Chicken Skin: మనలో ఎంతోమందికి రోజూ ముక్క లేనిది ముద్ద దిగదు. పైగా పౌల్ట్రీ ఫామ్ లు ఎక్కువైపోవడంతో చికెన్ కూడా విరివిగానే లభిస్తోంది. ఇక పండుగలు, పబ్బాలయితే చెప్పాల్సిన పనిలేదు. పార్టీల్లో చికెన్ లెగ్ పీసులు, లాలీ పాప్ లు, చికెన్ ఫ్రై లు కడుపులో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఇదంతా పక్కన పెడితే చికెన్ తినే విషయంలో ఇప్పటికీ చాలామందికి అపోహలు ఉన్నాయి. ఇంతకీ చికెన్ స్కిన్ తో తింటే లాభమేనా? లేకుంటే నష్టమా? కొందరు డాక్టర్లేమో చికెన్ స్కిన్ తో తినకూడదని చెబుతారు. కొందరు న్యూట్రిషన్లైతే చికెన్ ను స్కిన్ తో తినొచ్చు అని చెబుతారు. ఇన్ని శష భిష ల మధ్య చాలా మంది స్కిన్ లేకుండానే చికెన్ తీసుకెళ్తారు.
– ఇంతకీ స్కిన్ వల్ల ఏంటి ఉపయోగాలు
అమెరికాలో చికెన్ లెగ్ పీస్ లు తినడానికి అక్కడి ప్రజలు ఇష్టపడరు. కేవలం బ్రెస్ట్ భాగాన్ని మాత్రమే తినడానికి ఇష్టపడుతుంటారు. మన దగ్గర కూడా చాలామంది చికెన్ స్కిన్ ను ఇష్టపడరు. చికెన్ స్కిన్ లో ఫ్యాట్ ఉంటుందని, పైగా కోళ్ల వృద్ధి కోసం వాడే ఇంజక్షన్ల అవశేషాలు మొత్తం అందులో ఉంటాయనే కారణంతో తినడానికి ఇష్టపడరు. కానీ బ్రిటన్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. చికెన్ స్కిన్ లో కొవ్వు నిల్వ ఉంటుందన్న విషయం వాస్తవమే, అందులో అసంతృప్త కొవ్వులు ఉంటాయని చెప్తున్నారు. చికెన్ స్కిన్ లో 32 శాతం కొవ్వు ఉంటుంది. అంటే 100 గ్రాముల చికెన్ తీసుకుంటే అందులో 32 గ్రాములు కొవ్వు ఉంటుందని అర్థం. చికెన్ స్కిన్ లో 32 శాతంగా ఉన్న కొవ్వులో మూడింట రెండు వంతులు అసంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటినే వైద్య పరిభాషలో అన్ శాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. ఇది రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది. ఇక ఇందులో మూడో వంతు సంతృప్త కొవ్వు ఉంటుంది. దీనినే వైద్య పరిభాషలో శాచ్యురేటెడ్ ఫ్యాట్ అంటారు లేదా చెడు కొవ్వు అని పిలుస్తుంటారు. ఇది శరీరంలో చెడు కొవ్వుల స్థాయిని పెరిగేలా చేస్తుంది.
Also Read: Chiranjeevi Arrival Benit for Pawan Kalyan: చిరంజీవి రాక పవన్ కళ్యాణ్‌కి లాభమా..? నష్టమా…?
స్కిన్ తో తింటే..
చికెన్ స్కిన్ తో తింటే శరీరంలో 50 శాతం కేలరీలు పెంచుకున్నట్టే అని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. ఉదాహరణకు 170 గ్రాముల స్కిన్ లెస్ చికెన్ తింటే 284 కేలరీలు శరీరానికి లభిస్తాయి. ఈ కేలరీలు 80 శాతం ప్రోటీన్ ల నుంచి, మిగతా 20 శాతం కొవ్వుల నుంచి అందుతాయి. ఒకవేళ అదే మాంసాన్ని స్కిన్ తో కలిపి తీసుకుంటే శరీరానికి 386 కేలరీలు లభిస్తాయి. ఇందులో 50 శాతం ప్రోటీన్ల నుంచి, మిగతా 50 శాతం కొవ్వుల నుంచి లభిస్తాయి. ఒకవేళ అదనపు క్యాలరీలు వద్దనుకుంటే చికెన్ స్కిన్ తో పాటు వండి తినేటప్పుడు తీసివేస్తే బాగుంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎత్తుకు తగ్గ బరువు ఉన్నవాళ్లు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాళ్లు చికెన్ స్కిన్ తో పాటు ఉంచి వండిన తర్వాత తినేటప్పుడు స్కిన్ తీసి వేస్తే అదనపు కేలరీలు చేరవు. స్కిన్ తో పాటు వండటం వల్ల వరకు రుచి వస్తుంది. మరోవైపు చాలామంది చికెన్ ను తెచ్చాక ఫ్రిజ్లో పెడతారు. ఇలా చేయడం వల్ల చికెన్ పై సూక్ష్మజీవుల పెరుగుదల నిలిచిపోతుంది. కానీ ఏవైనా కారణాలవల్ల బయటకు తీసి మళ్లీ ఆ పచ్చి చికెన్ ను ఫ్రిజ్లో పెట్టకూడదు. ఎందుకంటే గది ఉష్ణోగ్రత వద్ద సూక్ష్మజీవులు మళ్లీ పునరుజ్జీవం పొంది హానికారక పదార్థాలను విడుదల చేస్తాయి. దీనివల్ల ఆ చికెన్ తింటే అనారోగ్యం పాలు కాక తప్పదు.
వండేప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి
చికెన్ వండిన తర్వాత మిగిలిన కూరని ఫ్రిజ్లో పెట్టడం సాధారణం. మరుసటి రోజు ఆ కూరను అలాగే వేసుకుంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అందుకే ఆ కూరను వేడి చేసుకుని తింటే అందులో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయి. అలాగని చెప్పి రోజుల తరబడి ఫ్రిడ్జ్ లోనే ఉంచి వేడి చేసుకుని తింటే లేనిపోని రోగాలు వస్తాయి. పచ్చి చికెన్ ను తాకినప్పుడు, దాన్ని వండుతున్నప్పుడు చేతులను తరచుగా శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్ తో పాటు ఇతర పదార్థాలను వండుతున్నప్పుడు వాటిని వేరువేరు పాత్రల్లో ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదు. పచ్చి చికెన్ ను తాకిన చేతులతో ఇతర ఆహార పదార్థాలను వండకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా వేడివేడి చికెన్ ను ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేయకూడదు. చికెన్ ఆరోగ్యానికి మంచిదైన మాత్రాన అదేపనిగా తింటే జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయి. మరిముఖ్యంగా ఉడికి ఉడకని చికెన్ వల్ల క్యాన్సర్ ముప్పు ఉంటుంది. సుమారు 120 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కనీసం 80 నిమిషాల పాటు చికెన్ ఉడికిస్తేనే అందులో ఉన్న సూక్ష్మజీవులు చనిపోయి శరీరానికి క్యాలరీలు లభిస్తాయి.
Also Read: Chiranjeevi- Janasena: చిరంజీవి వ్యాఖ్యలతో జనసేనకు పెరుగనున్న ఓటుబ్యాంకు?