
ప్రస్తుత కాలంలో మనలో చాలామంది నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కంటినిండా నిద్ర లేకపోయినా, ఒత్తిడి, డిప్రెషన్ లో ఉన్నా, కంటి సమస్యలు ఉన్నా కళ్ల కింద నల్లని చారలు వస్తాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం, ఫ్లూయిడ్ లోపం కూడా నల్ల చారలకు కారణమవుతాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కళ్ల కింద నల్లని చారలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా కళ్ల కింద నల్లటి చారలకు చెక్ పెట్టవచ్చు. కంటినిండా నిద్రపోతూ, ఆరోగ్యకరమైన డైట్ ను అలవరచుకుని కంటి క్రీములను వినియోగిస్తే నల్లటి చారలు తొలగిపోతాయి. దోసకాయ మాస్క్ తో నల్లటి చారలకు సులువుగా చెక్ పెట్టవచ్చు. సన్నగా కట్ చేసిన కీరదోసకాయను కళ్లపై పెట్టి కొంత సమయం రిలాక్స్ అయితే కళ్లు ఫ్రెష్ గా కనిపించే అవకాశం ఉంటుంది.
గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ బ్యాగులను నీళ్లలో మరిగించి టీ బ్యాగ్స్ చల్లారిన తరువాత కళ్లపై పెట్టుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. టమోటాలో నిమ్మరసం, శనగపిండి, పసుపు వేసి పేస్ట్ లా చేసుకుని ఆ పేస్ట్ ను కళ్ల చుట్టూ అప్లై చేసి కళ్లు శుభ్రం చేసుకుంటే నల్లటి చారల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రి సమయంలో కంటి చుట్టూ ఆల్మండ్ క్రీమ్ రాసినా మంచి ఫలితాలు ఉంటాయి. పత్తి ఉండలను రోజ్ వాటర్ లో డిప్ చేసి ఆ కాటన్ బాల్స్ ను కనురెప్పలపై పెట్టుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.
పుదీనా ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని కంటిచుట్టూ ప్యాక్ లా వేసుకున్నా నల్లటి చారలు తగ్గుతాయి. ఆరెంజ్ జ్యూస్ మరియు గ్లిజర్ సమంగా తీసుకుని బాగా మిక్స్ చేసి ప్రతిరోజూ అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది.