఒక వర్గం ఎలుకలకు బిపిఏ రసాయనంతో కూడిన పదార్థాలను నాలుగు నుంచి 21 రోజులపాటు అందించారు. వాటికి ఎటువంటి రసాయనాలు లేని పదార్థాలు అందించారు. రసాయనం అందించిన మగ ఎలుకల్లో వీర్య ఉత్పాదకత, వీర్య పరిరక్షణలో కీలకమైన కొన్ని ఫాటీ యాసిడ్స్ లోపించినట్టు గుర్తించారు. కాబట్టి గర్భిణులు ఈ రసాయనానికి దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు అంటున్నారు.” నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం పెరిగింది. కాబట్టి వీటి వాడకాన్ని తగ్గించడమే మంచిది. వాడకం తగ్గించని పక్షంలో పర్యవసనాలను తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది” అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.