Nita Amban
Nita Ambani: ఓ నీతా అంబానీ ఎక్కడికి వెళ్లినా హంగూ ఆర్భాటం ఉంటుంది. సావిత్రి జిందాల్ ఎక్కడ అడుగుపెట్టినా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. కిరణ్ మజుందార్ షా ఏ ప్రాంతానికి వెళ్లినా హడావిడి ఉంటుంది. వీరంతా పేరు మోసిన మహిళా వ్యాపారవేత్తలు. వేల కోట్లకు అధిపతులు. వేల మందికి ఉపాధి కల్పిస్తున్న శ్రీమంతులు. దేశం ఉన్నతికి కారణమవుతున్న కార్పొరేట్లు.. ఇలాంటి కోవకే చెందిన ఓ మహిళ సాధారణంగా ఉండటం సాధ్యమేనా? నేల మీద కూర్చొని కట్టెల పొయ్యి మీద వంట వండడం అయ్యే పనేనా? కానీ ఇవన్నీ ఆమె చేసింది.. పొంగలి వండి ఆమెలో అమ్మతనాన్ని పదిమందికి చూపించింది.
అమ్మ ఉన్నచోట ఆకలి ఉండదు.. అది సుధా మూర్తికి బాగా తెలుసు. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి భార్యగా, పేరుపొందిన రచయితగా, మోటివేషనల్ స్పీకర్ గా, టీచర్ గా, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా.. ఇలా సుధా మూర్తి గురించి చెప్పాలంటే ఎన్నో ఉపోద్ఘాతాలు వాడొచ్చు. కానీ ఎన్ని వేల కోట్లు ఉన్నా ఆమెకు దర్పం వంటబట్టలేదు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చిన ఆమెలో కించిత్ కూడా టెంపరితనం అలవడలేదు. వాస్తవానికి ఆమె ఒక కార్పొరేట్ కంపెనీకి వెన్నెముకలా కాకుండా.. అమ్మగా ఉండేందుకు ఇష్టపడుతుంది. ఆకలి గొన్న పేగులకు గోరుముద్దవుతుంది. ఎవరో ఏదో అనుకుంటారని సెక్యులర్ ముద్రల కోసం అస్సలు తాపత్రయ తాపత్రయపడదు. సమాజానికి ఏది మంచిదని భావిస్తుందో అదే చెబుతుంది. కృత్రిమత్వాన్ని కోరుకోదు. 35 వేల కోట్ల ఆస్తులున్నప్పటికీ ఒక మధ్య తరగతి మహిళగానే నిరాడంబరంగా ఉంటుంది. ఆ మధ్య కేరళ వెళ్ళింది. అట్టుకల్ భగవతీదేవి ఉత్సవాల్లో పాల్గొన్నది. ఇలా వచ్చేందుకు కూడా ఒక నేపథ్యం ఉంది.
2019లో కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరఫున సహాయ చర్యలు చేపట్టారు. వాటిని పర్యవేక్షించేందుకు అప్పుడు ఆమె అక్కడికి వెళ్ళింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసింది. అప్పుడే ఆమె ఈ పొంగల ఉత్సవం గురించి విన్నది. ఒక్కసారైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకున్నది. వరద సహాయ చర్యల్లో బిజీగా ఉండటంతో అప్పుడు పాల్గొనలేదు. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి రావడంతో వీలు కాలేదు. ఇప్పుడు తీరికగా వచ్చింది. పండుగలో పాల్గొన్నది..
అప్పుడు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నప్పుడే తన పర్సనల్ సెక్రెటరీ గోప కుమార్ కు చెప్పింది. పరిస్థితులు ఎప్పుడు చక్కబడితే అప్పుడు తనకు చెప్పాలని వివరించింది. ఆమెది కూడా కేరళ కావడంతో చకచకా ఏర్పాట్లు చేసి, సుధా మూర్తిని తీసుకెళ్లింది. అంతర్జాతీయ మహిళా ఉత్సవానికి ముందు రోజు సుధా మూర్తి ఆ ఉత్సవాల్లో పాల్గొన్నది. వేలమంది ఈ ఉత్సవంలో పాల్గొంటారు. విశేషం ఏముంది అంటారా? ఒక సాధారణ మహిళలా ఆ పొగలు, ఆ కట్టెల పొయ్యిల మధ్య స్వయంగా పొంగల వండింది. ఎర్ర బియ్యం, నెయ్యి, బెల్లం, కొబ్బరి, ఎండు ఫలాల మిశ్రమంతో ఆమె పొంగల వండింది. అమ్మవారికి నైవేద్యం పెట్టింది. దానిని తన కొడుకు రోహన్, కోడలు అపర్ణ కోసం తీసుకెళ్లింది. నారాయణమూర్తి విదేశాల్లో ఉన్నాడు కాబట్టి ఇవ్వడం కుదరదని నవ్వుతూ చెప్పింది.
ఒక రచయిత్రిగా అట్టుకల్ పొంగల గురించి రాస్తానని, సందర్భం వచ్చినప్పుడు దాని గురించి తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తానని సుధా మూర్తి చెప్పింది. ఈ ఉత్సవంలో కుల భేదాలు, ఆస్తుల తేడాలని పట్టించుకోకుండా అందరూ కలిసి పండగ జరుపుకోవడం నచ్చిందని చెప్పిందామె. స్వయంగా పొంగల వండటం, అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఆనందంగా ఉందని చెప్పిందామే. నారి శక్తికి ప్రతిబింబం ఇదని అంటుందామే.. డౌన్ ఎర్త్ అని నిరూపించుకుందామే.