Memory Loss: పొద్దున్నే హడావుడిగా స్కూలుకెళ్తారు విద్యార్థులు. కానీ పెన్ను, పెన్సిల్ మరిచిపోతారు.. 9 గంటలకు బిజీ బిజీగా ఆఫీసుల్లోకి వెళ్తారు ఉద్యోగులు. కానీ ముఖ్యమైన పత్రాలు పట్టుకెళ్లరు.. మిగతా వారికంటే ముందే షాపు తీయాలనే ఆత్రుతతో పరుగెడెతారు వ్యాపారులు.. కానీ షాప్ కీ నే మరిచిపోతారు… ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఏదో రకంగా మతిమరుపు నేటి కాలంలో ఎక్కువవుతోంది. జీవితం చాలా చిన్నది. ఉన్నంతకాలం అన్నీ చేయాలి. అన్నీ అనుభవించాలనే ఆరాటంతో ఉరుకులు, పరుగుల జీవితానికి అలవాటుపడుతున్నారు చాలా మంది. కానీ ఈ హడావుడిలో ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని గ్రహించడం లేదు. ఇలా అన్నీ పనులు ఆగమాగం చేసే కన్నా.. కొన్ని పనులు ప్రశాంతంగా చేయడం వల్ల అన్నీ సక్రమంగా ఉంటాయి. అయితే చాలా మంది ప్రశాంతంగా చేసినా మతిమరుపు వెంటాడుతోంది. అందుకు మనం తినే ఆహారమేనా? ఆ వివరాలు చూద్దాం.
నేటి కాలంలో చాలా మంది ఏ పనిని ప్రశాంతంగా చేయడం లేదు. ప్రతీ పనిలో ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. ఇన్ టైంలో పేపర్స్ రెడీ చేయాలని.. పడుకునే ముందు హోం వర్క్ కంప్లీట్ చేయాలని ప్రతి ఒక్కరూ టెన్షన్ తో గడుపుతున్నారు. ఒత్తిడితో పాటు ఎక్కువ స్ట్రెస్ కలిగిన వారిలో మతిమరుపు వస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. మతిమరుపు ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే ఉండేది. కానీ నేడు యువత కూడా ఈ సమస్యతో బాధపడుతుంది. దీంతో తాము చేసే పనుల్లో నష్టాలను ఎదుర్కొంటున్నారు. మెమొరీ పవర్ తగ్గడానికి కేవలల ఇవి మాత్రమే కాకుండా తీసుకునే ఆహారం కూడా ఉంటుందని అంటున్నారు.
కొంత మంది మద్యంకు బానిసలవుతారు. చుక్క లేనిదే వారికి పొద్దు గడువదు. వాస్తవానికి టెన్షన్ తగ్గడానికి ఒకటి, రెండు పెగ్గులు తాగాలంటారు. కానీ ఇందులో ఉండే కిక్కుకు బానిసై అతిగా మద్యం సేవిస్తారు. దీంతో ఈ ప్రభావం మెదడుపై పడుతుంది. టెన్షన్ నుంచి రిలీఫ్ కావడానికి మద్యం అనుకుంటే అది పూర్తిగా కొన్ని విషయాలను మరిచిపోయేవిధంగా చేస్తుంది. దీంతో రోజు వారి పనులను ఇది ఇబ్బంది పెడుతుంది. ఇక మద్యం మాత్రమే కాకుండా ఎక్కువగా మాంసం తినేవారిలోనూ ఈ సమస్య వెంటాడుతుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఎక్కవగా మాంసాహరం తినడం వల్ల అధిక కొవ్వు పేరుకుపోయి ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మతిమరుపు ఉంటే.. దానిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం మైండ్ ఎక్సర్ సైజ్ చేయాలి. అంటే వెయ్యి లేదా 10 వేల వరకు కౌంట్ ను మనసులో చేయాలి. కొన్ని ఫోన్ నెంబర్లను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. మెడిటేషన్ చేస్తూ ఉండాలి. పనిచేసినంత సేపు బిజీ ఉన్నా.. కాస్త టైం తీసుకొని రిలాక్స్ అవ్వాలి. ఎవరితో ప్రశాంతంగా ఉండగలుగుతారో.. వారితో ఎక్కువ సమయం గడపాలి..